Carrot Bobbatlu: హెల్తీ క్యారెట్ బొబ్బట్లు, రుచికి రుచి ఎంతో ఆరోగ్యం కూడా, రెసిపీ ఇదిగో-carrot bobbatlu recipe in telugu know how to make this sweet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Carrot Bobbatlu: హెల్తీ క్యారెట్ బొబ్బట్లు, రుచికి రుచి ఎంతో ఆరోగ్యం కూడా, రెసిపీ ఇదిగో

Carrot Bobbatlu: హెల్తీ క్యారెట్ బొబ్బట్లు, రుచికి రుచి ఎంతో ఆరోగ్యం కూడా, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu
Sep 28, 2024 11:30 AM IST

Carrot Bobbatlu: సాధారణ బొబ్బట్లతో బోర్ కొట్టి ఉంటే ఒకసారి క్యారెట్ బొబ్బట్లు చేయండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని రెసిపీ కూడా చాలా సులువు.

క్యారెట్ బొబ్బట్లు రెసిపీ
క్యారెట్ బొబ్బట్లు రెసిపీ

Carrot Bobbatlu: ఆరోగ్యకరమైన స్వీట్లలో క్యారెట్ బొబ్బట్లు ఒకటి. వీటిని నైవేద్యంగా కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. దసరా, దీపావళికి క్యారెట్ బొబ్బట్లు చేసి ప్రసాదంగా పెట్టవచ్చు. వీటిని చేయడం చాలా సులువు. ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే దీనిలో వాడేవి గోధుమ పిండి, క్యారెట్లు, బెల్లం, కొబ్బరి, యాలకులు, నెయ్యి వంటివి. పంచదార వాడము. కాబట్టి దీనివల్ల మన శరీరానికి ఆరోగ్యానికి అంతా ఎన్నో పోషకాలు అందుతాయి.

క్యారెట్ బొబ్బట్లు రెసిపీకి కావాల్సిన పదార్థాలు

గోధుమ పిండి - ఒకటిన్నర కప్పు

క్యారెట్ల తురుము - ఒక కప్పు

బెల్లం తురుము - అరకప్పు

యాలకుల పొడి - అర స్పూను

నెయ్యి - సరిపడినంత

ఉప్పు - చిటికెడు

కొబ్బరి పొడి - మూడు స్పూన్లు

క్యారెట్ బొబ్బట్లు రెసిపీ

1. క్యారెట్ బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని చేయడం చాలా సులువు.

2. మైదాని వాడకుండా గోధుమ పిండిని వాడితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

3. ఒక గిన్నెలో గోధుమపిండి, చిటికెడు ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిని కలుపుకున్నట్టు బాగా కలుపుకోండి.

4. రెండు మూడు స్పూన్ల నూనె వేస్తే ఈ పిండి మెత్తగా వస్తుంది.

5. ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టేయండి.

6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయండి.

7. ఆ నెయ్యిలో తురిమిన క్యారెట్ ను వేసి వేయించండి.

8. అలాగే తురిమిన బెల్లాన్ని వేసి వేయించండి.

9. ఈ మిశ్రమం గట్టిపడుతున్నప్పుడు కొబ్బరి పొడిని కూడా వేసి బాగా కలుపుకోండి.

10. యాలకుల పొడిని కూడా చల్లి బాగా కలుపుకోండి. దీన్ని స్టఫింగ్ కోసం పక్కన పెట్టుకోండి.

11. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి రాయండి.

12. గోధుమ పిండి నుంచి చిన్న ముద్దను తీసి పూరీలా వత్తి మధ్యలో క్యారెట్ల మిశ్రమాన్ని పెట్టండి.

13. రెండు వైపులా బొబ్బట్టును ఒత్తుకున్నాక పెనంపై వేసి కాల్చుకోండి.

14. నెయ్యిని రెండు వైపులా రాసుకోండి. ఇది రంగు మారేవరకు కాల్చి తీసి పక్కన పెట్టుకోండి.

15. అంతే టేస్టీ టేస్టీ క్యారెట్ బొబ్బట్టు రెడీ అయినట్టే.

16. ఇందులో వాడేవన్నీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే, కాబట్టి నిస్సందేహంగా తినవచ్చు.

క్యారెట్ బొబ్బట్లలో వాడిన రెండు ముఖ్యమైన పదార్థాలు క్యారెట్లు, బెల్లం. ఈ రెండూ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యారెట్ లు విటమిన్ ఏను అందిస్తే, బెల్లం ఐరన్ ను అందిస్తుంది. ఈ రెండూ కూడా మన శరీరంలోని ప్రతి అవయవానికి అత్యవసరమైనవి. కాబట్టి అప్పుడప్పుడు క్యారెట్ బొబ్బట్లు తినేందుకు ప్రయత్నించండి.

Whats_app_banner