కడుపు నొప్పితో లివర్, మూత్రాశయ సమస్యలు తెలుసుకోవచ్చా? ఏ నొప్పి దేనికి సంకేతం?-can stomach pain indicate liver or bladder issues understanding the signals of different abdominal pain ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కడుపు నొప్పితో లివర్, మూత్రాశయ సమస్యలు తెలుసుకోవచ్చా? ఏ నొప్పి దేనికి సంకేతం?

కడుపు నొప్పితో లివర్, మూత్రాశయ సమస్యలు తెలుసుకోవచ్చా? ఏ నొప్పి దేనికి సంకేతం?

Ramya Sri Marka HT Telugu

కడుపులో నొప్పిని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే అన్నిసార్లు ఇది సాధారణ నొప్పి మాత్రమే కాకపోవచ్చు. కాలేయం, మూత్రాశయంలో సమస్యల కారణంగా కూడా కడుపులో నొప్పి రావచ్చు. మీరు తరచూ కడుపులో నొప్పితో బాధపడుతుంటే ఏ నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా తెలుసుకోవాలె ఇక్కడుంది.

కడుపులో నొప్పితో బాధపడుతున్న వ్యక్తి (shutterstock)

శరీరంలో వచ్చే ప్రతి నొప్పికి ఒక కారణం ఉంటుంది, కాబట్టి ఏ నొప్పిని కూడా తేలికగా తీసుకోకూడదు. ఒక ప్రత్యేక భాగంలో నిరంతరం నొప్పి వేధిస్తుంటే లేదా మీరు సాధారణంగా అనారోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తే, దాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చాలా మంది తరచుగా కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అయితే దాన్ని పెద్దగా పట్టించుకోరు, సాధారణ నొప్పిగా తీసిపడేస్తారు. నొప్పి మూలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించరు.

నిజానికి కడుపులో నొప్పి వచ్చినప్పుడు మొదటగా చేయాల్సిందేంటంటే.. నొప్పి ఎక్కడ వస్తుందో గుర్తించడం. దీని వల్ల మీ శరీరంలోని ఏ భాగం సమస్యలో ఉందో ఒక అంచనాకు రావచ్చు. ఎందుకంటే అన్ని సార్లు కడుపులో నొప్పి సాధారణ అరుగుదల సమస్య మాత్రమే అయి ఉండకపోవచ్చు. కొన్నిసార్లు కాలేయం నుండి మూత్రాశయం వరకు అనేక అంతర్గత అవయవాల సమస్యల కారణంగా కూడా ఈ నొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నొప్పి స్వభావం, తీవ్రత, దానితో పాటు వచ్చే ఇతర లక్షణాలను గమనించడం చాలా అవసరం. ఏ వైపు నొప్పి రావడం దేనికి సంకేతమో తెలుసుకోవడం ముఖ్యం.

పొట్ట కుడివైపు నొప్పి దేనికి సంకేతం కావచ్చు?

మీ పొట్ట కుడి ఎగువ భాగంలో నొప్పి వస్తుంటే అది సాధారణంగా పిత్తాశయం (Gallbladder) సమస్యలను సూచిస్తుంది. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం లేదా పిత్తాశయానికి సంబంధించిన ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల ఈ రకమైన నొప్పి వస్తుంది. ఇది కాలేయ సమస్య కాకపోవచ్చు కానీ పిత్తాశయం కాలేయానికి దగ్గరగా ఉండటం వల్ల చాలా మంది దీనిని కాలేయ నొప్పిగా భావిస్తారు. ఈ నొప్పి సాధారణంగా భోజనం చేసిన తర్వాత ఎక్కువ అవుతుంది. అలాగే ఇది నెమ్మదిగా కుడి భుజానికి లేదా వెనుకకు వ్యాపిస్తుంది. వికారం, వాంతులు, కామెర్లు కూడా పిత్తాశయ సమస్యల ఇతర లక్షణాలు కావచ్చు.

పొట్ట ఎడమవైపు నొప్పి దేన్ని సూచించవచ్చు?

