న్యూఢిల్లీలోని అపోలో ఇంద్రప్రస్థ ఆసుపత్రిలో సీనియర్ కన్సల్టెంట్, కార్డియోవాస్కులర్ అండ్ ఎయోర్టిక్ సర్జన్ డాక్టర్ నిరంజన్ హిరేమఠ్ హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిశబ్దంగా వచ్చే గుండె పోటు విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. "30లలో లేదా 40లలో ఉన్న వ్యక్తులు, బయటికి ఆరోగ్యంగా, చురుకుగా కనిపిస్తారు. కానీ, అకస్మాత్తుగా కుప్పకూలడం లేదా ఎమర్జెన్సీ గదికి వెళ్ళిన తర్వాత వారికి గుండెపోటు వచ్చిందని నిర్ధారణ అవుతుంది. వారు అసలు దీనిని ఊహించి కూడా ఉండరు. ఇవి ఇప్పుడు చాలా అరుదుగా జరిగేవి కాదు. గుండె సమస్యల సంకేతాలు ఏవీ కనిపించకుండానే యువకులలో 'సైలెంట్ హార్ట్ ఎటాక్స్' కేసులు పెరుగుతున్నాయి" అని డాక్టర్ హిరేమఠ్ వివరించారు.
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ అంచనాల ప్రకారం, నమోదయ్యే మొత్తం గుండెపోట్లలో 22 శాతం నుంచి 60 శాతం వరకు సైలెంట్ గుండెపోట్లే ఉంటాయి. అంతేకాకుండా, మహిళల్లో, మధుమేహం ఉన్నవారిలో ఇవి ఎక్కువగా వస్తాయి. కానీ, అసలు సైలెంట్ గుండెపోటు అంటే ఏమిటి? బయటికి ఆరోగ్యంగా కనిపించే వారిని కూడా ఇది ఎందుకు ప్రభావితం చేస్తుంది?
"సాధారణంగా గుండెపోటు అంటే ఛాతీ పట్టుకుని నొప్పితో బాధపడే దృశ్యాలు మనకు గుర్తుకొస్తాయి. కానీ, సైలెంట్ గుండెపోటు ఎటువంటి స్పష్టమైన సూచనలు లేకుండా లేదా చాలా తక్కువ లక్షణాలతో వస్తుంది. వైద్యపరంగా దీనిని 'సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్' అని పిలుస్తారు. ఇది సాధారణ గుండెపోటు లాగే గుండె కండరాలను దెబ్బతీస్తుంది. కానీ, చాలా కాలం వరకు గుర్తించలేం." అని డాక్టర్ హిరేమఠ్ అన్నారు. కొన్నిసార్లు, లక్షణాలు చాలా తేలికపాటివిగా లేదా అసాధారణంగా ఉండటం వల్ల వాటిని అలసట, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు లేదా కండరాల నొప్పిగా పొరపాటు పడతారని ఆయన అన్నారు.
డాక్టర్ హిరేమఠ్ ప్రకారం, గుండె జబ్బు ఉన్నవారిని ఊబకాయులు, శారీరక శ్రమ లేనివారు లేదా వృద్ధులు అనే పాత అభిప్రాయం ఇప్పుడు మారిపోయింది. "శారీరకంగా ఆరోగ్యంగా, చురుకైన జీవనశైలి ఉన్న చాలా మంది యువకులు కూడా ఇప్పుడు గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఒత్తిడితో కూడిన పని వాతావరణాలు, క్రమరహిత నిద్ర విధానాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ధూమపానం, మద్యపానం, సరైన గుండె పరీక్షలు లేకుండా చేసే అధిక జిమ్ వ్యాయామాలు అన్నీ ఈ సమస్యకు కారణమవుతున్నాయి" అని డాక్టర్ హిరేమఠ్ వివరించారు.
"మరో ముఖ్యమైన ప్రమాద కారకం జన్యుపరమైనది. సాధారణంగా, భారతీయులకు చిన్న కరోనరీ ధమనులు ఉండటం, మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చే అవకాశం జన్యుపరంగా ఎక్కువ. కాబట్టి, ఎవరైనా బయటికి ఫిట్‌గా కనిపించినా, వారి శరీరంలో సైలెంట్ ప్రమాద కారకాలను కలిగి ఉండవచ్చు" అని ఆయన స్పష్టం చేశారు.
