జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే అది సాధించేవరకు మరొక ఆలోచన చేయకూడదు. అలా చేయకుండా ఉండాలంటే కోతిలాంటి మనసు పట్ల నియంత్రణ ఉండాలి. పంచేంద్రియాలపై నిగ్రహం చాలా అవసరం. ఎవరైతే తమ మనసును నియంత్రణలో ఉంచుకుంటారో, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటారో వారు జీవితంలో అనుకున్నది సాధించే తీరుతారు. ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు.
ఇంద్రియ నిగ్రహానికి మనసుపై నియంత్రణ సాధించేందుకు అర్జునుడినే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక రాత్రి అందమైన అప్సరస ఊర్వశి అతని వద్దకు వచ్చి నిలుచనుంది. ఆ సమయంలో కూడా అర్జునుడికి తన లక్ష్యం మాత్రమే గుర్తొచ్చింది. ఇంద్రియ నిగ్రహంతో ఆమె ఎంత కవ్వించిన తన మనసును నియంత్రణలో ఉంచుకున్నాడు. ఆమెను గౌరవంగా చూసాడు. తల్లి అని గౌరవంగా పిలిచాడు. అందుకే అర్జునుడి గురించి ఇప్పటివరకు చెప్పుకుంటూనే ఉంటారు. ఊర్వశి ఎదురొచ్చినా కూడా చలించని అర్జునుడిలా ఉండాలని అంటారు. ఇంత అసమానమైన స్వీయ నియంత్రణ ఉంది కాబట్టే అతను మహాపురుషుడు అయ్యాడు.
అర్జునుడిలాగే మన దైనందిన జీవితంలో కూడా మనసు నియంత్రణలో ఉంచుకోవడం ఎంతో అవసరం. కోపతాపాలకు, రాగద్వేషాలకు గురైన ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతే ఒక్కోసారి జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఒక మనిషికి సహనం ఎంతో అవసరం. ప్రశాంతంగా సహనంతో వేచి ఉండండి. మీరు అనుకున్న పనులు, లక్ష్యాలు నెరవేరుతాయి. ప్రశాంతమైన వ్యక్తి చాలా ఎక్కువ సాధిస్తాడని, అతనికి స్వీయ నియంత్రణ శక్తి అధికంగా ఉంటుందని కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు.
మన దేశానికి చెందిన ఉత్తమ చారిత్రక వ్యక్తుల్లో స్వామి వివేకానంద ఒకరు. ఈ చారిత్రక వ్యక్తి సంయమనానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆయన మన భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఎన్నో దేశాలకు తిరిగారు. ఆ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి, విమర్శలు వచ్చాయి. హేళనలు వినిపించాయి. అయినా కూడా ఆయన ఎవరిపైన కోపాన్ని ప్రదర్శించలేదు. తెలివిగానే సమాధానాలు ఇస్తూ ప్రయాణాన్ని కొనసాగించారు. అతనికి ఉన్న స్వీయ నియంత్రణ అతనికి లక్ష్యానికి చేరువ చేసింది. అందుకే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆయన ఒక ప్రేరణగా మారారు.
ఒక మనిషికి తెలివితేటలు, స్వీయ నియంత్రణ, క్షమా గుణం ఉంటే చాలు. అతడు తన జీవితంలో ఆనందంగా జీవించగలడు. అంతేకాదు తనతో పాటు జీవించే వారిని కూడా సంతోషంగా ఉంచగలడు. అనుకున్న పనులు సాధించగలడు.
సంబంధిత కథనం