ఆలోచించి చూస్తే, డబ్బు సంపాదించాక మనం చేసే పని బెడ్ రూం సరిచేసుకోవడం. లేదా బెడ్ రూంను లగ్జరీగా మార్చుకోవడం. ఎందుకంటే, పగలంతా ఎంత పని చేసినా, ఎలాంటి ఫెసిలిటీస్ అనుభవించినా రాత్రి నిద్ర అనేది ప్రశాంతంగా ఉండాలని తపన పడుతుంటారు. ఆహారం, నీరుతో పాటు నిద్రకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు. ప్రతి ఒక్కరూ సుఖంగా నిద్రపోవాలని, అలసట తీరి, ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటారు.
అయితే, ఇటీవలి కాలంలో ఇదే నిద్ర కరువై సమస్యలకు గురవుతున్నారు చాలా మంది. నిద్రలేమితో బాధపడుతూ నరాల సమస్య, ఊబకాయం, రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలకు గురవుతున్నారు. మీలోనూ ఈ సమస్య ఉంటే, లేదా మీకు తెలిసిన వారెవరైనా ఇదే సమస్యతో బాధపడుతుంటే, పరిష్కారం కోసం 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్‌ను ఫాలో అవ్వొచ్చు. రాత్రిళ్ళు నిద్రరాక ఇబ్బందిపడే వారికి ఈ పద్ధతి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పద్ధతి ఏంటి? దీనిని ఎలా అనుసరించాలో తెలుసుకుందాం.
మెడిటేషన్‌తో పాటు కాస్త యోగాను కలిపి ఈ శ్వాస పద్ధతిని అనుసరిస్తే, త్వరగా నిద్రలోకి జారుకుంటాం. 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్, మిమ్మల్ని ఆందోళన నుంచి దూరం చేసి, మత్తులోకి జారుకునేందుకు ప్రోత్సహించడం ద్వారా త్వరగా నిద్రలోకి జారుకునేందుకు సహాయపడుతుంది. ఈ పద్ధతిలో 4 సెకన్ల పాటు ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం, 7 సెకన్ల పాటు గాలిని బిగపట్టడం, 8 సెకన్ల పాటు నోటి ద్వారా గాలిని వదులుకోవడం వంటివి చేయాలి. అవి ఎప్పుడు, ఎలా చేయాలో తెలుసుకోవాలని ఉంటే, ఇక్కడ చూసేయండి.
స్టేజ్ 1 - కంఫర్ట్‌గా అనిపించే పొజిషన్లో కూర్చోండి లేదా పడుకోండి.
స్టేజ్ 2 - మీ నాలుక కొనను మీ పై దవడకు తాకించండి.
స్టేజ్ 3 - 4 సెకన్ల పాటు ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చుకోండి.
స్టేజ్ 4 - 7 సెకన్ల పాటు గాలిని బిగపట్టండి.
స్టేజ్ 5 - 8 సెకన్ల పాటు నోటి ద్వారా నెమ్మదిగా గాలిని వదులుకోండి.
స్టేజ్ 6 - ఈ చక్రాన్ని కనీసం నాలుగు సార్లు రిపీట్ చేయండి.
ఈ బ్రీతింగ్ టెక్నిక్‌ను అనుసరించడం వలన నాడీ వ్యవస్థ శాంతించి, ఆందోళన తగ్గుతుంది. దీనివలన నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ పద్ధతిని అనుసరించడం వలన త్వరగా సడలింపు, మంచి నిద్ర లభిస్తుంది. అంతేకాకుండా, ఇది మొత్తం నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.
నిద్రలేమి ఒక దీర్ఘకాలిక సమస్యగా ఉంటే, వైద్య నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. నిద్రలేమికి అంతర్లీన ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావొచ్చు.