Saturday Motivation: మూడు నెలల్లో మీ జీవితాన్ని విజయవంతంగా మార్చుకోండి, అందుకోసం ఇలా షెడ్యూల్ చేసుకోండి
Saturday Motivation: విజయం సాధించాలని అందరికీ ఉంటుంది. కానీ సరైన ప్రణాళిక లేని కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉండిపోతారు. ఇక్కడ మేము మూడు నెలల్లో జీవితాన్ని విజయవంతం చేసుకోవడం ఎలాగో చిట్కాలు చెబుతున్నాం.

Saturday Motivation: జీవితంలో ఎంతో మంది విజయం సాధించాలని అనుకుంటారు. తమ కలలను నెరవేర్చుకోవాలనుకుంటారు. కానీ ప్రేరణ లేకపోవడం, ప్రణాళిక లేకపోవడం, సరైన వనరులు లేకపోవడం వల్ల విఫలం చెందుతారు. మీరు విజయవంతం అవ్వాలంటే ముందుగా దానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఆ ప్రణాళికలకు తగ్గట్టు కృషి చేయాలి. ఒక మూడు నెలల పాటు మేము ఇక్కడ చెప్పిన విధంగా ప్రయత్నించండి. కచ్చితంగా మీరు మీ జీవితంలో విజయం సాధిస్తారు.
జీవితంలో విజయం సాధించాలంటే మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఇందుకోసం కొంత సమయాన్ని కేటాయించాలి. మూడు నెలల వ్యవధిలో మీరు విజయవంతమైన వ్యక్తిగా మారేందుకు ఇక్కడ షెడ్యూలింగ్ చేసాము. అలాగే రోజువారీ పనులను చేయడానికి ప్రయత్నించండి. కచ్చితంగా మీలో విజయోత్సాహం ఉత్పన్నమవుతుంది.
రోజువారీ చేయాల్సిన పనులు
రాత్రి 9 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. ఎలాంటి పోస్టులు చేయకండి. ఎవరి పోస్టులను చదవకండి. రాత్రి 10 గంటలకు నిద్ర పోవడం ఉదయం 5 లేదా 6 గంటలకే మేల్కోవడం చేయండి. ఇది మీ జ్ఞానాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మరుసటి రోజు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. మీ బాడీ రీఛార్జ్ అవుతుంది. అలా ఉదయం 9 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేసే ఉద్యోగంలో ఉత్పాదకత కూడా పెరుగుతుంది.
ఆరోగ్యం కోసం ప్రతి ఉదయం మీకోసం ఒక 30 నిమిషాలు కేటాయించుకోండి. యోగా, ధ్యానంతో పాటూ సూర్యుడు కిరణాలు పడేలా వాకింగ్ చేయడం వంటివి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. అలాగే ప్రతి ఉదయం సాయంత్రం 10 నిమిషాలు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకునేందుకు కేటాయించండి. ఆ సమయంలో ఏవీ ఆలోచించకండి. ప్రశాంతంగా ఒకచోట కూర్చోండి లేదా పడుకోండి. కానీ నిద్రపోవద్దు. ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.
మానసిక ప్రశాంతత కోసం, ఆనందం కోసం మీ భాగస్వామితో లోతుగా కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించండి. పెళ్లి కాని వారు తమ సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపండి. మిమ్మల్ని మీరు మానసికంగా కనెక్ట్ చేసుకోండి. దీని వల్ల జీవితం చాలా మెరుగుపడుతుంది. డిజిటల్ డిటాక్స్ కావాలంటే మనుషులే అవసరం ఉంటుంది. మనుషులతో ఎంతగా కనెక్ట్ అయితే డిజిటల్ వస్తువులకు అంతగా దూరం అవుతాము.
వారంలో ఒకరోజు పూర్తిగా మీ సొంత పనులకు కేటాయించుకోండి. ఆ రోజు విశ్రాంతి తీసుకోవడం, మీకు నచ్చిన పనులు చేయడం వంటివి చేయండి. ఇది మీలో ఉత్పాదుకతను, సృజనాత్మకతను పెంపొందించడానికి సహకరిస్తుంది. అలాగే మీ ఆరోగ్యం పైన కూడా దృష్టి పెట్టండి. భావోద్వేగాలకు దూరంగా ఉండండి. శారీరకంగా, మానసికంగా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి.
పైన చెప్పినవన్నీ చాలా సింపుల్ గా అనిపించవచ్చు. కానీ ఒక మూడు నెలలు ప్రయత్నించి చూడండి. ఆ తర్వాత మీ ఉద్యోగంలో లేదా మీ వ్యాపారంలో మార్పులు మీరే చూస్తారు. మీలో ఎన్నో పాజిటివ్ మార్పులు వస్తాయి. మెరుగైన సమయ నిర్వహణ వల్ల మీ ఉద్యోగ ప్రదేశంలో ఉత్పాదకత పెరుగుతుంది. తద్వారా మీరు మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే ముందుగానే ప్రణాళికాబద్ధంగా సాగుతారు. కాబట్టి ఒత్తిడి వాతావరణం ఎక్కడ ఉండదు. దీని వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. వ్యక్తిగత జీవితం, వృత్తిగత జీవితం మధ్య సమతుల్యత కూడా సరిగ్గా ఉంటుంది. కాబట్టి ఇంట్లో కూడా ఎలాంటి గొడవలు ఉండదు. విశ్రాంతిగా ఉంటారు. మీ హాబీలను కూడా మీరు కొనసాగించవచ్చు. మీ మానసిక శక్తి పెరుగుతుంది. మీ జీవితం మీ నియంత్రణలోనికే వస్తుంది. కాబట్టి పైన చెప్పిన షెడ్యూల్‌ను ఒక మూడు నెలల పాటు ఫాలో అయ్యి చూడండి.