Chicken Curry: ఆంధ్ర స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ వండి చూడండి గ్రేవీ అదిరిపోతుంది, రెసిపీ చాలా సులువు-chicken curry recipe in andhra style know how to make this in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Curry: ఆంధ్ర స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ వండి చూడండి గ్రేవీ అదిరిపోతుంది, రెసిపీ చాలా సులువు

Chicken Curry: ఆంధ్ర స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ వండి చూడండి గ్రేవీ అదిరిపోతుంది, రెసిపీ చాలా సులువు

Haritha Chappa HT Telugu
Mar 05, 2024 05:30 PM IST

Chicken Curry: చికెన్ కర్రీని ఆంధ్రా స్టైల్‌లో వండి చూడండి. ఇది స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వండాలో ఇక్కడ రెసిపీ ఇచ్చాము.

ఆంధ్రస్టైల్ లో చికెన్ కర్రీ రెసిపీ
ఆంధ్రస్టైల్ లో చికెన్ కర్రీ రెసిపీ (youtube)

Chicken Curry: ఆంధ్రా కోడి కూర అంటే చాలా ఫేమస్. ఇగురు ఎక్కువ వచ్చేలా వండటమే ఈ చికెన్ కర్రీ స్పెషాలిటీ. ఆంధ్ర చికెన్ కర్రీ రెసిపీ ఇక్కడ ఇచ్చాము . ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్ లేదా బిర్యానిలో ఈ గ్రేవీ ని కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది. ముక్క కూడా మెత్తగా ఉడికి టేస్టీగా ఉంటుంది. దీనిలో కొందరు కొబ్బరి పాలను కూడా ఉపయోగిస్తారు. అందుకే గ్రేవీ మెత్తగా, చిక్కగా వస్తుంది. ఈ ఆంధ్ర స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం.

ఆంధ్ర స్టైల్‌లో చికెన్ కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

చికెన్ - అర కిలో

యాలకులు - మూడు

లవంగాలు - మూడు

బిర్యానీ ఆకు - ఒకటి

నూనె - నాలుగు స్పూన్లు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

ఉల్లిపాయ - ఒకటి

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

పసుపు - ఒక స్పూను

నీరు - తగినంత

పచ్చిమిర్చి - రెండు

కరివేపాకులు - గుప్పెడు

కారం - రెండు స్పూన్లు

జీడిపప్పు - గుప్పెడు

గసగసాలు - ఒక స్పూన్

చికెన్ మసాలా - ఒక స్పూను

గరం మసాలా - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు

ఆంధ్ర స్టైల్‌లో చికెన్ కర్రీ రెసిపీ

1. గసగసాలు పాలలో నానబెట్టి మిక్సీలో వేయాలి. అందులోనే జీడిపప్పును కూడా వేసి మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

2. కొంతమంది కొబ్బరి పాలను వేసి పేస్టులా చేసుకుంటారు.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి.

5. ఇప్పుడు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.

6. వాటిని నూనెలో వేసి వేయించాలి.

7. వాటి రంగు మారేవరకు ఉంచి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ను కలపాలి.

8. పైన ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి.

9. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకులను వేసి వేయించాలి.

10. ఇప్పుడు కారం, జీడిపప్పు, గసగసాల పేస్టు, కసూరి మేతి, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.

11. ఒక గ్లాసు నీరు వేసి పావుగంట సేపు ఉడకనివ్వాలి.

12. ఆ తర్వాత చికెన్ ముక్కలను వేసి తగినంత నీరు వేసి మీడియం మంట మీద అరగంట పాటు ఉడికించాలి.

13. చిక్కగా గ్రేవీ అయ్యాక పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.

14. అంతే ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయినట్టే.

15. వేడి వేడి అన్నంలో ఈ గ్రేవీని కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది. అలాగే బిర్యానీ, పలావ్‌లకు జతగా కూడా ఇది చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చపాతీ, రోటీతో ఈ గ్రేవీ టేస్టీగా ఉంటుంది.

చికెన్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. పిల్లలకు, పెద్దలకు ప్రోటీన్ లోపం రాకుండా ఉండాలంటే... వారంలో రెండు మూడు సార్లు చికెన్ తినాలి. అలాగే దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు ఉండవు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు చికెన్ తినవచ్చు. చికెన్ తినడం వల్ల బరువు పెరుగుతారన్న భయం లేదు, ఇది బరువును తగ్గిస్తుంది. అంతేకాదు చికెన్ అందరికీ అందుబాటు ధరలోనే దొరుకుతుంది. కాబట్టి కుటుంబమంతా వారంలో రెండు మూడుసార్లు వండుకొని తినవచ్చు. అలాగే చికెన్‌లో ట్రిఫ్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. మెదడులో సెరటోనిన్ స్థాయిలు పెరగడానికి ఈ అమైనో ఆమ్లం ముఖ్యం. కాబట్టి చికెన్ తినడం వల్ల అన్ని ప్రయోజనాలు కలుగుతాయి.

రోజూ చికెన్ తినేవారు 50 గ్రాములకు మించకుండా తింటే ఆరోగ్యకరం. వ్యాయామాలు చేసేవారు కచ్చితంగా చికెన్ తినాలని చెబుతారు డైటీషియన్స్. ఇలా కూర లాగా ఉడికించుకొని తింటేనే ఆరోగ్యకరం. గ్రిల్ చేయడం, నూనెలో డీప్ ఫ్రై చేయడం వంటివి చేస్తే చికెన్ వల్ల నష్టాలే ఎక్కువ. అలా డీప్ ఫ్రై చేయడం వల్ల అనారోగ్య సమస్యలు రావచ్.చు కాబట్టి చికెన్‌ను కూర రూపంలో లేదా బిర్యానీలో భాగం చేసుకుని తింటే మంచిది.

Whats_app_banner