చికెన్‌ శనగపప్పుతో కలిపి తయారుచేసే కబాబ్ ఎప్పుడైనా తిన్నారా? ఈ సింపుల్ రెసిపీతో ట్రై చేసేయండి-chicken and chickpea kebab recipe a simple and delicious twist you need to try ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  చికెన్‌ శనగపప్పుతో కలిపి తయారుచేసే కబాబ్ ఎప్పుడైనా తిన్నారా? ఈ సింపుల్ రెసిపీతో ట్రై చేసేయండి

చికెన్‌ శనగపప్పుతో కలిపి తయారుచేసే కబాబ్ ఎప్పుడైనా తిన్నారా? ఈ సింపుల్ రెసిపీతో ట్రై చేసేయండి

Ramya Sri Marka HT Telugu

చికెన్ కబాబ్ అంటే టేస్ట్ చేయని వారుండరు. కానీ, ఎప్పుడైనా చికెన్‌తో శనగపప్పు కలిపి చేసిన కబాబ్‌ను టేస్ట్ చేశారా? కొత్త రుచిని ఆస్వాదించడానికి ఈ సింపుల్ రెసిపీని తప్పకుండా ట్రై చేసేయండి.

చికెన్ కబాబ్ ఈ సారి కొత్తగా..

రెగ్యూలర్‌గా తినే చికెన్ కబాబ్‌ల కంటే డిఫరెంట్‌గా, ఈసారి కొంచెం కొత్తగా ప్రయత్నిద్దామనుకుంటున్నారా? చికెన్‌తో శనగపప్పును కలిపి చేసే ఈ కబాబ్ రుచి నాన్‌వెజ్ ప్రియులకు తప్పకుండా నచ్చుతుంది. కేవలం టేస్ట్ కోసమే కాదు, శనగపప్పు వల్ల మరింత పోషక విలువలు కూడా తోడవుతాయి. ఇంట్లో ఉండే కొద్దిపాటి పదార్థాలతోనే ఎంతో సులభంగా తయారుచేసుకోగల ఈ ప్రత్యేకమైన కబాబ్‌ను ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి.

చికెన్ శనగపప్పు కబాబ్ తయారీకి కావలసిన పదార్థాలు:

  • చికెన్ - అర కిలో
  • శనగపప్పు - ఒక కప్పు (మూడు గంటల ముందు నానబెట్టినది)
  • ఉల్లిపాయలు - ఒక కప్పు (తరిగినవి)
  • బంగాళ దుంప - ఒకటి
  • అల్లం - వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
  • దాల్చిన చెక్క - ఒక అంగుళం ముక్క
  • లవంగాలు - రెండు
  • గరం మిర్చి - ఒక టీ స్పూన్
  • ఉప్పు - 2 టేబుల్ స్పూన్లు
  • నీరు - రెండు గ్లాసులు (ఉడకబెట్టడానికి)
  • ధనియాల పొడి - ఒక టీ స్పూన్
  • జీలకర్ర - ఒక టీ స్పూన్
  • కారం - ఒక టీ స్పూన్
  • కొత్తిమీర - మూడు టేబుల్ స్పూన్లు (తరిగినది)
  • వేయించిన ఉల్లిపాయ ముక్కలు - ఒక టేబుల్ స్పూన్
  • పచ్చి ఉల్లిపాయ ముక్కలు - ఒక టేబుల్ స్పూన్ (తరిగినవి)
  • నిమ్మకాయ - ఒక చెక్క (రసం కోసం)
  • కోడి గుడ్డు - ఒకటి (సొన మాత్రమే)
  • నూనె - వేయించడానికి సరిపడ

చికెన్ శనగపప్పు కబాబ్ తయారీ విధానం:

  1. ముందుగా కుక్కర్ తీసుకుని అందులో ఒక అరకిలో చికెన్ వేయండి.
  2. తర్వాత అందులో మూడు గంటల ముందే నానబెట్టి ఉంచుకున్న ఒక కప్పు పప్పును వేయండి.
  3. ఇప్పుడు వాటిలో ఒక కప్పు తరిగిన ఉల్లిపాయలు, ఒక బంగాళ దుంప, ఒక టేబుల్ స్పూన్ అల్లం - వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
  4. ఆ తర్వాత అంగుళం దాల్చిన చెక్క, రెండు లవంగాలు, ఒక టీ స్పూన్ గరం మిర్చి, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టేయండి.
  5. మూత పెట్టే ముందు అందులో రెండు గ్లాసుల నీరు పోయడం మర్చిపోవద్దు.
  6. మూడు విజిల్స్ వచ్చేసరికి నీరంతా పోయి చికెన్ ఉడికిపోతుంది. ఒకవేళ నీరు పోకుండా ఉంటే కుక్కర్ మూత తీసి కాసేపు ఉంచండి.
  7. ఇప్పుడు ఉడికిన చికెన్ ముక్కలను సపరేట్ గా తీసి పక్కకుపెట్టుకోండి.
  8. కుక్కర్లో మిగిలి ఉన్న మిశ్రమాన్ని మెత్తగా మెదుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  9. ఉడికించిన చికెన్‌ను చల్లార్చి ఎముకలు తీసిన తర్వాత, మెదిపిన మిశ్రమంతో కలుపుకోవాలి.
  10. ఆ తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ కారం, మూడు టేబుల్ స్పూన్ల కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు, ఒక చెక్క నిమ్మకాయ రసం, పగలకొట్టిన కోడి గుడ్డు సొన వేయాలి.
  11. స్పూన్ సాయంతో ఇవన్నీ బాగా కలిసేలా ఒక రెండు నిమిషాల పాటు పైకి కిందకు బాగా కలపాలి.
  12. పిండిలా కలిసిన ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని వాటిని ఒత్తుకుని నూనెలో వేయాలి.
  13. మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగేంత వరకూ వేయించాలి.
  14. అంతే చికెన్ కబాబ్ లు రెడీ అయిపోయినట్లే.

వీటిని రైతాతో లేదా చికెన్ సూప్ తో కలిపి తింటే ఆహా అనాల్సిందే.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.