Cabbage Rice: క్యాబేజీ కూర తినాలనిపించకపోతే ఇలా క్యాబేజీ రైస్ చేసేయండి, రెసిపీ చాలా సులువు
Cabbage Rice: క్యాబేజీ కూర ఎక్కువ మందికి నచ్చదు. అలాంటివారు క్యాబేజీ రైస్ ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
Cabbage Rice: ఆరోగ్యకరమైన కూరగాయల్లో క్యాబేజీ కూడా ఒకటి. కానీ దీన్ని ఇష్టపడే వారి సంఖ్య చాలా తక్కువ. క్యాబేజీతో చేసే వంటకాలు ఎక్కువమందిని ఆకర్షించవు. అలాంటివారు క్యాబేజీ రైస్ తిని చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీలోని పోషకాలు మీ శరీరానికి అందుతాయి. క్యాబేజీ రైస్ చేయడం చాలా సులువు. దీని రెసిపీ ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజీ రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
క్యాబేజీ తరుగు - ఒక కప్పు
వండిన అన్నం - రెండు కప్పులు
గరం మసాలా - అర స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
కారం - అర స్పూను
పసుపు - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
క్యాప్సికం తరుగు - రెండు స్పూన్లు
క్యారెట్ తరుగు - మూడు స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
కరివేపాకులు - గుప్పెడు
జీలకర్ర - ఒక స్పూను
ఆవాలు - ముప్పావు స్పూన్
నూనె - మూడు స్పూన్లు
క్యాబేజీ రైస్ రెసిపీ
1. క్యాబేజీ రైస్ చేసుకునేందుకు ముందుగానే అన్నాన్ని వండి పెట్టుకోవాలి.
2. అన్నాన్ని ప్లేట్లో పరిచి ముద్దలా కాకుండా పొడిపొడిగా వచ్చేలా ఆరబెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడించాలి.
5. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి.
6. అవి బాగా వేగాక సన్నగా తరిగిన క్యారెట్, క్యాప్సికంలను వేసి బాగా కలపాలి.
7. ఇప్పుడు అవన్నీ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.
8. ఇప్పుడు సన్నగా తరిగిన క్యాబేజీని వేసి, పైన ఉప్పు చల్లి బాగా కలపాలి.
9. క్యాబేజీ పైన మూత పెడితే అది మెత్తగా ఉడుకుతుంది.
10. అందులో పసుపు, కారం, గరం మసాలా వేసి కలుపుకోవాలి.
11. చిన్న మంట మీద దీన్ని ఫ్రై చేయాలి. క్యాబేజీ పచ్చివాసన పోయి దాకా ఫ్రై చేసుకోవాలి.
12. ఇప్పుడు వండిన అన్నాన్ని అందులో కలుపుకొని పులిహోరలా పొడిపొడిగా కలుపుకోవాలి.
13. పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.
14. అంతే క్యాబేజీ రైస్ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
15. ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీగా ఉపయోగపడుతుంది.
16. నోరు చప్పగా అనిపిస్తే రాత్రిపూట డిన్నర్లో చేసుకున్నా బాగుంటుంది.
క్యాబేజీ కూరలు ఇష్టపడని వారికి ఈ క్యాబేజీ రైస్ మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు. ఇది క్యాబేజీ నుంచి పచ్చి వాసన రాకుండా ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి దీన్ని చేసుకొని తినండి. మళ్లీ మీరే పదేపదే చేసుకుంటారు. క్యాబేజీ పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. డబ్బై శాతం ఉడికితే చాలు, దానిలో అన్నం కలిపేయొచ్చు. క్యాబేజీ రైస్ వండడానికి కేవలం 20 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి.