Capsicum Pulao Recipe: డిన్నర్ కోసం వేడివేడి క్యాప్సికం పులావ్ రెసిపీ, చాలా సింపుల్
Capsicum Pulao Recipe: క్యాప్సికంతో టేస్టీ పులావ్ ను చేసుకోవచ్చు. దీన్ని చేయడం కూడా చాలా సులువు.
Capsicum Pulao Recipe: క్యాప్సికం అనగానే నూడిల్స్ పై చల్లే సలాడే అనుకుంటారు. నిజానికి క్యాప్సికంతో చేసే పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యాప్సికంతో నోరూరించేలా పులావ్ చేయొచ్చు. ఇది నార్త్ ఇండియన్ రెసిపీ. అక్కడ దీన్ని ఇష్టంగా తింటారు. మనకు కూడా ఇది నచ్చే అవకాశం ఎక్కువే. ముఖ్యంగా పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీగా ఇది పనికొస్తుంది. చల్లని వాతావరణంలో రాత్రిపూట వేడివేడిగా డిన్నర్ కి ఇది ఉపయోగపడుతుంది.
క్యాప్సికం పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం - రెండు కప్పులు
క్యాప్సికం - మూడు
లవంగాలు - నాలుగు
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
నూనె - నాలుగు స్పూన్లు
అల్లం - చిన్న ముక్క
యాలకులు - రెండు
నీళ్లు - సరిపడినన్ని
గరం మసాలా పొడి - అర స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
జీడిపప్పు - గుప్పెడు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
జీలకర్ర - రెండు స్పూన్లు
నల్ల మిరియాల పొడి - అర స్పూను
ఉల్లికాడల తరుగు - రెండు స్పూన్లు
పచ్చిమిర్చి - మూడు
క్యాప్సికం పులావ్ రెసిపీ
1. బాస్మతి బియ్యాన్ని కడిగి 20 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టాలి.
2. జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, అల్లం మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అవసరమనుకుంటే నీళ్లు కలుపుకోవచ్చు.
3. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి బాస్మతి బియ్యం ఉడకడానికి సరిపడా నీటిని వేయాలి.
4. ఆ నీరు మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేయాలి.
5. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఉడికించాలి.
6. అన్నం బాగా ఉడికాక స్టవ్ కట్టేయాలి. అన్నం ముద్దవ్వకుండా పొడిపొడిగా వచ్చేలా చూసుకోవాలి.
7. ఇప్పుడు పులావ్ కోసం వేరే కళాయిని స్టవ్ మీద పెట్టాలి. నూనె వేసి జీలకర్ర వేయించాలి.
8. అందులోనే జీడిపప్పు, వెల్లుల్లి పేస్ట్ వేసి నిమిషం పాటు వేయించాలి.
9. అవి వేగాక సన్నగా తరుక్కున్న క్యాప్సికం, బ్రకోలీ ముక్కలను వేసి వేయించాలి.
10. గరం మసాలా పొడి, మిరియాల పొడి వేయాలి.
11. మూత పెట్టి క్యాప్సికం, బ్రకోలీని ఉడకనివ్వాలి. ఐదు నిమిషాలు ఉడకనిచ్చాక మూత తీసి మళ్లీ గరిటతో కలపాలి.
12. అందులో ముందుగా ఉడికించుకున్న బాస్మతి అన్నాన్ని వేసి పొడిపొడిగా వచ్చేలా మొత్తం కలుపుకోవాలి.
13. పైన స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకోవాలి. అంతే క్యాప్సికం పులావ్ రెడీ అయినట్టే.
14. దీన్ని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. స్పైసీగా తినాలనుకునే వారు పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. దీనికి జతగా బంగాళదుంప మసాలా కర్రీ బాగుంటుంది