ఛాతీకి దిగువన పొట్టకు ఎడమ ఎగువ భాగంలో నొప్పి ఉంటే అది క్లోమగ్రంథి (Pancreas) సమస్యలను సూచిస్తుంది. క్లోమగ్రంథి వాపు (Pancreatitis) లేదా ఇతర క్లోమ సంబంధిత రుగ్మతల వల్ల ఈ రకమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉండవచ్చు. కొన్నిసార్లు ఇది వెనక్కి కూడా వ్యాపించవచ్చు. వికారం, వాంతులు, జ్వరం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కూడా చూపించచ్చు. గుర్తుంచుకోండి ఈ రకమైన నొప్పిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకండి, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

పొట్ట మధ్యలో నొప్పి దేనికి సంకేతం?

తరచుగా మీ పొట్ట మధ్య భాగంలో నొప్పి వస్తుంటే అది పొట్టలో పుండుకు (Peptic Ulcer) సంకేతం కావచ్చు. గ్యాస్ట్రైటిస్ (Gastritis) కూడా కడుపు నొప్పికి కారణం కావచ్చు. కానీ పొట్టలో పుండు నొప్పి మరింత తీవ్రంగా, నిర్దిష్ట ప్రదేశంలో ఉంటుంది. ఈ నొప్పి సాధారణంగా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువ అవుతుంది, ఆహారం తీసుకున్న తర్వాత కొంచెం తగ్గుతుంది. నొప్పితో పాటుగా గుండెల్లో మంట, అజీర్ణం, వాంతులు కూడా పుండు ఇతర లక్షణాలు కావచ్చు.

పొట్ట నొప్పికి కారణాలు
పొట్ట నొప్పికి కారణాలు

మూత్రాశయ సమస్యల వల్ల పొట్టలోని ఈ భాగంలో నొప్పి

ప్యూబిక్ ఏరియా పైన, బొడ్డుకు దగ్గరగా నొప్పి ఉంటే అది మీ మూత్రాశయం (Bladder) ఆరోగ్యంగా లేదని సూచిస్తుంది. మూత్రాశయ సంక్రమణ (Urinary Tract Infection - UTI), మూత్రాశయంలో రాళ్లు లేదా ఇతర మూత్రాశయ సంబంధిత సమస్యల వల్ల ఈ రకమైన నొప్పి వస్తుంది. మూత్రవిసర్జన సమయంలో మంట లేదా నొప్పి, తరచుగా మూత్రం రావడం, మూత్రంలో రక్తం రావడం, వెన్ను నొప్పి కూడా మూత్రాశయ సమస్యల ఇతర లక్షణాలు. కాబట్టి, పొట్ట దిగువ భాగంలో వచ్చే నొప్పిని ఎప్పుడూ లైట్ తీసుకోకండి. రోగ నిర్ధారణ కోసం వైద్య పరీక్షలు చేయించుకోండి.

అపెండిక్స్ నొప్పి

పొట్ట దిగువన కుడి భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటే అది అపెండిక్స్ (Appendix) నొప్పి కావచ్చు. అపెండిసైటిస్ (Appendicitis) అనేది ఒక అత్యవసర వైద్య పరిస్థితి. దీనికి తక్షణ చికిత్స అవసరం. ఈ నొప్పి సాధారణంగా బొడ్డు చుట్టూ మొదలై, క్రమంగా దిగువ కుడివైపుకు మారుతుంది, అలాగే చాలా తీవ్రంగా ఉంటుంది. జ్వరం, వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం కూడా అపెండిసైటిస్ ఇతర లక్షణాలు. ఈ నొప్పిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు, వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

మలబద్ధకం వల్ల నొప్పి

పొట్ట దిగువన ఎడమ భాగంలో నొప్పి ఉంటే అది మలబద్ధకం (Constipation) లక్షణం కావచ్చు. మలం గట్టిగా మారడం, ప్రేగు కదలికలు సరిగా లేకపోవడం వల్ల ఈ రకమైన నొప్పి వస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, ప్రేగు కదలికలు కష్టంగా ఉండటం కూడా మలబద్ధకం ఇతర లక్షణాలు. అయితే ఈ నొప్పి దీర్ఘకాలంగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఎందుకంటే ఇది ఇతర పెద్ద ప్రేగు సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. జాగ్రత్త పడటం మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.