వీకెండ్స్‌లో విందు కోసమే వినియోగించే కోడి నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలెన్నో!-chicken often used for weekend feasts there are many great lessons we can learn ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  వీకెండ్స్‌లో విందు కోసమే వినియోగించే కోడి నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలెన్నో!

వీకెండ్స్‌లో విందు కోసమే వినియోగించే కోడి నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలెన్నో!

Ramya Sri Marka HT Telugu

ఆదివారం లేదా వీకెండ్ వస్తే కోడిని కోసుకుని తినేస్తాం. కుదిరితే రుచి గురించి కాసేపు మాట్లాడుకుంటాం. కానీ, ఆ కోడి జీవన విధానం, దాని నుంచి మనం ఏం నేర్చుకోగలమని ఎప్పుడైనా ఆలోచించారా.. పరిశీలించి చూస్తే ఊహకందని గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చు.

మేత కోసం వెదుకుతున్న కోళ్లు (Pexels)

కూర కోసం మాత్రమే చూసే కోడిలో నిజానికి, మన రోజువారీ జీవితానికి, వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన గుణాలు దాగి ఉన్నాయి. పగలంతా మన పెరట్లో లేదా వాకిట్లో గింజలు ఏరుకుంటూ, అటు ఇటు తిరిగే ఈ చిన్న పక్షి, మనం పెద్దగా పట్టించుకోని విషయాల్లో ఒకటి. కానీ, అది పాటించే క్రమశిక్షణ, పట్టుదల, నిస్వార్థ ప్రేమ గురించి తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. కోడి నుంచి కూడా మనం నేర్చుకోవాలా అని తిట్టుకోకండి. ఆ అమూల్యమైన పాఠాలు ఏంటో తెలుసుకోండి.

కోడిలో దాగి ఉన్న అద్భుతమైన లక్షణాలు:

నిర్ణీత దినచర్య, సమయపాలన:

కోడి జీవితంలో క్రమశిక్షణకు, సమయపాలనకు మించిన నిదర్శనం మరొకటి లేదు. కొద్ది శతాబ్దాల క్రితం నుంచి చాలా మందికి కోడికూతే అలారం. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే కచ్చితంగా కూసి, చీకటి పడగానే తన గూటికి చేరుకుంటుంది. ఈ కచ్చితమైన దినచర్యను అది ఎప్పుడూ తప్పదు. మన ప్రతి పనికి ఒక సమయాన్ని కేటాయించుకుని, దాన్ని క్రమం తప్పకుండా పాటించడం వల్ల మనం మరింత ప్రొడక్టివ్ గా పనిచేయగలుగుతాం, అనూహ్యమైన విజయాలు సాధిస్తాం.

పట్టుదల, నిరంతర శ్రమ:

కోడిని గమనించండి. అది ఆహారం కోసం నేలను నిరంతరం గీకుతూ, తవ్వుతూ ఉంటుంది. ఒక చోట ఆహారం దొరకకపోతే వెంటనే మరో చోటికి వెళ్లి వెతుకుతుంది. కానీ, ఎప్పుడూ ఆపదు. ఇది పట్టుదలకు ఒక గొప్ప ఉదాహరణ. మన జీవితంలో కూడా ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా, నిరాశ పడకుండా నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలని ఈ లక్షణాన్ని చూసి మనం స్పష్టంగా నేర్చుకోవచ్చు.

డెడికేషన్, నిస్వార్థ ప్రేమ:

కోడి తన పిల్లలను ఎంత ప్రేమగా చూసుకుంటుందో మాటల్లో వర్ణించలేం. అవి పొదగగానే, తన రెక్కల కింద దాచుకుని, బయటి ప్రమాదాల నుంచి, వాతావరణ మార్పుల నుంచి కాపాడుతుంది. తన పిల్లలకు చిన్న ప్రమాదం వస్తే, తన ప్రాణాలను పణంగా పెట్టి అయినా ముందుండి పోరాడుతుంది. ఇది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చూపించాల్సిన అంకితభావం, నిస్వార్థమైన ప్రేమ, అపారమైన బాధ్యత వంటి విలువలను తెలియజేస్తుంది.

అలవాటు పడటం:

కోళ్లు ఎలాంటి వాతావరణంలోనైనా, ఎలాంటి పరిస్థితులలోనైనా జీవించడానికి త్వరగా అలవాటు పడతాయి. కొత్త ప్రదేశాలకు, కొత్త వాతావరణాలకు సులభంగా సర్దుకుపోతాయి. ఇది మారుతున్న పరిస్థితులకు త్వరగా అలవాటు పడటం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. జీవితంలో అనుకోని సవాళ్లు ఎదురైనప్పుడు, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగడానికి ఈ లక్షణం ప్రతి ఒక్కరికీ చాలా అవసరం.

గుంపులుగా తిరుగుతున్న కోళ్లు
గుంపులుగా తిరుగుతున్న కోళ్లు

సామాజికత, కలిసి జీవించడం:

కోళ్లు ఎప్పుడూ ఒంటరిగా కాకుండా, గుంపులుగానే కలిసి జీవిస్తాయి. ఇది సోషల్ లివింగ్, హెల్పింగ్ నేచర్ ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. మనం కూడా సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉండటం, కలిసి పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలను దీని నుండి నేర్చుకోవచ్చు. ఐకమత్యంతో ఏ పనైనా సాధించవచ్చని కోడి మనకు నేర్పుతుంది.

సంతృప్తి, చిన్న విషయాలలో ఆనందం:

కోడికి కొద్దిగా ఆహారం దొరికితే చాలు, అది వెంటనే సంతృప్తి పడుతుంది. ఇది మన జీవితంలో చిన్న చిన్న విషయాలలో కూడా సంతోషాన్ని, సంతృప్తిని కనుగొనడం ఎలాగో కోడి మనకు నేర్పుతుంది. ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకుంటే జీవితం మరింత ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది.

నిశితంగా పరిశీలించి చూస్తే, ప్రకృతిలో ప్రతి జీవి మనకు ప్రేరణగానే ఉంటుంది. మీలో సానుకూల ఆలోచనలు ఉంటే, కోడి లాంటి పక్షి కూడా గొప్ప పాఠాలు నేర్పిస్తుంది. ఈ లక్షణాలను మనం కూడా అలవర్చుకుంటే, జీవితంలో మరింత విజయవంతంగా, సంతోషంగా ఉండగలం.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.