Rare Syndrome: ఏడుపు రాదు ఏడ్చినా కన్నీళ్లు రావు, ఇది ఒక వింత వ్యాధి, ప్రపంచంలో చాలా తక్కువ మందికే వస్తుంది
Rare Syndrome: ప్రపంచంలో ఉన్న ఎన్నో వింత వ్యాధుల్లో హోగ్రేన్ సిండ్రోమ్ ఒకటి. ఇది అతి తక్కువ మందిలో కనిపిస్తుంది. ఈ సిండ్రోమ్ వచ్చిన వారి కళ్ళు, నోరు, నరాలు పొడి బారిపోతూ ఉంటాయి.
Rare Syndrome: ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక బాధ పెట్టే అంశం ఉంటుంది. ఆ బాధ తగ్గాలంటే తనివి తీరా ఏడ్చేయాలి. ఏడ్చేసిన తరువాత మనసు తేలికపడుతుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. కానీ హోగ్రేన్ సిండ్రోమ్ ఉన్నవారికి మాత్రం ఎంత ఏడ్చినా కన్నీళ్లు రావు. అసలు ఏడుపే రాదు. వారి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోతాయి. నోరు కూడా పొడిబారి పోతూ ఉంటుంది. అందుకే ఈ వ్యాధి వచ్చినవారు ఎమోషనల్ అవ్వడానికి దూరమైపోతారు
ఆటో ఇమ్యూన్ వ్యాధి
హోగ్రెన్ సిండ్రోమ్... దీన్ని ‘డ్రై మ్యూకస్ మెంబ్రేన్ సిండ్రోమ్’ అని కూడా పిలుచుకుంటారు. ఇదొక ఆటో ఇమ్యూన్ వ్యాధి. మన శరీరంలోని కొన్ని అవయవాలు, గ్రంథులపై తెల్లరక్త కణాలు దాడి చేస్తాయి. అలాగే లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంథులు, కన్నీటిని ఉత్పత్తి చేసే గ్రంధులపై కూడా దాడి చేస్తాయి. వాటి పనితీరును దెబ్బతీస్తాయి. దీనివల్ల కళ్ళు, చర్మం, నోరూ అన్నీ పొడిబారిపోతాయి. ఇలాంటి వారు ఏడ్చినా కూడా కన్నీళ్లు రావు. వారికి విపరీతమైన నీరసం వస్తుంది. కీళ్ల నొప్పులు వేధిస్తాయి.
కళ్ళల్లో ఇసుకవేస్తే ఎంత మంటగా ఉంటుందో, ఉదయం నిద్ర లేచాక అంతా ఇబ్బంది పడుతూ ఉంటారు. నిద్ర నుంచి లేవడానికి కూడా కష్టపడతారు. కళ్ళు మసకగా కనిపిస్తూ ఉంటాయి. చర్మం పొడిబారి పోవడంతో దురద, ఎరుపెక్కడం, చికాకు పెట్టడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇలాంటి వ్యక్తులు కంప్యూటర్ పై చేసే ఉద్యోగాలు చేయలేరు. అలాగే ఫ్యాన్, ఏసీలను కూడా వాడలేరు.
హోగ్రెన్ సిండ్రోమ్ వచ్చిన వారిలో ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థ వంటివి తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఈ వ్యాధి ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తుంది.
చికిత్స లేదు
ఈ వ్యాధికి చికిత్స లేదు, రోగిలో కనిపించే లక్షణాలను తగ్గించడానికి మాత్రమే మందులు ఇస్తారు. ఇది జీవితాంతం వెంటాడే సమస్య. ఈ సమస్య ఉన్నవారు బయట తిరగకూడదు. కంటికీ, చర్మానికీ, ఎండా, గాలి తగలకుండా జాగ్రత్త పడాలి. నీరు అధికంగా తాగాలి. శరీరాన్ని పొడి బారే పోయేలా చేసే ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్‌తో చేసిన సబ్బులను కూడా వాడకూడదు. వీలైనంతగా శరీరాన్ని తేమవంతంగా ఉంచుకోవడం చాలా అవసరం..
టాపిక్