Loneliness in children: పిల్లల్లో ఒంటరితనానికి కారణాలు ఇవే.. ఇలా సాయపడండి..
Loneliness in children: పిల్లల్లో ఒంటరితనానికి కారణాలు గుర్తించి వారికి సాయపడేందుకు తల్లిదండ్రుల కోసం నిపుణులు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు.
పిల్లల చుట్టూ ఇతర చిన్నారులు, టీచర్లు, కుటుంబ సభ్యులు ఉంటారు. అందువల్ల వారు ఒంటరితనం అనుభవిస్తున్నట్టు మనం గుర్తించలేం. నిజానికి ఒంటరితనం అంటే అదొక వ్యక్తిగత భావోద్వేగం. పిల్లలతో సహా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. ఒంటరి తనం అంటే తన చుట్టూ మనుషులు ఉన్నారా లేదా అన్నది కాదు. గుంపులో ఉన్నా ఒంటరితనం ఫీలవుతుంటారు.
ట్రెండింగ్ వార్తలు
హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లినికల్ సైకాలజిస్టులు అన్నా హేమ సామ్, షెఫాలిక సహాయ్ ఈ అంశాలపై మాట్లాడారు. ‘పిల్లలతో సహా అందరూ ఏదో ఒక సందర్భంలో ఒంటరితనానికి లోనవుతారు. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగితే, పిల్లలు అన్ని వేళల్లో ఒంటరిగా ఫీలైతే వారిపై ఇది గణణీయమైన ప్రభావం చూపుతుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యపరమైన సవాళ్లను విసురుతుంది. నిరంతరం ఒంటరితనానికి లోనైతే పిల్లలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటారు..’ అని వివరించారు. ఇందుకు గల కారణాలు, పర్యవసనాలు, పేరెంట్స్ చేయగలిగిన సాయం గురించి వారు వివరించారు.
పిల్లల్లో ఒంటరితనానికి కారణాలు
పిల్లలు ఒంటరితనం ఫీలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే వాటిని బాహ్యమైనవిగా, జీవిత పరిస్థితుల్లో వచ్చిన మార్పులుగా పరిగణించవచ్చు. పాఠశాలలోగానీ, బోధన సంబంధిత అంశాల్లో గానీ చోటు చేసుకున్న పరిణామాలు కారణమై ఉండొచ్చు.
జీవిత సంబంధ పరిస్థితుల్లో కొన్ని ముఖ్యమైన పరిణామాలు ఇక్కడ చూడొచ్చు.
- కొత్త నగరానికి వెళ్లడం, ఇల్లు మారడం
- పాఠశాల మారడం
- తల్లిదండ్రులు విడిపోవడం
- దగ్గరి వాళ్లు చనిపోవడం
- స్నేహితులు దూరమవడం
పాఠశాల, బోధన సంబంధిత అంశాలు
- తోటి పిల్లల నుంచి తిరస్కరణ ఎదుర్కోవడం
- తోటి పిల్లలు, స్నేహితులతో తరచూ సంఘర్షణ
- తోటి పిల్లల నుంచి సతాయింపు ఎదుర్కోవడం
దీనికి తోడు పిల్లల స్వభావం కూడా ఈ విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సిగ్గరిగా, యాంగ్జైటీతో ఉండే పిల్లలు తమ తోటి పిల్లలతో కమ్యూనికేట్ చేయడంలో ఇబ్బంది పడొచ్చు. చొరవ తీసుకోవడంలో వారికి సామాజిక నైపుణ్యాలు అంతగా లేకపోయి ఉండొచ్చు. కొందరిలో ఆత్మగౌరవం లోపించి ఉండొచ్చు. ఇవన్నీ తోటి పిల్లలతో కమ్యూనికేట్ చేయడంలో, వారితో స్నేహం చేయడంలో ఇబ్బందిని తెచ్చిపెడతాయి. అంతిమంగా ఇది ఒంటరితనానికి దారితీస్తుంది.
