నోరూరించే స్పానిష్ వంటకం చుర్రోస్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఈ సింపుల్ రెసిపీతో క్షణాల్లో రెడీ-craving delicious spanish churros made at home ready with this simple recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  నోరూరించే స్పానిష్ వంటకం చుర్రోస్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఈ సింపుల్ రెసిపీతో క్షణాల్లో రెడీ

నోరూరించే స్పానిష్ వంటకం చుర్రోస్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఈ సింపుల్ రెసిపీతో క్షణాల్లో రెడీ

Ramya Sri Marka HT Telugu

చుర్రోస్.. బయట క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే ఈ వంటకాన్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. వంటింట్లోని సింపుల్ ఐటమ్స్‌తో క్షణాల్లో సర్వ్ చేసుకోవడానికి సింపుల్ రెసిపీ ఫాలో అవ్వండి. అందుబాటులో ఉండే వస్తువులతో చేసిన స్నాక్స్ ఫ్యామిలీతో కలిసి టేస్ట్ చేయండి.

చుర్రోస్ ప్రతీకాత్మక చిత్రం

చుర్రోస్ అనే పదం మన నేటివిటీకి కాస్త కొత్తగానే అనిపించినా టేస్ట్ కు మాత్రం చాలా దగ్గరగా అనిపించే ఫుడ్. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ స్పానిష్ డెజర్ట్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవడం చాలా సులువు. వంటింట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో, క్షణాల్లో నోరూరించే చుర్రోస్‌ను మీరూ చేసుకోవచ్చు. ఈ రెసిపీతో మీరు ఇంట్లోనే అచ్చమైన చుర్రోస్ రుచిని ఆస్వాదించగలరు. మరి ఆలస్యం చేయకుండా, ఈ సింపుల్ అండ్ టేస్టీ చుర్రోస్ ఎలా తయారుచేయాలో చూసేద్దామా?

కావలసిన పదార్థాలు:

  • నీరు - 1 కప్పు
  • వెన్న - 1/2 కప్పు (సుమారు 113 గ్రాములు)
  • ఉప్పు - 1/4 టీస్పూన్
  • చక్కెర - రెండు టేబుల్ స్పూన్లు (ఒక టేబుల్ స్పూన్ పిండిలో కలుపుకోవడానికి, రెండో టేబుల్ స్పూన్ పైన చల్లుకోవడానికి)
  • మైదా పిండి - 1 కప్పు
  • గుడ్డు - 1
  • నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడ
  • దాల్చిన చెక్క పొడి - కావాలనుకుంటే మాత్రమే

తయారీ విధానం:

  1. ముందుగా ఒక సాస్‌పాన్‌ తీసుకోండి. అందులో నీరు, వెన్న, ఉప్పు, చక్కెర వేసి మీడియం ఫ్లేమ్ పై వేడి చేయండి.
  2. వెన్న కరిగే వరకు మరిగించండి, ఆ తర్వాత మంటను తగ్గించి, అందులో మైదా పిండి వేసుకోండి.
  3. పిండి ముద్దగా తయారై పాన్ నుండి విడిపోయే వరకు గట్టిగా కలపండి (వీడియోలో చూపిన విధంగా).
  4. గ్యాస్ ఆఫ్ చేసి కొన్ని నిమిషాలు చల్లారనివ్వండి.
  5. తర్వాత గుడ్డు వేసి పిండి మళ్లీ కలిసిపోయే వరకు బాగా కలపండి.
  6. కొంచెం గడ్డలుగా అనిపిస్తే, ఇంకాస్త ఎక్కువసేపు కలుపుతూ ఉండండి. కొన్ని నిమిషాల్లో సాఫ్ట్ గా కలిసిపోతుంది.
  7. ఇప్పుడు మీరు తయారుచేసుకున్న పిండి ముద్దను ఒక పైపింగ్ బ్యాగ్‌లో (లేదా జిప్ లాక్ బ్యాగ్‌లో వేసి ఒక చివర చిన్నగా కట్ చేసుకోండి) వేసుకోండి.
  8. కడాయిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత నేరుగా నూనెలో చిన్న చిన్న చుర్రోస్‌లా వేయండి.
  9. కావాలనుకుంటే, ముందుగా బేకింగ్ పేపర్‌పై పైప్ చేసి ఆ తర్వాత నూనెలో వేయవచ్చు.
  10. పిండి చల్లబడితే పైప్ చేయడం కష్టమవుతుంది కాబట్టి వెంటనే చేయాలి.
  11. చుర్రోస్‌ను బంగారు రంగు వచ్చే వరకు మీడియం మంటపై వేయించండి.
  12. వేయించిన చుర్రోస్‌ను నూనె నుండి తీసి కాసేపు ఆరనివ్వండి.
  13. వేడిగా ఉన్నప్పుడే చక్కెర, దాల్చినచెక్క పొడి చల్లుకోండి.
  14. మీకు ఇష్టమైన డిప్పింగ్ సాస్‌తో (చాక్లెట్ సాస్ వంటివి) పెట్టుకుని సర్వ్ చేయండి.

ఈ రుచికరమైన చుర్రోస్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవడం ఎంత సులువో చూశారు కదా. వీటిని వేడి వేడిగా తింటేనే రుచి అమోఘంగా అనిపిస్తుంది. మీరూ తప్పకుండా ట్రై చేసి, మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించండి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.