Chaddannam: వేసవి తాపాన్ని తట్టుకునేందుకు చద్దన్నం ఇలా తయారు చేసుకొని తినండి, చలువ చేస్తుంది-chaddannam recipe in telugu know how to make this rice recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chaddannam: వేసవి తాపాన్ని తట్టుకునేందుకు చద్దన్నం ఇలా తయారు చేసుకొని తినండి, చలువ చేస్తుంది

Chaddannam: వేసవి తాపాన్ని తట్టుకునేందుకు చద్దన్నం ఇలా తయారు చేసుకొని తినండి, చలువ చేస్తుంది

Haritha Chappa HT Telugu

Chaddannam: వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారం చద్దన్నం. దోశె, పూరీలు మాని వేసవి ఎండల్లో చద్దన్నం చేసుకుని తినండి. ఇది శరీరానికి ఎంతో చలువు చేస్తుంది.

చద్దన్నం రెసిపీ (youtube)

Chaddannam: చద్దన్నం అనగానే రాత్రి మిగిలిన, పాడైపోయిన అన్నం అనుకుంటారు. నిజానికి రాత్రి మిగిలిన అన్నాన్ని పడేయకుండా దాన్ని చద్దన్నంగా మార్చుకుంటే మంచిది. పూర్వకాలంలో దీన్నే తినేవారు. అందుకే వారు అంత ఆరోగ్యంగా ఉన్నారు. వేసవిలో కచ్చితంగా తినాల్సినది చద్దన్నం. ఇది తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఎన్నో సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ చద్దన్నాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.

చద్దన్నం రెసిపీకి కావాల్సిన పదార్థాలు

వండిన అన్నం - రెండు కప్పులు

నీళ్లు - ఒక గ్లాసు

ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు

తరిగిన పచ్చిమిర్చి - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పెరుగు - అరకప్పు

చద్దన్నం రెసిపీ

1. రాత్రి అన్నాన్ని వండి పెట్టుకోవాలి.

2. ఒక మట్టి కుండలో పెరుగు వేసి బాగా చిలకాలి.

3. అందులో నీళ్లు పోయాలి. తర్వాత అన్నాన్ని కూడా వేసి కలుపుకోవాలి.

4. దీనిపై మూత పెట్టి రాత్రంతా కదపకుండా అలా ఉంచాలి.

5. రాత్రంతా పెరుగు చక్కగా పులుస్తుంది. అందులో ప్రోబయోటిక్స్ ఉత్పత్తి అవుతాయి.

6. ఉదయం లేచాక రాత్రి పులియబెట్టిన అన్నంలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి.

7. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.

8. దీన్ని ఊరగాయతో నంజుకొని తింటే టేస్ట్ గా ఉంటుంది.

9. ఈ చద్దన్నాన్ని వేసవిలో కచ్చితంగా తినాలి. ఇది అందరికీ నచ్చుతుంది. పూర్వం శరీరానికి చలువ చేసేందుకు చెద్దన్నాన్నే తినేవారు. పిల్లలకు కూడా ఈ అన్నాన్ని తినిపించడం వల్ల వేసవి తాపాన్ని తట్టుకునే శక్తి వస్తుంది.

మన శరీరానికి ప్రోబయోటిక్స్ చాలా అవసరం. పొట్టలోని మంచి బ్యాక్టీరియాను పెంచేందుకు ఈ ప్రోబయోటిక్స్ అవసరం పడతాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. శరీరానికి ఎంతో శక్తినిస్తాయి. కాలేయానికి చద్దన్నం ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో నీరసం, బలహీనత త్వరగా వచ్చేస్తాయి. అవి రాకుండా ఈ చద్దన్నం కాపాడుతుంది .

చద్దన్నంలో క్యాల్షియం, ఐరన్, పొటాషియంతో పాటు ఎన్నో విటమిన్లు ఉంటాయి. వీటిలో ఉల్లిపాయ, మిరపకాయ కూడా కలిపాము, కాబట్టి మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి. వారంలో కనీసం మూడు నుంచి నాలుగు సార్లు చద్దన్నం తినడానికి ప్రయత్నించండి. వేడి శరీరంలో చేరదు. చలువ చేస్తుంది. అలాగే ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్సర్లు, పేగు సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. చద్దన్నం ఒక పరమ ఔషధం అని చెప్పుకోవచ్చు.