Child Mental Health : మీ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ఇలా చెక్ చేయండి
Child Mental Health Check : పిల్లల మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. చిన్నప్పుడు వారి మానసిక ఆరోగ్యమే మెుత్తం శ్రేయస్సు, భవిష్యత్‌ను ప్రభావితం చేస్తుంది.
బాల్యంలో మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇది పిల్లల మొత్తం శ్రేయస్సు, భవిష్యత్తును కచ్చితంగా ప్రభావితం చేస్తుంది. పిల్లలు చిన్నప్పుడు ఎదిగే పరిస్థితులే వారు పెద్ద అయ్యాక ఏం అవుతారో డిసైడ్ చేస్తుంది. వారి అవకాశాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. పిల్లల్లో మార్పు ఉంటే సకాలంలో అవసరమైన చర్యలు తీసుకోవాలి. కొన్ని కారణాలతో పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం క్షీణిస్తోంది. అవేంటో తెలుసుకుందాం..
పిల్లల ప్రవర్తనలో గణనీయమైన మార్పులు మానసిక ఆరోగ్య సమస్యలకు ముందస్తు సూచికగా ఉంటాయి. భారతదేశంలో ఈ అంశానికి ఇప్పటికీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ అదే వారి జీవితాలను నిర్ణయిస్తుంది. ఈ విషయం తల్లిదండ్రులు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. భారతదేశంలోని 4-16 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో చాలా మంది మానసిక ఆరోగ్యం సరిగా లేదు. వారి ప్రవర్తనను బట్టి అర్థం చేసుకోవచ్చు.
దీర్ఘకాలిక మానసిక క్షోభ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. అబ్బాయిలు, బాలికల్లో డిప్రెషన్ పెరిగిపోతోంది. అయితే ఈ విషయంపై కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతోనే డిప్రెషన్‌ను అధిగమించవచ్చు. వారు అలానే ఒత్తిడికి లోనైతే.. ఆత్మహత్య చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
మానసిక ఆరోగ్యం నిద్రపై చాలా ఆధారపడి ఉంటుంది. నిద్ర భంగం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. భారతీయుల్లో నిద్ర నాణ్యత చాలా తక్కువగా ఉందని ఒక అధ్యయనం కనుగొంది. పిల్లలు ఎదిగే క్రమంలో ఎంత ఎక్కువ నిద్రపోతే ఆరోగ్యానికి అంత మంచిది. వారి నిద్రను అస్సలు డిస్టర్ప్ చేయకూడదు.
మానసిక ఆరోగ్య సమస్యలతో చదివే పిల్లలు పేలవమైన ఫలితాలను కలిగి ఉన్నారు. భారతదేశ జాతీయ మానసిక ఆరోగ్య సర్వే ప్రకారం, 7 శాతం మంది పిల్లలకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వాటి ఫలితాలు మరింత దిగజారుతున్నాయి. చదువులోనూ వెనకబడే ఉంటారు.
పిల్లలను ఇతరులతో పోల్చడం కూడా మంచి పద్ధతి కాదు. పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ పిల్లలు పోల్చుకుంటే చాలా వెనకే ఉన్నారని ఎప్పుడూ గుచ్చకూడదు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం భారతదేశంలోని పోటీ విద్యా విధానం పిల్లల మనస్సులలో సమస్యలను సృష్టిస్తుంది. వెనుకబడిపోతానేమోనన్న భయాన్ని కలిగిస్తుంది..
శారీరక సమస్యలు ఉంటే పిల్లల మానసిక ఆరోగ్యం అంతగా ఉండదు. పిల్లలకి కడుపు నొప్పి లేదా తలనొప్పి వంటి సమస్యలు ఉంటే మానసిక స్థితికి ఎల్లప్పుడూ మంచిది కాదు. అందుకే ఏదైనా ఇబ్బందులు కలిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు భారతీయ పిల్లలలో మానసిక క్షోభకు ప్రధాన కారణాలలో ఒకటి. ఇండియన్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ నివేదించిన ప్రకారం పిల్లల్లో చెండు ఆహారపు అలవాట్లు ఉన్నాయి. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, పౌష్టికాహారం తీసుకోకపోవడం వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
ఓ సర్వే నివేదిక ప్రకారం దేశంలో దాదాపు 15-39 శాతం మంది చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం దీనికి ప్రధాన కారణం. తల్లిదండ్రులు పిల్లల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచలు చేస్తున్నారు.