సాయంత్రం రోటీల్లోకి ఇలా ఉల్లిపాయ పచ్చడి చేసుకోండి, అన్నంలోకి కూడా ఇదే కావాలంటారు!-craving something different make this amazing and delicious onion chutney for rotis and rice ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  సాయంత్రం రోటీల్లోకి ఇలా ఉల్లిపాయ పచ్చడి చేసుకోండి, అన్నంలోకి కూడా ఇదే కావాలంటారు!

సాయంత్రం రోటీల్లోకి ఇలా ఉల్లిపాయ పచ్చడి చేసుకోండి, అన్నంలోకి కూడా ఇదే కావాలంటారు!

Ramya Sri Marka HT Telugu

ఉల్లిపాయ పచ్చడి రెసిపీ: సాయంత్రం రోటీల్లోకి కొత్తగా, రుచిగా ఏదైనా తినాలని ఉందా? ఐతే ఉల్లిపాయతో ఇలా పచ్చడి చేసుకోండి. దీని రుచి ముందు కొత్తిమీర, పుదీనా చట్నీలు కూడా పనికి రావు, అంత రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు. ఎలాగో చూసేయండి..

ఉల్లిపాయ పచ్చడి తయారీ (Shutterstock)

చట్నీ తింటే నోటికి రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా వంట చేయడానికి మూడ్ లేనప్పుడు లేదా రోజూ తినే కూరలు కాకుండా ఏదైనా కొత్తగా తినాలనిపించినప్పుడు చట్నీ చేసుకుని తింటుంటాం. సాధారణంగా చట్నీని సైడ్ డిష్‌గా తింటారు. కానీ దాని రుచికి చాలామంది ఇతర వంటలను కూడా మర్చిపోయి మొత్తం దీంతోనే లాగించేస్టారు. ఈరోజు అలాంటి ఒక అద్బుమైన చట్నీ రెసిపీని మీ కోసమ తీసుకొచ్చాం. అదే ఉల్లిపాయ పచ్చడి.

ఇది తిన్న తర్వాత మీరు కూడా వేరే కూరలేమీ లేకుండా రోటీలు, చపాతీలతో నిండిన ప్లేటును ఖాళీ చేసేస్తారు. దీన్ని రోటీ, పరాటా, అన్నం, దోస, ఇడ్లీ ఇలా దేనితోనైనా తినవచ్చు. ఈ చట్నీ రుచిలో మాత్రమే కాదు వాసన కూడా మీ నోట్లో నీళ్లు ఊరేలా చేస్తుంది. ఆలస్యం చేయకుండా ఉల్లిపాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి.

ఉల్లిపాయ చట్నీ చేయడానికి కావలసిన పదార్థాలు:

  • 3 మీడియం సైజు ఉల్లిపాయలు,
  • 6-7 వెల్లుల్లి రెబ్బలు,
  • 8-10 ఎండు మిరపకాయలు,
  • కరివేపాకు,
  • 1 స్పూన్ చింతపండు గుజ్జు,
  • 1 స్పూన్ శనగపప్పు,
  • 2 స్పూన్ల మినపప్పు,
  • నూనె,
  • 1 స్పూన్ ధనియాలు,
  • 1 స్పూన్ జీలకర్ర,
  • అర స్పూన్ ఆవాలు,
  • చిటికెడు ఇంగువ,
  • రుచికి సరిపడా ఉప్పు,
  • 1 స్పూన్ కారం.

ఉల్లిపాయ చట్నీ ఎలా తయారు చేయాలి

  1. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి రెండు లేదా మూడు స్పూన్ల నూనె వేడి చేయాలి.
  2. నూనె కాస్త వేడయ్యాక అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
  3. తరువాత దీంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసి కొద్దిసేపు వేయించాలి.
  4. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, 8-10 ఎండు మిరపకాయలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు వేయించాలి.(చిన్న మంట మీద మాత్రమే వేయించాలని గుర్తుంచుకోండి).
  5. ఇప్పుడు 3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని ముక్కలుగా కట్ చేసి పాన్‌లో వేయాలి.
  6. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు అంటే సుమారు మూడు నుండి నాలుగు నిమిషాలు వేయించాలి.
  7. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే అందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి.
  8. ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగులోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ చింతపండు గుజ్జు లేదా నిమ్మరసం వేసి బాగా కలపాలి.
  9. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి.
  10. మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా వేసుకోవచ్చు.

చట్నీకి తాలింపు ఎలా పెట్టాలి:

  1. తాలింపు వేయడానికి స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి కొద్దిగా నూనె వేడి చేయాలి.
  2. నూనె వేడయ్యాక అందులో అర స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ మినపప్పు, చిటికెడు ఇంగువ వేసి వేయించాలి.
  3. ఈ తాలింపు వేగిన తర్వాత రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ చట్నీ పేస్ట్‌ను వేసి కలపాలి.
  4. మంచి రంగు కోసం 1 స్పూన్ కారం వేసి కలపాలి.
  5. చట్నీ కొద్దిగా చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి.
  6. ఇలా పైకి నూనె తేలే వరకు పచ్చడిని ఉడికించి కొత్తిమీరతో గార్నీష్ చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన ఉల్లిపాయ చట్నీ రెడీ అయినట్టే. దీన్ని అన్నం, రోటీ, దోస ఇలా మీకు నచ్చిన ఆహారంతో ఆస్వాదించండి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.