కొబ్బరి గోరుచిక్కుడు కాయ కర్రీ తయారీ విధానం:
- ముందుగా, గోరుచిక్కుడు కాయలను శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలో వేయండి.
- అవి మునిగే వరకు నీళ్లు పోసి, చిటికెడు ఉప్పు వేసి, మెత్తగా ఉడకబెట్టండి. (కుక్కర్లో అయితే ఒక విజిల్ సరిపోతుంది).
- ఉడికిన తర్వాత నీటిని తీసేసి, గోరుచిక్కుళ్లను చల్లారనివ్వండి. ఇప్పుడు వాటికి రెండు వైపులా ఉండే పీచును జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోండి.
- ఒక మందపాటి గిన్నె లేదా కడాయిని పొయ్యి మీద పెట్టి, నూనె వేసి వేడి చేయండి.
- నూనె వేడయ్యాక, అందులో దంచుకున్న వెల్లుల్లిని వేసి బంగారు రంగులోకి మారే వరకు వేయించండి.
- ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు వేసి, ఆవాలు చిటపటలాడే వరకు వేయించాలి.
- ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒక్కసారి కలపండి.వెంటనే పసుపు కూడా వేసి కదిలించండి.
- ఇప్పుడు ఇంతకుముందే సిద్ధం చేసి ఉంచుకున్న గోరుచిక్కుళ్లను కడాయిలో వేయండి.
- మంటను మీడియంలో పెట్టి, గోరుచిక్కుళ్లు కొద్దిగా రంగు మారే వరకు, నూనెలో బాగా వేయించుకోండి.
- గోరుచిక్కుళ్లు చక్కగా వేగిన తర్వాత, పచ్చి కొబ్బరి తురుమును వేయండి. కొబ్బరి పచ్చి వాసన పోయే వరకు కొద్దిసేపు వేయించాలి.
- ఇప్పుడు కారం, రుచికి తగినంత ఉప్పు వేసి, కూర అంతా బాగా కలిసేలా గరిటెతో తిప్పండి.
- మంటను తగ్గించి, ఉప్పు, కారం గోరుచిక్కుళ్లకు బాగా పట్టే వరకు 2-3 నిమిషాలు వేయించి, స్టవ్ ఆపేయండి.
- అంతే.. నోరూరించే కొబ్బరి గోరుచిక్కుడు కూర రెడీ అయిపోయినట్లే. దీనిని వేడి అన్నంతో లేదా చపాతీలతో కలుపుకుని తినేయొచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు:
ఈ కొబ్బరి గోరుచిక్కుడు కూర కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. గోరుచిక్కుడులో ఉండే పీచు పదార్థం (ఫైబర్) జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే విటమిన్లు A, C, K వంటి ముఖ్యమైన పోషకాలను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చి కొబ్బరిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, మెదడు పనితీరుకు తోడ్పడతాయి.