Clove oil for hair: లవంగ నూనెను ఇలా వాడితే.. జుట్టు సమస్యలన్నీ పోయినట్లే..
Clove oil for hair: ఒత్తైన, ఆరోగ్యవంతమైన జుట్టుకోసం లవంగ నూనె చాలా ఉపయోగపడుతుంది. దాన్ని సరైన పద్ధతిలో ఎలా వాడాలో తెలుసుకోండి.
లవంగాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని చాలా రకాల సమస్యలకు మందులాగా వాడతారు. లవంగ మొగ్గ, నూనె, ఆకులు ప్రతిదీ రకరకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యం కాపాడుకోడానికి, కొన్ని ప్రయోజనాలు పొందడానికి లవంగాలను వాడొచ్చు. లవంగాలకున్న యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ లక్షణాలే దానికి కారణం. లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అయితే లవంగ మొగ్గల్ని వాడటం కాస్త సమయం తీసుకునే పనే. కాబట్టి లవంగ నూనెను వాడి మంచి ఫలితాలు పొందొచ్చు.
లవంగ నూనె ఎలా వాడొచ్చు?
జుట్టు పెరుగుదల కోసం:
ఒకటిన్నర చెంచాల ఆముదం, 4 చుక్కల లవంగ నూనె, 3 చెంచాల పెరుగు తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.
నిర్జీవంగా మారిన జుట్టు కోసం:
అరచెంచా చుక్కల లవంగ నూనెలో, నాలుగు నుంచి అయిదు చుక్కల ఆలివ్ నూనె కలపాలి. ముందుగా తలకు కాస్త తడిగా ఉన్న టవెల్ చుట్టుకుని, తీసేసి ఈ నూనె మిశ్రమాన్ని జుట్టుకు, మాడుకు మర్దనా చేయాలి. ఒక అరగంటయ్యాక కడిగేసుకుంటే చాలు. జుట్టుకు కొత్త మెరుపు వస్తుంది.
చుండ్రు సమస్య కోసం:
గుప్పెడు ఎండబెట్టిన కరివేపాకు అకులు, 1 కప్పు కొబ్బరి నూనె, 4 చుక్కల ఆలివ్ నూనె, 5 చుక్కల లవంగ నూనె తీసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును చూర్ణంగా చేసుకోవాలి. కొబ్బరినూనెను వేడి చేసి కరివేపాకు చూర్ణం వేసుకోవాలి. నూనె చల్లబడ్డాక లవంగ నూనె, ఆలివ్ నూనె వేసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు, మాడుకు పట్టించి రాత్రంతా అలా వదిలేయాలి. ఉదయాన్నే గాఢత తక్కువున్న షాంపూతో కడిగేసుకుంటే చాలు.
లవంగ నూనె లాభాలు:
లవంగ నూనెను జుట్టు ఆరోగ్యానికి వాడటం వల్ల చాలా లాభాలున్నాయి. అవేంటో చేసేద్దాం.
- జుట్టు పెరుగుదలకు:
లవంగ నూనెలో చాలా రకాల ఎసెన్షియల్ విటమిన్లు, మినరళ్లు ఉంటాయి. లవంగనూనెను నేరుగా కాకుండా వేరే నూనెతో కలిపి రాసుకోవడం వల్ల రక్త సరఫరా పెరుగుతుంది. దానివల్ల జుట్టు కుదుళ్లకు పోషకాలు, ఆక్సిజన్ అందుతాయి.
2. చుండ్రు తగ్గుతుంది:
చుండ్రు రావడానికి చాలా కారణాలుండొచ్చు. మాడు దురదగా ఉండటం. పొలుసులుగా ఊడటం వల్ల జుట్టు రాలడం కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు లవంగ నూనె వాడటం వల్ల ఫలితం ఉండొచ్చు. దీనికి యాంటీ ఫంగల్ లక్షణాలుంటాయి.
3. జుట్టు దృఢంగా మారుతుంది:
దీంట్లో ఉండే మినరళ్లు, విటమిన్లు జుట్టును బలంగా మారుస్తాయి. విటమిన్ ఇ, మాంగనీస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టును కుదుళ్ల నుంచి చివర్ల దాకా బలంగా మారుస్తాయి.
4. జుట్టు తెల్లబడకుండా:
తక్కువ వయసులోనే తెల్లజుట్టు సమస్య వేదిస్తుంటే లవంగ నూనెతో పరిష్కారం దొరుకుతుంది. జుట్టు నల్లబడటానికి అవసరమయ్యే పిగ్మెంట్ ఉత్పత్తిని లవంగనూనె పెంచుతుంది. దానివల్ల జుట్టు తెల్లబడటం తగ్గుతుంది.