Blood Donation | డయాబెటీస్ పేషెంట్లు రక్తదానం చేయవచ్చా? రక్తం ఇచ్చేందుకు ఎవరు అర్హులు కాదు?
Blood Donation: రక్తదానం చేయడం గొప్పదే కానీ అందరూ రక్తదానం చేయవచ్చా? ఎవరు రక్తం ఇచ్చేందుకు అర్హులు, ఎవరు రక్తదానం చేయకూడదు అనే విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
Blood Donation: రక్తదానం చేయడం వలన మరొకరి ప్రాణాలను కాపాడవచ్చు. కానీ రక్తదానం చేసేందుకు ఎవరు అర్హులు అనే విషయంపై చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారు రక్తదానం చేయవచ్చా? రక్తం ఇచ్చేందుకు ఎవరు అర్హులు కాదు అనే విషయాలపై వైద్య నిపుణులు ఇప్పటికే తమ సూచనలు పంచుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
మధుమేహం ఉన్నవారు రక్తదానం చేయరాదని చాలా మంది నమ్ముతారు. వారు రక్తదానం చేయడం వల్ల వారి రక్తాన్ని స్వీకరించిన గ్రహీతలో కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి, అందువల్ల వారు కూడా మధుమేహం వ్యాధిని పొందుతారు అనే నమ్మకం వ్యాప్తిలో ఉంది. కానీ, ఇది పూర్తిగా అవాస్తవం అని వైద్యులు కొట్టిపారేస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారు కూడా నిస్సందేహంగా రక్తదానం చేయవచ్చు. ఎందుకంటే, మధుమేహం అనేది జీవక్రియకు సంబంధించిన వ్యాధి. ఇది రోగి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది కాని రక్తాన్ని కాదు. కాబట్టి డయాబెటీస్ ఉంటే రక్తదానం చేయకూడదు అనేది అపోహ మాత్రమేనని వైద్యులు అంటున్నారు. మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యంగా ఉంచినంత కాలం రక్తదానం చేయవచ్చునని స్పష్టం చేస్తున్నారు.
అయితే ఇన్సులిన్ తీసుకునే వారు, మధుమేహంతో పాటు రోగికి గుండె జబ్బులు లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్నప్పుడు అలాగే ఇతర ఏవైనా ఇన్ఫెక్షన్లను కలిగి ఉంటే అలాంటి సందర్భాల్లో వారు రక్తదానం చేయరాదు అని చెబుతున్నారు.
రక్తదానం చేసేందుకు ఎవరు అర్హులు
18 నుండి 60 సంవత్సరాల వయసు, కనీసం 50 కేజీల బరువు ఉన్న ఆరోగ్యవంతులు ఎవరైనా రక్తదానం చేయవచ్చు.
రక్తదానం ఎవరు చేయకూడదు
- జలుబు, ఫ్లూ, గొంతు నొప్పి, జలుబు పుండ్లు, కడుపులో పుండ్లు లేదా ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు రక్తదానం చేయకూడదు.
- రక్తహీనత కలవారు చేయకూడదు
- ఇటీవల పచ్చబొట్లు, టాటూలు పొడిపించుకుంటే, 6 నెలల వరకు రక్తదానం చేయలేరు.
- దంత చికిత్స తీసుకుంటే 24 గంటల వరకు రక్తదానం చేయరాదు
- తల్లిపాలు ఇచ్చే సమయంలో రక్తదానం చేయడం మంచిది కాదు.
- అసురక్షిత శృంగారంలో పాల్గొన్నవారు కనీసం ఏడాది పాటు రక్తదానం ఇవ్వడానికి నిషేదం
- HIV (AIDS వైరస్) నిర్ధారణ అయిన వారు శాశ్వతంగా రక్తదానం చేసేందుకు నిషేధం
- అలాగే డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకున్న వారు కూడా రక్తదానం చేయకూడదు.
సురక్షితమైన రక్తాన్ని దానంగా ఇవ్వండి, మరొకరి ప్రాణాలను నిలబెట్టండి. రక్తదానంపై అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సం (World blood donor day) గా నిర్వహిస్తారు.
సంబంధిత కథనం