Chanakya Niti Telugu : ఈ లక్షణాలు ఉన్న పిల్లలు కుటుంబ పేదరికాన్ని అంతం చేస్తారు
Chanakya Niti In Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో అందరి గురించి వివరించాడు. చిన్నారులకు ఉండాల్సిన లక్షణాలను కూడా తెలిపాడు.
చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త, సమాజానికి చాలా ఉపయోగకరమైన విధానాలను అందించాడు. గొప్ప గురువుగా నేటికీ చాలామంది ఆయనను చూస్తారు. చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు అంగీకరించడం వల్ల వ్యక్తి జీవితంలో చాలా సానుకూల మార్పులు వస్తాయి. చాణక్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన చాణక్య నీతి నేటికీ చాలా మంది ఫాలో అవుతారు.
చాణక్యుడి అనుభవాల సంకలనమైన చాణక్య నీతిలో మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పాడు. గొప్ప రాజకీయ నాయకులు కూడా చాణక్యుడి సూత్రాలను పాటిస్తూ ఉంటారు. అందుకే వారు విజయవంతమైన నాయకులుగా ఎదిగారు.
మనందరికీ తెలిసినట్లుగా సమాజంలోని వ్యక్తులు ఒకరిపై ఒకరు ఆధారపడతారు. పరస్పర సంబంధంలో జీవిస్తారు. ఇది మంచి జీవనశైలికి దారి తీస్తుంది. దాన్ని అందరూ పాటించాలి. చాణక్యుడు పిల్లల గురించి కొన్ని విషయాలు చెప్పాడు. వారి కొన్ని లక్షణాలు కుటుంబాన్ని బాగు చేస్తాయని చాణక్యుడు చెప్పాడు.
సత్ప్రవర్తనతో మెలగాలి
చాణక్య నీతి ప్రకారం, మీ పిల్లలు కొన్ని ధర్మాలను కలిగి ఉంటే, మీ కుటుంబం స్వర్గంగా ఉంటుంది. అదే సమయంలో పిల్లల్లో చెడు లక్షణాలు ఉంటే ఆ ఇల్లు నరకమే అవుతుంది. తమ బిడ్డ ప్రతిభావంతుడనేది ఏ తల్లిదండ్రులకైనా గర్వకారణం. ఎందుకంటే ఇది వారి జీవితంలో గొప్ప సంపద, ఆనందం. అటువంటి పరిస్థితిలో సత్ప్రవర్తన కలిగి ఉండటం చాలా ముఖ్యం. పిల్లల సత్ప్రవర్తన వల్ల సమాజంలో తల్లిదండ్రుల గౌరవం కూడా పెరుగుతుంది.
విధేయత కలిగి ఉండాలి
విధేయతగల బిడ్డ జీవితాన్ని తల్లిదండ్రులకే కాకుండా మొత్తం కుటుంబానికి కూడా ఆనందదాయకంగా మారుస్తుందని చాణక్యుడు చెప్పాడు. అలాంటి పిల్లలు తల్లిదండ్రులకు, మొత్తం కుటుంబానికి కీర్తిని తీసుకొస్తారు. విధేయత, మంచి మర్యాదగల పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు అని చాణక్యుడు చెప్పాడు.
పెద్దలను గౌరవించే పిల్లలు
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు, స్త్రీలను ఎల్లప్పుడూ గౌరవించే పిల్లలు, మంచి, చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకుంటారు. వారే కుటుంబానికి గర్వకారణం అని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వ్యక్తులు చాలా విజయాలు సాధిస్తారు. సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందుతారు.
విద్యపై ఆసక్తి
విద్య ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞాన సముపార్జనలో ఎప్పుడూ ఆసక్తి చూపే పిల్లలు కుటుంబ గౌరవాన్ని నిలబెడతారని చాణక్యుడు చెప్పాడు. అలాంటి బిడ్డకు జ్ఞానానికి దేవత అయిన సరస్వతి, సంపదలకు దేవత అయిన లక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వారు మంచి విద్య ద్వారా తమ కుటుంబం, తల్లిదండ్రుల విలువను పెంచుతారు. జ్ఞానానికి మాత్రమే అన్ని రకాల చీకట్లను తొలగించే శక్తి ఉందని చాణక్యుడు చెప్పాడు.
తల్లిదండ్రుల మాట వినే పిల్లలు
చాణక్యుడు చెప్పిన ప్రకారం, తల్లిదండ్రుల మాట వినే కొడుకు సద్గుణవంతుడు. ఏదైనా పని చేసే ముందు తమ పెద్దల సలహాలు, ఆశీస్సులు కోరే పిల్లలు పుణ్యాత్ములుగా భావిస్తారు. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ విఫలం కాలేరు. పిల్లలు తమ తల్లిదండ్రుల విలువలను మరచిపోకుంటే ఇంట్లో సంతోషం ఉంటుంది. అంతే కాకుండా ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అలాంటి పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు. పైన చెప్పిన లక్షణాలు ఉన్న పిల్లలు జీవితంలో బాగా పైకి వస్తారు. డబ్బు సంపాదిస్తారు. కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేస్తారు.