చికెన్ మిరియాల రసం పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఎందుకంటే దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. స్పైసీగా ఉండే ఈ వంటకాన్ని ఒక్కసారి తింటే మర్చిపోలేరు. పైగా సీజనల్ గా వచ్చే వ్యాధులను అడ్డుకోవడంలో ఇది ముందుంటుంది. ఇందులో మనం ప్రధానంగా మిరియాలు, చికెన్, పసుపు వంటివి వాడతాము. ఇవన్నీ కూడా మనకు రోగనిరోధక శక్తిని పెంచి అంటువ్యాధులను దూరంగా ఉంచుతాయి. కాబట్టి చికెన్ మిరియాల రసం ఎలా చేయాలో తెలుసుకోండి.
చికెన్ - అర కిలో
ఉప్పు - రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను
ఉల్లిపాయలు - రెండు
చింతపండు - నిమ్మకాయ సైజులో
టమోటోలు - రెండు
నూనె - రెండు స్పూన్లు
ఆవాలు - ఒక స్పూన్
ధనియాల పొడి - ఒక స్పూను
మిరియాల పొడి - అర స్పూను
రసం పొడి - ఒక స్పూను
జీలకర్ర - అర స్పూను
ఎండుమిర్చి - నాలుగు
కరివేపాకులు - గుప్పెడు
కొత్తిమీర తరుగు - గుప్పెడు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - అర స్పూను
1. దీనికోసం ముందుగానే చికెన్ చిన్న ముక్కలుగా కోసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు అయితే త్వరగా ఉడకదు.
2. ఇప్పుడు ఒక గిన్నెలో ఆ చికెన్ ముక్కలను వేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి.
3. చింతపండును ఒక గిన్నెలో వేసి నానబెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
5. ఆ తర్వాత ఎండు మిర్చి, కరివేపాకులు కూడా వేసి బాగా వేయించుకోవాలి.
6. ఆ తరువాత సన్నగా తరిగిన ఉల్లి తరుగును వేసి అది రంగు మారేవరకు వేయించుకోవాలి.
7. ఉల్లిపాయల తరుగు రంగు మారిన తర్వాత సన్నగా తరిగిన టమోటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.
8. పైన మూత పెట్టి ఉడికిస్తే టమోటోలు గుజ్జులాగా మెత్తగా అవుతాయి.
9. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ని కూడా అందులో వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
10. ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి ధనియాల పొడి, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి.
11. ఈలోపు చింతపండు గుజ్జును బాగా నలిపి చింతపండును బయటపడేసి ఆ గుజ్జును కూడా అందులో వేసి బాగా కలపాలి.
12. ఇది ఉడుకుతున్నప్పుడే రసం పొడి కూడా వేసి తగినంత నీటిని వేసి బాగా ఉడికించుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి.
13. ఇప్పుడు పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.
14. అంతే టేస్టీ చికెన్ మిరియాల రసం రెడీ అయినట్టే.
చికెన్ మిరియాల రసం స్పైసీగా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. మీరు ఇడ్లీతో, దోశతో, అన్నంతో, చపాతీ తో కూడా దీన్ని తినవచ్చు. ఒక్కసారి చేసుకున్నారంటే దీని రుచి మర్చిపోలేరు. పైగా ఇది ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఇందులో ఉండే మిరియాలు, చికెన్ కలిపి మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. కాబట్టి ఒక్కసారైనా దీన్ని తినేందుకు ప్రయత్నించండి. మీకు కచ్చితంగా నచ్చి తీరుతుంది.