ఒంటరి తనం పర్యవసనాలు
ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా, ఒంటరితనం అనేది వ్యక్తికీ వ్యక్తికీ విభిన్నంగా ఉండొచ్చు. పిల్లలు తమ భావోద్వేగాలను విభిన్నంగా వ్యక్తీకరించవచ్చు. తమకు స్నేహితులు లేరనో, మాట్లాడేందుకు ఎవరూ లేరనో చెబుతుండొచ్చు. అయితే ఒంటరితనం పిల్లలు, టీనేజర్ల జీవితంపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు ఖుష్బూ అనే చిన్నారి తెలివైన అమ్మాయి. కానీ ప్రస్తుతం చదువుపరంగా వెనకబడిపోతోంది. ఒంటరితనం అనే భావన తన ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. చదువుకునేందుకు ప్రేరణను తగ్గిస్తోంది. ధ్రువ్ అనే అబ్బాయి తన స్నేహితులు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చూసినప్పుడు మరింత ఒంటరితనానికి లోనవుతున్నాడు. ఇక రాహుల్ కొత్త స్నేహితులను చేసుకోవడంలో ఇబ్బందిపడుతున్నాడు. తన స్కిల్స్ గురించి ఆత్మవిశ్వాసం కరువైంది. తనతో మాట్లాడేందుకు వారు ఇష్టపడతారో లేదోనని బాధపడుతున్నాడు.
పిల్లలు ఒంటరితనానికి విభిన్నంగా స్పందిస్తారు. కొందరు విచారంగా ఉంటారు. ఒంటరిగా ఉంటూ వారి వారి ప్లేసుల్లోనే ఉంటారు. మరికొందరు కోపం ప్రదర్శిస్తుంటారు. పిల్లల ఒంటరితనం కేవలం వారి మానసిక ఆరోగ్యంపైనే కాకుండా, వారి శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. త్వరితగతిన వారు అనారోగ్యానికి గురవుతుంటారు. నిద్రలేమి ఎదుర్కొంటారు. నిద్ర లేచే సమయంలో అలసటగా ఫీలవుతుంటారు. తగినంత నిద్ర ఉండదు. బాధ కారణంగా సరిగ్గా తినరు. లేదా తమను తాము సంతోష పెట్టుకోవడం కోసం ఎక్కువగా తింటారు. పిల్లలు కొన్నిసార్లు ఒంటరిగా ఉండడాన్ని ఒంటరితనం అనుభవిస్తున్నట్టు చూడలేం. కేవలం వారు సిగ్గుపడుతున్నారా? లేక ఒంటరితనంగా ఫీలవుతున్నారా అంచనా వేయాలి.
తల్లిదండ్రులు ఏం చేయాలి?
పిల్లలు ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నప్పడు దానిని తక్షణమే పరిష్కరించాలనుకుంటాం. కానీ వారు చెబుతున్నది నెమ్మదిగా అర్థం చేసుకోవాలి. వారు మాట్లాడేందుకు తగినంత వ్యవధి, అనుకూలమైన స్పేస్ ఇవ్వకపోతే అది వారికి సహాయపడకపోవచ్చు.
నెమ్మదిగా ఇలా పరిష్కరించండి..
- వారి దృక్కోణాన్ని అర్థం చేసుకునేందుకు కొన్ని ప్రశ్నలు అడగండి.
- కొన్ని పరిశీలనలు చేయండి. వారికి ఎలాంటి స్కిల్స్ లేవో గమనించండి. ఆ విషయంలో సహాయం కావాలేమో చూడండి.
- వారి అనుభవాలను గుర్తించేందుకు సిద్ధంగా ఉండండి. జడ్జ్‌మెంట్ చేయడం లేదా వెంటనే సాయం అందించడం వంటివి చేయకండి. వారి భావాలను అర్థం చేసుకునేందుకు మీ నిజమైన ఆసక్తిని చూపండి.
వ్యూహాలు అమలు చేయండి
- వారు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే కార్యకలాపాల్లో మీరూ నిమగ్నమవండి. వారు ఆనందించే యాక్టివిటీస్ చేస్తూ మీరూ పాల్గొనండి.
- సులభమైన, నిర్మాణాత్మకమైన స్టెప్స్‌తో ఒక ప్లాన్ తయారు చేయండి. మీ చిన్నారి తన స్నేహితుడితో కలిసేందుకు, లేదా వారితో ఆడుకునేందుకు ఇష్టపడుతున్నాడనుకోండి. దానిని ఎలా అడగాలో చర్చించండి. అది సక్సెస్ కాకపోతే ఏం చేయగలమో కూడా చర్చించండి.
- సోషల్ స్కిల్స్ నేర్పండి. సోషల్ స్కిల్స్ లేక ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు తగిన వాతావరణం కల్పించండి. వారి సొంత శక్తితో సాధన చేయడానికి, అవకాశాలను కల్పించడానికి ప్లాన్ చేయండి. డాన్స్, క్రీడల శిక్షలో చేర్పిస్తే అక్కడ వారు తోటి వారితో క్రమంగా కమ్యూనికేట్ చేయడానికి ఇష్టపడొచ్చు.
- కొన్ని కార్యకలాపాల్లో పాల్గొనేందుకు పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వండి. వారి ప్రయత్నాలను కొట్టిపడేయకండి.