Orange in Pregnancy: గర్భం ధరించాక నారింజ పండ్లు తినవచ్చా? రోజుకు ఎన్ని నారింజలు తినవచ్చు?
గర్భధారణ సమయంలో తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ సమయంలో కొన్ని పండ్లు తినకూడదని అంటారు. చాలా మంది నారింజలు తినాలా? వద్దా? అని ఆలోచిస్తూ ఉంటారు. దానికి పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
గర్భధారణ సమయంలో, మహిళలు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తల్లి తినే ఆహారం పిల్లల ఎదుగుదలపై, ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. గర్భధారణ సమయంలో మహిళలు పోషకాలు నిండిన పండ్లను తినాలని సలహా ఇస్తారు పెద్దలు. ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని పండ్లు తినకూడదని చెబుతారు. బొప్పాయి, పైనాపిల్ వంటివి గర్భం ధరించాక తినకూడదు. అయితే నారింజ కూడా పుల్లని పండే. దీన్ని తినవచ్చా లేదా అనే సందేహం ఎక్కువ మందిలో ఉంది. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం నారింజ పండును గర్భిణులు తినవచ్చు.

గర్భధారణ సమయంలో నారింజ తినడం పూర్తిగా సురక్షితం. వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా కలుగుతాయి. నారింజలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది కాకుండా, నారింజ పండులో మంచి మొత్తంలో నీరు ఉంది. ఇది మీ మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరం తేమవంతంగా ఉండేలా చూస్తుంది.
నారింజ తినడం వల్ల ఉపయోగాలు
1) నారింజ పండ్లలో మంచి మొత్తంలో ఫోలేట్ ఉంటుంది, ఇది గర్భిణీ స్త్రీలలో న్యూరల్ ట్యూబ్స్ అభివృద్ధికి అవసరం.
2) నారింజ తినడం వల్ల రక్తహీనత సమస్య రాకుండా అడ్డకుంటుంది. ఇతర పునరుత్పత్తి ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
3) గర్భధారణలో హైడ్రేషన్ చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, నారింజ తినడం ద్వారా, మీరు రోజువారీ నీటి కొరత తీరిపోతుంది. శరీరం తేమవంతంగా ఉంటుంది. డీ హైడ్రీషన్ బారిన శరీరం పడకుండా నారింజ అడ్డకుంటుంది.
4) నారింజ పండ్లలో ఉండే అనేక పోషకాలు పిండం ఎదుగుదలకు మేలు చేస్తాయి. ఈ పండు గర్భధారణ సమయంలో మెదడు, ఎముకలు, వెన్నుపాముకు పోషణను అందిస్తుంది. కాబట్టి గర్భిణులు నారింజలు తినడం ఎంతో ఆరోగ్యకరం.
5) నారింజ తినడం రక్తపోటును సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది, ఇది గర్భధారణ సమయంలో ఇబ్బందులను నివారించడానికి అవసరం.
6) చాలా మంది మహిళలకు గర్భధారణ సమయంలో వాంతులు అవుతాయి. అటువంటి పరిస్థితిలో, పోషకాల లోపం ఏర్పడవచ్చు. అందువల్ల, ఈ సమయంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడానికి నారింజ ఉత్తమ పండు.
రోజుకు ఎన్ని పండ్లు తినాలి?
గర్భిణీ స్త్రీలు ప్రతిరోజూ కనీసం 85 మి.గ్రా విటమిన్ సి తినాలి. ఆరెంజ్ ఆరోగ్యానికి మంచిది, కానీ దీనిని ఎక్కువగా తినడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట వస్తుంది. రోజుకు రెండు పండ్ల కన్నా ఎక్కువ పండ్లు తినకపోవడమే మంచిది. రెండు పండ్లు తింటే మాత్రం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్