Chicken Fried Rice: స్ట్రీట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలా చేశారంటే నోరూరిపోతుంది, రెసిపీ చాలా సులువు
Chicken Fried Rice: చికెన్ ఫ్రైడ్ రైస్ పేరు చెబితేనే తినేయాలన్న కోరిక పుడుతుంది. దీన్ని చేయడం చాలా సులువు. చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎలాగో ఇక్కడ చెప్పాము. ఫాలో అయిపోండి.
చలికాలంలో వేడివేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్ తింటే ఆ రుచి మామూలుగా ఉండదు. చల్లని వాతావరణంలో స్పైసీగా తినే ఆహారం ఏదైనా బాగుంటుంది. ఇక్కడ మేము సింపుల్ పద్ధతిలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చెప్పాము. బయట బండ్ల దగ్గర ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ తినే బదులు మీరు ఇంట్లోనే తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక రెసిపి ఎలాగో తెలుసుకోండి.
చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు
వండిన అన్నం - రెండు కప్పులు
చికెన్ ముక్కలు - 200 గ్రాములు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - పావు స్పూను
కారం - అర స్పూను
మిరియాల పొడి - పావు స్పూను
గరం మసాలా - పావు స్పూను
నిమ్మరసం - అర స్పూను
అల్లం పచ్చిమిర్చి పేస్ట్ - అర స్పూను
మైదా - రెండు స్పూన్లు
కార్న్ ఫ్లోర్ - ఒక స్పూను
పచ్చిమిర్చి - రెండు
క్యారెట్ - ఒకటి
క్యాబేజీ తరుగు - మూడు స్పూన్లు
బీన్స్ తరుగు - మూడు స్పూన్లు
క్యాప్సికం తరుగు - మూడు స్పూన్లు
ఉల్లికాడల తరుగు - రెండు స్పూన్లు
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
వెల్లుల్లి రెబ్బలు - అయిదు
కోడిగుడ్లు - మూడు
సోయాసాస్ - ఒక స్పూను
వెనిగర్ - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ
1. చికెన్ ఫ్రైడ్ రైస్ ఉండేందుకు ముందుగానే అన్నాన్ని వండుకొని పొడిపొడిగా వచ్చేలా విడదీసుకుని పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ ముక్కలను వేసుకోవాలి.
3. ఆ చికెన్ ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కోడిగుడ్డు, కార్న్ ఫ్లోర్, మైదా వేసి బాగా కలుపుకోవాలి.
4. ఈ మొత్తం మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.
5. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.
6. ఆ నూనెలో ఇది చికెన్ ముక్కలను వేయించుకొని తీసి పక్కన పెట్టాలి.
7. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టాలి.
8. ఆ కళాయిలో నూనె వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించుకోవాలి.
9. అవి బాగా వేగాక రెండు కోడిగుడ్లను ఒక గిన్నెలో వేసి బాగా గిలగొట్టి ఈ వెల్లుల్లి నూనె మిశ్రమంలో వేయాలి.
10. అది ఆమ్లెట్ లాగా అయ్యాక గరిటతోనే బాగా ముక్కలు చేసి కలపాలి.
11. అందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసి బాగా కలపాలి.
12. చికెన్ ముక్కల్లో క్యాబేజీ, క్యాప్సికం, క్యారెట్, బీన్స్, ఉల్లికాడల తరుగు అన్ని వేసి బాగా కలుపుకోవాలి.
13. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసి బాగా కలపాలి.
14. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.
15. అలాగే గరం మసాలా, కారం, మిరియాల పొడి కొంచెం కొంచెం వేసుకుని బాగా కలపాలి.
16. అలాగే వెనిగర్ ఒక స్పూను, సోయాసాస్ ఒక స్పూన్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి.
17. ఇందులోనే కొత్తిమీర తరుగును కూడా చల్లుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే.
మీకు బయట చైనీస్ రెస్టారెంట్లో స్ట్రీట్ స్టైల్ లో చేసే ఫ్రైడ్ రైస్ రెసిపీ ఇదే. మీరు ఇంట్లోనే దీన్ని పరిశుభ్రమైన పద్ధతిలో చేసుకోవచ్చు. ఇది మీకు ఎంతో బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి దీన్ని చేసుకొని తిని చూడండి. అద్భుతంగా అనిపిస్తుంది. చలికాలంలో సాయంత్రం పూట దీన్ని స్పైసీగా వండుకొని తింటే ఆ రుచే వేరు.