తెల్లారితే చాలు వేడి వేడిగా కాఫీ తాగందే చాలా మందికి రోజు గడవదు. సాయంత్రం పని ఒత్తిడిని వదిలించుకోవాలన్నా కాఫీ పడాల్సిందే. ఇలా మిమ్మల్ని ఎప్పటికప్పుడు రిఫ్రెషింగ్ మార్చే కాఫీ కేవలం తాగడానికే కాదు, మీ జుట్టును మెరిపించడానికి కూడా పనికొస్తుందని మీకు తెలుసా? ముఖ్యంగా తెల్లగా, నిర్జీవంగా మారిన మీ వెంట్రుకలను నల్లగా, ఆకర్షణీయంగా మారుస్తుందంటే నమ్ముతారా? ఈ విషయం తెలుసుకున్నాక నమ్మాల్సిందే. కాఫీతో తలస్నానం చేస్తే మీ జుట్టుకు ఎలాంటి లాభాలు కలుగుతాయో, ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం రండి.
కాఫీతో తలస్నానం చేయడానికి ఇన్స్టంట్ కాఫీ కంటే ఆర్గానిక్ కాఫీ పొడిని ఉపయోగించడం ఉత్తమం. ఇది మీ జుట్టుపై మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది, మీ హెయిర్ కలర్‌ను సహజంగా ముదురుగా మార్చుతుంది. ఆరోగ్యంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
చాలా మంది తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి మెహందీ (హెన్నా)లో కాఫీ పొడిని కలుపుతారు. ఇది రసాయనాలు లేకుండా జుట్టు రంగును మార్చడానికి సహాయపడుతుంది. అయితే హెన్నా సాధారణంగా జుట్టుకు నారింజ రంగును ఇస్తుంది, కాఫీని కలపడం వల్ల ఆ రంగును తగ్గించి నలుపు రంగు వచ్చే అవకాశం ఉంటుంది.
కాఫీ పొడితో తలస్నానం చేయడం వల్ల జుట్టు చిట్లడం తగ్గుతుంది. జుట్టు పొడిబారకుండా ఉండటమే కాకుండా పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. కాబట్టి మీరు మీ జుట్టును మృదువుగా, మెరిసేలా, సహజమైన నలుపు రంగులోకి మార్చాలంటే ఈ కాఫీ ఐడియాను తప్పక ట్రై చేయండి.