తల, మెడ క్యాన్సర్ అనేది నోరు, గొంతు, స్వరపేటిక వంటి జీర్ణనాళం పైభాగంలో వచ్చే క్యాన్సర్ల సమూహాన్ని సూచిస్తుంది. సిగరెట్ తాగడం క్యాన్సర్‌కు ఒక కారణం అని తెలిసినా, పొగ తాగే లేదా పొగ లేని ఏదైనా రూపంలో పొగాకు వాడకం తల, మెడ క్యాన్సర్లకు ప్రధాన కారణాలలో ఒకటిగా ఉంది. నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్ కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ - సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ విశాల్ బన్సాల్ HT లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.
డాక్టర్ విశాల్ బన్సాల్ మాట్లాడుతూ, "పొగాకు వాడే వారికి తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొగాకు వాడని వారితో పోలిస్తే సుమారు 10 రెట్లు ఎక్కువ. కొత్తగా నిర్ధారణ అయ్యే తల, మెడ క్యాన్సర్లలో సుమారు 80% పొగాకు వాడకంతో సంబంధం కలిగి ఉన్నాయి" అని చెప్పారు.
పొగాకు వినియోగం ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని డాక్టర్ విశాల్ బన్సాల్ మాట్లాడుతూ "పొగాకు ఉత్పత్తులలో 80కి పైగా క్యాన్సర్ కారకాలు (కార్సినోజెన్స్) గుర్తించారు. ఈ క్యాన్సర్ కారకాలను మ్యుటాజెన్స్ అని కూడా పిలుస్తారు. ఇవి DNA నిర్మాణంపై ప్రభావం చూపి, DNA అడక్ట్ ఏర్పడటానికి దారితీస్తాయి. దీనివల్ల శరీరంలో అనేక మార్పులు (మ్యుటేషన్స్) జరిగి, క్యాన్సర్లు వస్తాయి. తల, మెడ క్యాన్సర్ అధికంగా ఉండటం, పురుషులలో ఎక్కువగా కనిపించడం వల్ల దీని సామాజిక-ఆర్థిక ప్రభావం చాలా లోతుగా ఉంటుంది" అని వివరించారు.
"దీర్ఘకాలంగా పొగాకు వాడే వారి నోరు, గొంతులో చాలా మార్పులు వస్తాయి. వారికి కాలక్రమేణా అనేక లక్షణాలు కనిపిస్తాయి. చిన్న రంగు మార్పుల నుండి తీవ్రమైన మచ్చలు, ఫైబ్రోసిస్ (కణజాలం గట్టిపడటం) వరకు ఉండవచ్చు. పొగాకు వాడే వారిలో దంత సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలంగా పొగ తాగే వారికి గొంతు నొప్పి, వాయిస్ మార్పులు, దీర్ఘకాలిక దగ్గు వంటివి తరచుగా కనిపిస్తాయి" అని ఆంకాలజిస్ట్ హైలైట్ చేశారు.
"మీరు పొగాకు వాడే వారైతే, పైన చెప్పిన ఏ కొత్త లక్షణాన్ని అనుభవించినా, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఓపీడీలో నోటిని సాధారణంగా పరిశీలించడం, టెలిస్కోప్ (హాప్‌కిన్స్) ద్వారా గొంతును పరీక్షించడం ద్వారా చాలావరకు తల, మెడ క్యాన్సర్లను గుర్తించవచ్చు. తల, మెడ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించినట్లయితే, నయం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ" అని డాక్టర్ విశాల్ బన్సాల్ వివరించారు.
(గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏవైనా ఆరోగ్య సమస్యల గురించి ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి..)