ఆ గొడవ మరిచిపోలేకపోతున్నారా? చేదు జ్ఞాపకాలకు ఇలా చెక్ పెట్టండి-cant forget that fight know 5 ways to get rid of unwanted memories ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Cant Forget That Fight Know 5 Ways To Get Rid Of Unwanted Memories

ఆ గొడవ మరిచిపోలేకపోతున్నారా? చేదు జ్ఞాపకాలకు ఇలా చెక్ పెట్టండి

HT Telugu Desk HT Telugu
Feb 27, 2023 05:51 PM IST

రిలేషన్‌షిప్ మొదట్లో మధురంగా ఉంటుంది. ఇద్దరి గమ్యాలు, ఆశయాలు, ఆకాంక్షలు, అభిరుచులు వేరైనప్పుడు ఓ చిన్న గొడవ కూడా బంధాన్ని బీటలు వారేలా చేస్తుంది. అమితంగా ప్రేమించే వ్యక్తి బాధితులుగా మిగిలిపోతారు. చేదు జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతారు. ఇలాంటి వాటికి ఎలా చెక్ పెట్టాలి?

చేదు జ్ఞాపకాలను దూరంగా పెట్టండి
చేదు జ్ఞాపకాలను దూరంగా పెట్టండి (Freepik)

చేదు జ్ఞాపకాలు పదే పదే వెంటాడుతుంటాయి. ఎంత కాలమైందన్నదానితో సంబంధం లేకుండా మన ప్రస్తుత క్షణాన్ని అవి లోబరుచుకుంటాయి. వాటిని గుర్తుచేసుకున్న ప్రతిసారీ గాయాన్ని మళ్లీ రేపుతాయి. మెదడు సానుకూలమైన వాటితో పోలిస్తే బాధాకరమైన లేదా అవాంఛనీయ అనుభవాలను బాగా గుర్తుంచుకుంటుంది. ఇది మనం అనుభవించిన భయం, అవమానం, అపరాధం లేదా విచారం వంటి ప్రతికూల భావోద్వేగాల వల్ల అయి ఉండొచ్చు.

ఆ ప్రతికూల భావోద్వేగాలకు మనం పరిష్కారం చూపకపోవడంతో అవి మళ్లీ మళ్లీ మనల్ని గాయపరుస్తాయి. అయితే వీటిని మనం పక్కకు తోసేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. గుండె గాయాల్ని రేపు చేదు జ్ఞాపకాలను తుడిచేయాలి. మీ పార్ట్‌నర్ ఫోటోలు, చాట్స్ తీసేయాలి. బంధం బాగున్నప్పుడు వారు పంచిన ఆత్మీయత, ఆప్యాయత, ప్రేమ ముచ్చట్లను గుండెల్లో దాచుకున్నా పరవాలేదు. కానీ గాయాన్ని పదే పదే రేపే వాటిని మాత్రం దూరం చేసేయండి. అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి.

చేదు జ్ఞాపకాలను మరిచిపోవడానికి మనస్తలి ఫౌండర్, సీనియర్ సైక్రియాట్రిస్ట్ డాక్టర్ జ్యోతి కపూర్ పలు సూచనలు చేశారు.

1. చేదు జ్ఞాపకాలను గుర్తు చేసే వాటిని దూరంగా ఉంచండి

కొన్ని అంశాలు, వస్తువులు మన చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. వాటికి మనం స్వస్తి పలికితే గానీ మన చేదు జ్ఞాపకాలు చెదిరిపోవు. కొన్ని మాత్రం మనం చెరిపేసినా చెదిరిపోవు. కాలక్రమంలో అవే వెళ్లిపోతాయి. చేదు జ్ఞాపకాల స్థానంలో సానుకూల ఆలోచనలకు చోటివ్వాలి.

2. మంచి జ్ఞాపకాలకు చోటివ్వండి

చేదు జ్ఞాపకాలకు బదులుగా మంచి జ్ఞాపకాలకు చోటివ్వండి. ఉదాహరణకు మీ మధ్య గొడవ జరిగిన సంఘటన తాలూకు చేదు జ్ఞాపకాలకు బదులుగా మీరు కలిసి ఉన్నప్పటి మధురమైన అనుభవాలను గుర్తు చేసుకోండి.

3. వర్తమానంలో జీవించండి

చేదు జ్ఞాపకాలు మీ దైనందిన కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపుతాయి. మీ పనితీరు తగ్గుతుంది. కానీ మీ లక్ష్యాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ మీ పనిపై దృష్టి సారిస్తే మీరు వర్తమానంలో జీవించడం అలవాటవుతుంది. ఇది మీలో సానుకూలతను పెంపొందింపజేస్తుంది.

4. బిజీగా ఉండండి

మీరు గతంలో లేదా ప్రతికూల ఆలోచనల్లో నివసించకుండా, మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. ఒకవేళ మీకు తగినంత సమయం ఉంటే మీరు మీ స్నేహితులతో గడపడం నేర్చుకోండి. లేదా మీ కుటుంబాన్ని తరచుగా సందర్శించండి.

5. మత్తు పదార్థాలకు బానిస కాకండి

మీ బాధను మరిచిపోయేందుకు మద్యపానం, ధూమపానం వంటి వాటికి, మత్తు పదార్థాల జోలికి వెళ్లకండి. వీటికి బానిస అయితే మీ పతనం ప్రారంభమైనట్టే. ముఖ్యంగా మీరు డిప్రెషన్‌లో, యాంగ్జైటీలో ఉన్నప్పుడు వీటి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం