Clay pot: మట్టికుండల్లో ఆహారాన్ని వండితే ఎంతో ఆరోగ్యం, కానీ మట్టికుండలను వాడే ముందు వాటిని ఇలా శుభ్రపరచండి-cooking food in earthen pots is very healthy but clean the earthen pots before using them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Clay Pot: మట్టికుండల్లో ఆహారాన్ని వండితే ఎంతో ఆరోగ్యం, కానీ మట్టికుండలను వాడే ముందు వాటిని ఇలా శుభ్రపరచండి

Clay pot: మట్టికుండల్లో ఆహారాన్ని వండితే ఎంతో ఆరోగ్యం, కానీ మట్టికుండలను వాడే ముందు వాటిని ఇలా శుభ్రపరచండి

Haritha Chappa HT Telugu
Aug 15, 2024 08:00 AM IST

Clay pot Cooking: మట్టి కుండలో ఆహారాన్ని వండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కూడా ఈ పాత్రలను మొదటిసారి వంటకు ఉపయోగిస్తుంటే, ముందుగా వాటిని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకోండి.

మట్టి పాత్రలు
మట్టి పాత్రలు (shutterstock)

ఆధునిక కాలంలో వంటకు అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ పూర్వం కేవలం మట్టికుండలు మాత్రమే ఉండేవి. మట్టి కుండలో వండిన ఆహారం రుచే వేరు. అందులో వండిన ఆహారాన్ని తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మట్టికుండలో వండిన ఆహరాన్ని తినడం వల్ల అనేక రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే మట్టికుండలు వాడడం కాస్త కష్టంగా అనిపించడం, అవి త్వరగా విరిగిపోయే అవకాశం ఉండడం వల్ల వాటిని వాడే వారి సంఖ్య అరుదుగా మారింది. ఇప్పుడు మళ్లీ మట్టికుండలను వాడే వారి సంఖ్య పెరుగుతోంది. మట్టి కుండను మొదటిసారి ఉపయోగించే ముందు వాటిని ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోండి.

మట్టికుండను తొలిసారి ఇలా వాడండి

మట్టి కుండను కొత్తగా కొన్న తరువాత వాడే ముందు మెత్తటి వస్త్రంతో శుభ్రం చేయండి. దాని కోసం ఏదైనా కాటన్ క్లాత్ తీసుకుని బాగా తుడవాలి. ఇది పూర్తిగా శుభ్రపడి, అందులోని దుమ్ము కూడా తొలగిపోయిన తర్వాత ఒకసారి గిన్నెల సోపుతో తోమి ఎండబెట్టాలి.

మట్టి కుండలో వండడానికి ముందు కనీసం 12 గంటలు నీటిలో నానబెట్టాలి. రాత్రిపూట ఇలా నీటిలో నానబెట్టి వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం ఈ పాత్రలోని నీటిని వంపేసి మళ్లీ కాటన్ వస్త్రంతో బాగా తుడవాలి. తరువాత ఎండలో ఆరబెట్టాలి. కావాలనుకుంటే కాసేపు గదిలో శుభ్రమైన ప్రదేశంలో ఉంచి ఆరబెట్టినా చాలు.

కడిగి ఆరబెట్టిన మట్టికుండను ఉపయోగించే ముందు నూనె రాయాలి. ఇందుకోసం మీరు ఆవ నూనెను ఉపయోగించవచ్చు. లేదా మట్టికుండలో కాస్త నూనె వేసి పాత్ర అడుగుభాగమంతా అంటేలా చూడాలి. తరువాత చిన్న మంట మీద వేడి చేయాలి. ఆ తరువాత ఆ మట్టికుండ వంటకు సిద్ధంగా ఉన్నట్టే.

మట్టి పాత్రలను గ్యాస్ పై వండడం వల్ల అవి విరిగిపోతున్నట్లు మహిళలు తరచుగా ఫిర్యాదు చేస్తారు. ఇలా జరిగితే, దానిని ఉపయోగించేటప్పుడు స్టవ్ పై చిన్న మంటను ఉంచండి. అధిక మంటపై వండితే మట్టి పాత్రలు విరిగిపోయే ప్రమాదం ఉంది.

మట్టి కుండలో వంటలు చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా జీవిస్తారు. మట్టికుండలో వేసిన నీరు తాగినా ఆరోగ్యానికి మంచిదే. మట్టిపాత్రలకు సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. దీని వల్ల వేడి ఆహారం అంతటా విస్తరిస్తుంది. ఆహారం అన్ని వైపులా ఒకేలా ఉడుకుతుంది. పోషకాలు కూడా బయటికిపోవు. అధిక రుచి కూడా వస్తుంది. మట్టి పాత్రల్లో వండిన ఆహారంలో ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. మట్టికుండల్లో వండే ఆహారానికి మంచి సువాసన వస్తుంది. ఆ ఆహారం తినాలన్న కోరికను పెంచుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మట్టిపాత్రల్లో వండే ఆహారం ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మట్టి కుండల్లో అన్నం ఆరోగ్యకరమైన పద్ధతిలో ఉడుకుతుంది. పీహెచ్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి.

టాపిక్