సైలెంట్ గుండెపోటుల విషయంలో కష్టమైన విషయం ఏమిటంటే, వాటికి సాధారణ గుండెపోటు లక్షణాలు ఉండవు. "కానీ కొన్ని సూక్ష్మమైన సంకేతాలు ఉండవచ్చు. అవి: ఛాతీలో తేలికపాటి అసౌకర్యం, వ్యాయామం చేసేటప్పుడు ఆయాసం, వివరించలేని అలసట, దవడ, మెడ లేదా చేతులలో నొప్పి, కళ్ళు తిరగడం లేదా అజీర్ణం లాంటి అసౌకర్యం – వీటిని తరచుగా విస్మరిస్తాం. లేదా ప్రమాదకరం కానివిగా తప్పుగా అర్థం చేసుకుంటాం" అని డాక్టర్ హిరేమఠ్ అన్నారు.
"బక్కగా ఉన్నా లేదా రోజూ జిమ్‌కు వెళ్ళినా గుండె సంబంధిత సమస్యల నుండి తమను తాము రక్షించుకుంటామని చాలామంది అనుకుంటారు. కానీ శారీరక రూపం లేదా శరీరాకృతి ఎల్లప్పుడూ ధమనుల లోపల ఏమి జరుగుతుందో ప్రతిబింబించదు" అని ఆయన అన్నారు.
డాక్టర్ హిరేమఠ్ గారి ప్రకారం, మీరు యువకులైతే, ఎటువంటి లక్షణాలు లేకపోయినా, వార్షిక ఆరోగ్య పరీక్షలు — ECG (ఎలక్ట్రో కార్డియోగ్రామ్), కొలెస్ట్రాల్ పరీక్షలు, రక్తపోటు, అవసరమైతే స్ట్రెస్ టెస్ట్ — చేయించుకోవడం వల్ల ప్రారంభ హెచ్చరిక సంకేతాలను గుర్తించవచ్చు. "కుటుంబంలో గుండె జబ్బులు, మధుమేహం లేదా అధిక రక్తపోటు చరిత్ర ఉన్న వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే, ఫిట్‌నెస్ అనేది సమగ్రంగా ఉండాలి – ఇందులో క్రమం తప్పకుండా వ్యాయామం, జిమ్, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, ఒత్తిడి నిర్వహణ ఉండాలి. వైద్యుల అనుమతి లేకుండా అతిగా వ్యాయామం చేయడం లేదా విపరీతమైన డైటింగ్ చేయడం మంచి కంటే హాని ఎక్కువ చేయవచ్చు" అని వారు సూచించారు.
ముప్పు గురించి తెలుసుకోవడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా సైలెంట్ గుండెపోటు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చని, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని డాక్టర్ హిరేమఠ్ చెప్పారు.
చిన్న, స్థిరమైన జీవనశైలి మార్పులతో ప్రారంభించమని వారు సూచించారు. "ధూమపానం మానేయండి. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెరను తగ్గించండి. మీ బరువును అదుపులో ఉంచుకోండి. అలాగే, ఒత్తిడిని నియంత్రించడానికి యోగా, ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలను చేయండి. ప్రతిరోజూ కనీసం 7-8 గంటలు నిద్రపోండి. అన్నింటికంటే ముఖ్యంగా, మీ శరీరం మీకు చెప్పేదాన్ని విస్మరించవద్దు. ఏదైనా తేడాగా అనిపిస్తే, బాధగా అనిపిస్తే, వెంటనే తనిఖీ చేయించుకోండి." అని సూచించారు.
"భారతదేశంలో గుండె జబ్బుల స్వరూపం మారుతోంది. ఏ వయస్సు వారికైనా అవగాహన అవసరం. సైలెంట్ గుండెపోటు దాని రాకను ప్రకటించదు. కానీ అది కలిగించే నష్టం జీవితాంతం ఉండవచ్చు లేదా అంతకంటే దారుణంగా ప్రాణాంతకం కావచ్చు. మీరు బిజీ ప్రొఫెషనల్ అయినా, జిమ్ ఔత్సాహికులైనా, లేదా కేవలం బాగానే ఉన్నట్లు భావించే వ్యక్తి అయినా, మీ గుండెకు శ్రద్ధ అవసరం. హెచ్చరిక లేదా సంకేతాల కోసం వేచి ఉండకండి - దాని కంటే ముందే అప్రమత్తంగా ఉండండి" అని డాక్టర్ హిరేమఠ్ ముగించారు.
(పాఠకులకు గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి మీకు ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)
టాపిక్