చల్లచల్లటి నోరూరించే మఖానా ఫ్రూట్ సలాడ్! ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు, ఇదిగోండి సింపుల్ రెసిపీ!-cool down with refreshing makhana fruit salad and beat the heat ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  చల్లచల్లటి నోరూరించే మఖానా ఫ్రూట్ సలాడ్! ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు, ఇదిగోండి సింపుల్ రెసిపీ!

చల్లచల్లటి నోరూరించే మఖానా ఫ్రూట్ సలాడ్! ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు, ఇదిగోండి సింపుల్ రెసిపీ!

Ramya Sri Marka HT Telugu

ఎండలు పెరుగుతున్న కొద్దీ చల్లటి, తియ్యటి పదార్థాలు తినాలనే కోరిక పెరుగుతుంది. అది ఆరోగ్యానికి మేలు చేసేది అయితే మరీ మంచిది అని అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుంటే ఈ సూపర్ టేస్టీ, హెల్తీ మఖానా ఫ్రూట్ సలాడ్ రెసిపీ మీ కోసమే! దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి.

మఖానా, పాలు, పండ్లతో తయారు చేసిన సలాడ్

రోజు రోజుకీ భానుడి సెగ ఎక్కువ అయిపోతుంది. బయటికి వెళ్లాలంటే భయంగా ఉంటుంది. ఇంట్లోనే కూర్చుంటే చల్లగా, తియ్యగా ఏదైనా తీసుకోవాలనే కోరిక కూడా పెరుగుతుంది. చల్లటి, ఆరోగ్యకరమైన పానీయాలు, పదార్థాల ఏమున్నాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. సరిగ్గా మీకు కూడా ఇలాగే జరుగుతుందా. బాధపడకండి ఇందులో తప్పేం లేదు. మీ కోరికను తీర్చే అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చాం. ఇది చల్లగా, తియ్యాగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అదే అదే మఖానా ఫ్రూట్ సలాడ్!

ఈ సలాడ్ కేవలం ఒక డెజర్ట్ మాత్రమే కాదు... ఇది మీ శరీరానికి చల్లదనాన్నిచ్చే ఒక దివ్యౌషధం. మృదువైన మఖానా, తియ్యటి బెల్లం, పాలు కలిసి ఒక కమ్మని రుచినిస్తాయి. ఇక రంగురంగుల పండ్ల ముక్కలు కంటికి ఇంపుగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. దీన్ని తయారు చేయడం చాలా సులువు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వేసవిని మరింత ఆహ్లాదకరంగా మార్చే ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన మఖానా ఫ్రూట్ సలాడ్‌ను ట్రై చేసేద్దాం పదండి.

మఖానా ఫ్రూట్ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

  • ఒక కప్పు మఖానా
  • 15 జీడిపప్పులు
  • 10 బాదం పప్పులు
  • చిటికెడు యాలకుల పొడి
  • చిటికెడు కుంకుమపువ్వు
  • ఒక కప్పు పాలు
  • అర కప్పు లేదా మీ రుచికి తగినంత బెల్లం
  • అరటి పండు
  • ద్రాక్ష- మీకు నచ్చినన్ని
  • దానిమ్మ- మీకు నచ్చినన్ని
  • యాపిల్- సగం

మఖానా ఫ్రూట్ సలాడ్ తయారీ విధానం:

  1. ముందుగా గిన్నె తీసుకుని దాంట్లో పాటు పోసి వేడి చేయండి.
  2. పాలు వేడెక్కే లోపు ఒక బౌల్ తీసుకుని దాంట్లో మఖానా, జీడి పప్పు పలుగులు, బాదం పప్పులు వేయండి.
  3. తరువాత దీంట్లోనే యాలకుల పొడి, కుంకుమ పొడి వేయండి.
  4. ఇప్పుడు వేడివేడి పాలను ఈ బౌల్ లో పోసి అరగంట పాటు నానబెట్టండి.
  5. అరగంట దాటిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో రుచికి సరిపడా బెల్లం తురుమును వేసుకోండి.
  6. దీన్ని మెత్తటి పేస్టులా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి తీసుకుని మూత పెట్టి ఫ్రిజ్ లో పెట్టండి.
  7. అరగంట నుంచి గంట వరకూ ఇది ఫ్రిజ్ లోనే ఉండటం మంచిది.
  8. ఈ లోపు మీ నచ్చిన పండ్లు అంటే దానిమ్మ గింజలు, ఆపిల్, ద్రాక్ష వంటి వాటన్నింటినీ చిన్న చిన్న ముక్కులగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి.
  9. గంట తర్వాత చల్లగా తయారైన పాల మిశ్రమాన్ని బయటికి తీసి దాంట్లో పండ్ల ముక్కలన్నీ వేసి కలిపారంటే హెల్తీ మఖానా ఫ్రూట్ సలాడ్ రెడీ అయినట్టే.
  10. బయట ఎండలు మండుతుంటే చల్లగా చల్లగా దీన్ని తిన్నారంటే కడుపులో చల్లగా ఉంటుంది. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ దీన్ని ఇష్టంగా తింటారు. మళ్లీ మళ్లీ కావాలని మారం చేస్తారు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.