ఆధునిక జీవిత శైలిలో ఏసి ఇంట్లో భాగంగా మారిపోయింది. పెరుగుతున్న వేడిని తట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ ఎయిర్ కండిషనర్లను వాడుతున్నారు. అయితే ఆస్తమా ఉన్నవారికి ఎన్నో సందేహాలు ఉంటాయి. ఎయిర్ కండిషనర్లలో ఎక్కువ కాలం ఉండడం వల్ల ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటారు. అలాగే ఏసీలలో ఉండడం వల్ల తమకు హానికరమా కాదా? అనే అనుమానం కూడా ఉంటుంది. వాటన్నింటికీ ఇక్కడ సమాధానం తెలుసుకుందాం.
ఏసీని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఎయిర్ కండిషనర్లు ఆస్తమా బాధితులకు అనేక ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఏసీలు ఇంట్లోని వాతావరణాన్ని నియంత్రించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఏసీని 24 డిగ్రీల నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచితే ఆస్తమా లక్షణాలు ప్రేరేపించే అవకాశం కూడా చాలా తక్కువ.
నాణ్యమైన ఫిల్టర్లతో కూడిన ఎయిర్ కండిషనర్లు వాడితే ఎంతో మంచిది. ఇవి ఇంట్లోని పుప్పొడి, దుమ్ము, కీటకాలు వాయు కాలుష్యం వంటి వాటి వల్ల ఆస్తమా ప్రభావం మొదలవకుండా కాపాడతాయి. అంటే ఆస్తమా ట్రిగ్గర్లను తగ్గించడానికి సహాయపడతాయి.
ఏసి వేసేటప్పుడు అందరూ ఇంటిలోని తలుపులు కిటికీలను వేస్తారు. దీనివల్ల కాలుష్యం, దుమ్ము, ధూళి గదిలోకి చేరకుండా ఉంటుంది. గదిలోని గాలి స్వచ్ఛంగా ఉంటుంది. దీని వల్ల అలెర్జీ కారకాలు ఉండవు. అందుకే ఆస్తమా రోగులకు ఆ గదిలో దగ్గు, జలుబు వంటివి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
ఆస్తమా రోగులు ఏసీ గదిలో ఉండడం వల్ల ఎలాంటి సానుకూల ప్రభావాలు పడతాయో తెలుసుకున్నాం. ఇప్పుడు వాటి వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల గురించి తెలుసుకుందాం.
ఏసీని కొంతమంది చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద సెట్ చేస్తారు. అంటే 18 డిగ్రీలు లేదా 19 డిగ్రీల మధ్య సెట్ చేస్తారు. ఈ ఉష్ణోగ్రత వద్ద ఏసీ ఉన్నప్పుడు ఆస్తమా రోగులకు చాలా సైడ్ ఎఫెక్టులు కలుగుతాయి. వారి శ్వాస మార్గాల్లో చికాకు కలుగుతుంది. ఇదే ట్రిగ్గర్ గా మారి వారికి వెంటనే ప్రభావం కనిపిస్తుంది. ఆస్తమా ఉన్న వ్యక్తులు చల్లని గాలికి తట్టుకోలేరు. ఆస్తమా తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది.
ఏసీ ఫిల్టర్లలో దుమ్ము, బూజు వంటివి పేరుకుపోతూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కానీ చాలామంది అలా క్లీన్ చేయకుండా వదిలేస్తారు. దీనివల్ల శ్వాస కోసం ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇది ఆస్తమా రోగులకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిల్టర్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.
ఎయిర్ కండిషనింగ్ సరైన ఉష్ణోగ్రత వద్ద సెట్ చేసి ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ దాని ఉష్ణోగ్రత సరిగ్గా చెయ్యకపోతే ఆస్తమా రోగుల్లో శ్వాస మార్గాలు పొడిగా మారుతాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఆయాసం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
ఏసీ నడుస్తున్నప్పుడు కిటికీలు తెరిచి ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల కలుషితమైన గాలి బయట నుంచి గదిలోకి చేరి... అక్కడున్న గాలి స్వచ్చతను తగ్గిస్తుంది. ఇది కచ్చితంగా ఆస్తమా రోగులపై ప్రభావాన్ని చూపిస్తుంది.
ఏసీ వాడేవారు పెంపుడు జంతువులను ఆ గదిలోకి రానివ్వకూడదు. అలాగే ఇంటి బాల్కనీలో లేదా ఏసీ పెట్టిన గదికి దగ్గరలో పావురాలు వంటివి ఉన్న జాగ్రత్తగా ఉండాలి. వాటి చుట్టూ ఈకలు, రెట్టలు వంటివి గాలిలో కలిసి గదిలోకి చేరకుండా కాపాడాలి. లేకుంటే ఆస్తమా ఉన్నవారికి అలర్జీలు తక్కువ సమయంలోనే వచ్చేస్తాయి. ఇవి ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశాన్ని కూడా ఇవి పెంచుతాయి.
ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి ఆస్తమా రోగులు ఏసీలు వాడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. ఇండోర్ ఉష్ణోగ్రతను సరిగ్గా సెట్ చేసుకోవాలి. అంటే 24 డిగ్రీల నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచితే ఆస్తమా రోగులకు ఎలాంటి సమస్య రాదు. అలాగే గాలిలో తేమ కూడా సరిగ్గా ఉంటుంది. ఏసీ ఫిల్టర్ ను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవడం మర్చిపోవద్దు. దీనివల్ల గాలి స్వచ్ఛత పెరుగుతుంది. కాలుష్యం ప్రవేశించకుండా ఏసీ ఉన్న గదిని కిటికీలు వేసి ఉంచడం మంచిది. ఏసీలు నడుస్తున్నప్పుడు తలుపులు తీయడం, కిటికీలు తీయడం వంటివి చేయకండి. మీ ఇంటి చుట్టూ పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూసుకోండి. ఎయిర్ కండిషనర్లు సరిగ్గా వాడితే ఆస్తమా రోగులకు ప్రయోజనకరంగా మారుతాయి. అదే సరైన ఉష్ణోగ్రత సెట్ చేయకపోవడం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటివి వారికి హానికరంగా పరిణమిస్తాయి.