జుట్టు రాలిపోవడం చుండ్రు, పొడిదనం, వెంట్రుకలు చిట్లపోవడం వంటి సమస్యలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది రకరకాల నూనెలు, షాంపూలు, స్ప్రేలు, కండీషనర్లు వాడుతుంటారు. అయితే వీటిల్లో చాలా రసాయనాలు ఉంటాయనీ ఇవి ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయని మీకు తెలుసా? వీటిలో ఉండే కొన్ని రకాల రసాయనాలు క్యాన్సర్‌ను కూడా కలిగించొచ్చని అంటున్నారు. ముఖ్యంగా ఫార్మాల్డిహైడ్ అనే రసాయనం లుకేమియా అనే రక్త క్యాన్సర్‌కు కారణం కావచ్చని తాజా పరిశోధనల్లో కనుగొన్నారు. ఇది చాలా మంది ఆడవాళ్లు ప్రతిరోజూ వాడే చాలా రకాల సౌందర్య ఉత్పత్తుల్లో ఇది ఉంటుందంట.
2025 మే నెలలో వచ్చిన ఒక పరిశోధన ప్రకారం చాలా మంది ఆడవాళ్లు ఫార్మాల్డిహైడ్ ఉన్న ఉత్పత్తులు వాడుతున్నారు. లాస్ ఏంజిల్స్‌లో 70 మంది ఆడవాళ్లు తాము వాడే ఉత్పత్తుల లేబుళ్ల ఫోటోలు పంపించారు. వాటిని చూసిన పరిశోధకులు సగం కంటే ఎక్కువ మంది కనీసం ఒక్క ఫార్మాల్డిహైడ్ ఉన్న ఉత్పత్తి అయినా వాడుతున్నారని తేల్చారు. ఈ రసాయనం గొంతు వెనుక, ముక్కు, రక్తం, శోషరస గ్రంథుల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. చాలా మంది ఈ ఉత్పత్తులను రోజూ లేదా వారంలో కనీసం మూడు సార్లైనా వాడుతున్నారట. పరిశీలించిన జుట్టు ఉత్పత్తుల్లో దాదాపు 60 శాతం వాటిలో ఈ క్యాన్సర్ కారకం ఉంది. షాంపూలే కాదు, సబ్బులు, లోషన్లు, కనురెప్పలకు అతికించే గ్లూలో కూడా ఇది ఉంటుందని పరిశోధనల్లో తెలిసింది.
హెయిర్ రిలాక్సర్లు, లీవ్-ఇన్ కండీషనర్లు, నూనెలు లాంటి ఆడవాళ్లు వాడే వాటిల్లో పారాబెన్స్ అనే రసాయనం ఉంటుంది. ఇది వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి వేస్తారు. కానీ ఇది శరీరంలోని హార్మోన్లను మార్చేసి పిల్లలు పుట్టే అవకాశాలను తగ్గిస్తుంది, పునరుత్పత్తి అవయవాలకు కూడా హాని చేస్తుంది.
చాలా పాపులర్ బ్రాండ్‌ల డ్రై షాంపూలలో బెంజీన్ అనే రసాయనం ఉంది. ఇది క్యాన్సర్ కారకం. దీని వల్ల రక్త కణాలకు వచ్చే లుకేమియా లాంటి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.
కొన్ని జుట్టును స్ట్రెయిట్ చేసే లేదా స్మూత్ చేసే ఉత్పత్తుల్లో ఫార్మాల్డిహైడ్ వాడుతారు. ఎవరైతే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు వాళ్లకు సాధారణ ప్రజలతో పోలిస్తే రక్త క్యాన్సర్, మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువట.
షాంపూలలో చాలా రకాల రసాయనాలు కలుపుతారు. కొన్ని శుభ్రం చేయడానికి, కొన్ని మంచి వాసన కోసం. ఈ రసాయనాల వల్ల కొంతమందికి చర్మం దురద పెట్టడం, ఎర్రగా మారడం లాంటి ఎలర్జీలు వస్తాయి.
జుట్టు ఉత్పత్తులు వాడటం వల్ల వచ్చే మరో చెడు ప్రభావం ఏంటంటే.. ఎక్కువగా రసాయనాలు ఉన్న షాంపూలు వాడినా లేదా తరచుగా షాంపూలను వాడినా జుట్టులో ఉండే సహజమైన నూనెలు పోతాయి. దీని వల్ల జుట్టు పొడిగా, బలహీనంగా మారి చిట్లిపోతుంది.
షాంపూలలో వాడే సల్ఫేట్స్ అనే రసాయనాలు తలను బాగా శుభ్రం చేస్తాయి. కానీ అవి జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తాయి, చికాకు పెడతాయి. కుదుళ్లు దెబ్బతింటే వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి.
ఈ పరిశోధనలు పూర్తి నిర్ధారణకు రావడానికి ఇంకా సమయం పట్టొచ్చు. కానీ మనం ఏదైనా ఉత్పత్తి వాడే ముందు దానిలో ఏం కలిపారో లేబుల్ ద్వారా చెక్ చేసుకుని కొనుక్కొవడం మంచిది.