Trendy Rakhis: కొత్త పండగకూ పాతరకం రాఖీలే కట్టేస్తారా? సోదరుడి కోసం ఈ ట్రెండీ రాఖీలు కొనాల్సిందే-choose latest trending rakhis for this raksha bandhan for your brother ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Trendy Rakhis: కొత్త పండగకూ పాతరకం రాఖీలే కట్టేస్తారా? సోదరుడి కోసం ఈ ట్రెండీ రాఖీలు కొనాల్సిందే

Trendy Rakhis: కొత్త పండగకూ పాతరకం రాఖీలే కట్టేస్తారా? సోదరుడి కోసం ఈ ట్రెండీ రాఖీలు కొనాల్సిందే

Koutik Pranaya Sree HT Telugu
Aug 09, 2024 12:30 PM IST

Trendy Rakhis: కొత్త పండగకు కూడా పాత రకం రాఖీ కడితే ఏం బాగుంటుంది. మీ సోదరుడికి మీ రాఖీతోనే ఆశ్చర్యం, ఆనందం రావాలంటే ఈ సంవత్సరం ట్రెండ్‌లో ఉన్న రాఖీలు కట్టేయండి.

సీక్రెట్ ఫొటో రాఖీలు
సీక్రెట్ ఫొటో రాఖీలు (pinterest)

రాఖీ పండగ వచ్చేస్తోంది. ఏటా ప్రత్యేకంగా రాఖీ కట్టాలనే కోరిక ప్రతి సోదరికి ఉంటుంది. ఈ ఏడాది కూడా మార్కెట్లోకి ట్రెండింగ్ రాఖీలు వచ్చేశాయి. చిన్న వయసు పిల్లల దగ్గర నుంచి పెద్దల ట్రెండ్‌కు సరిపోయే రకరకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ఇప్పుడు ఆర్డర్ పెడితేనే పండగ సమయానికి మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఒకసారి అవేంటో చూసేయండి.

సీక్రెట్ ఫొటో రాఖీలు:

ఇది వరకైతే కేవలం రాఖీ మీద పొటో ప్రింట్ చేసిచ్చే రాఖీలు బాగానే ట్రెండ్ అయ్యాయి. చిన్న ఫ్రేములో ఫొటో పెట్టి రెజిన్ వేసి వీటిని తయారు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక్క ఫోటోలో సోదరుడి మీద ప్రేమ ఎలా తెలియజేసేది అనుకునేవాళ్లకి ఈ సీక్రెట్ ఫోటో రాఖీలు తెగ నచ్చేస్తాయి. రాఖీ మీద భాగం తెరవగానే ఐదారు ఫోటోలు ఒక దాని తర్వాత ఒకటి బయటకొస్తాయి. రాఖీ పండగ అయిపోయాక ఈ రాఖీ లాకెట్‌ను ఫ్రిజ్ మ్యాగ్నెట్ లాగానూ వాడుకోవచ్చు. వీటి ధర రెండు వందల రూపాయల నుంచి మొదలవుతోంది.

డీఐవై రాఖీలు
డీఐవై రాఖీలు (pinterest)

డీఐవై రాఖీలు:

ఎంత విలువైన రాఖీ కొన్నా సరే. మీ చేత్తో తయారు చేసి కట్టిన రాఖీ ఎంత సింపుల్ గా ఉన్నా ప్రత్యేకంగా అనిపిస్తుంది. దానికోసం ఎలాంటి సృజనాత్మకతా అవసరం లేదు. ఇంట్లోనే దొరికే బియ్యం గింజలు, వడ్ల గింజలు, గుమ్మడి విత్తనాలు, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు లాంటివి అందంగా అతికిస్తే రాఖీ రెడీ అవుతుంది. ఒక అట్టముక్క గుండ్రంగా కత్తిరించి దానిమీద ఇవి మంచి డిజైన్లో అతికిస్తే చాలు. పక్కలకు డోరీలు అతికిస్తే రాఖీ రెడీ.

సీడ్ రాఖీలు:

మీ సోదరుడు, మీరు పర్యావరణ ప్రేమికులైతే మీకోసమే ఈ రాఖీలు. ఒక చెట్టుకు సంబంధించిన విత్తనానికి తొడుగులాగా మంచి డిజైన్ ఉంటుంది. లేదంటే ఒక మంచి డిజైన్ మధ్యలో విత్తనం అతికించి ఉంటుంది. ఈ విత్తనానికి వేసే తొడుగును టెర్రాకోట, ఫ్యాబ్రిక్ డిజైన్, ఎంబ్రాయిడరీ, స్టోన్లతో చేస్తారు. రాఖీ పండగ అయ్యాక ఆ డిజైన్ నుంచి విత్తనం తీసి చెట్టు నాటడమే. మిగతా డిజైన్ భాగం కీచైన్ లాగా వాడేసుకోవచ్చు.

చిన్న పిల్లల కోసం:

డీఐవై కిట్స్:

పిల్లలకు కూడా రాఖీ ప్రాముఖ్యత తెలియజాలి అనుకుంటే ఈ డీఐవై రాఖీ కిట్స్ మంచి ఎంపిక. రాఖీ తయారు కోసం కావాల్సిన డిజైన్లు, గ్లూ, స్టోన్స్ అన్నీ వీటిలో వస్తాయి. నాలుగైదేండ్ల పిల్లలు కూడా వీటిని వాడే సొంతంగా రాఖీలు తయారు చేసేయొచ్చు. వాళ్లు చేసిన రాఖీ కడుతుంటే భలే ఆనందపడతారు. ఒకసారి ప్రయత్నించండి.

మ్యూజికల్ రాఖీలు:

ఈ రాఖీల లోపల చిన్న స్పీకర్ ఉంటుంది. అందులో చిన్న రైమ్ లేదా మంత్రమో, పాటో రికార్డు చేసి ఉంటుంది. దీన్ని మనకిష్టమైన వాయిస్ తోనూ కస్టమ్ చేసే అవకాశం ఉంటుంది. ఒక మెసేజ్ ఏదైనా రికార్డు చేసి పంపిస్తే దాన్నే ఈ రాఖీలో వినొచ్చు. ఇవి చిన్నపిల్లలకు తెగ నచ్చేస్తాయి. వీటి ధర కాస్త ఎక్కువే. వెబ్‌సైట్ బట్టి మూడొందల నుంచి ధర ఉంటోంది.

ఎల్‌ఈడీ రాఖీలు:

లైట్లంటే పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది. అందుకే ఇలా లైట్లలతో మెరిసే చాలా రకాల రాఖీలు వచ్చేశాయి.ముఖ్యంగా ఎల్‌ఈడీ స్పిన్నర్ రాఖీలు ఈ సారి బాగా ట్రెండింగ్. చేతికి కట్టగానే ఒక బటన్ నొక్కితే లైట్లతో పాటే గిర్రున తిరిగే చక్రం ఉంటుంది. రాఖీలాగే కాకుండా మంచి ఆటవస్తువులాగా చిన్న పిల్లలకు నచ్చుతుందిది.

 

టాపిక్