Butter Naan: బటర్ నాన్ బయటకొనే బదులు ఇంట్లోనే ఇలా సులువుగా చేసుకోండి, రెసిపీ ఇదిగో-butter naan recipe in telugu know how to make this tasty dish ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Butter Naan: బటర్ నాన్ బయటకొనే బదులు ఇంట్లోనే ఇలా సులువుగా చేసుకోండి, రెసిపీ ఇదిగో

Butter Naan: బటర్ నాన్ బయటకొనే బదులు ఇంట్లోనే ఇలా సులువుగా చేసుకోండి, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu

Butter Naan: బటర్ నాన్ అంటే ఎంతో మందికి ఇష్టం. దీన్ని ఎక్కువగా బయటే కొంటూ ఉంటారు. నిజానికి దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బటర్ నాన్ రెసిపీ తెలుసుకోండి.

బటర్ నాన్ రెసిపీ (Youtube)

బటర్ నాన్‌తో చికెన్ కర్రీని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. వీటిని తినే వాళ్ళు కూడా రెస్టారెంట్లకు, దాబాలకు వెళితే అధికంగా బటర్ నాన్ ఆర్డర్ పెడుతూ ఉంటారు. దీన్ని చేయడం కష్టం అనుకుంటారు.ఇంట్లోనే చాలా సులువుగా బటర్ నాన్ చేసేయవచ్చు. కాకపోతే బటర్ నాన్ పూర్తిగా మైదాతో తయారుచేస్తారు. కాబట్టి అధికంగా తినడం అంత మంచిది కాదు. అప్పుడప్పుడు తింటే ఫర్వాలేదు.

బటర్ నాన్ రెసిపీకి కావలసిన పదార్థాలు

మైదా - ఒకటిన్నర కప్పు

పెరుగు - పావు కప్పు

బేకింగ్ సోడా - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పంచదార - అర స్పూను

నీరు - తగినంత

బట్టర్ - పావు కప్పు

బటర్ నాన్ రెసిపీ

1. బటర్ నాన్ రెసిపీలో పూర్తిగా మైదా పిండినే వాడతారు.

2. ఒక గిన్నెలో మైదాపిండి, పెరుగు, బేకింగ్ సోడా, ఉప్పు, పంచదార వేసి బాగా కలుపుకోవాలి.

3. తగినంత నీరు వేసి చపాతీ పిండికి లేదా పూరీ పిండికి ఎలా కలుపుకుంటారో అలా కలుపుకోవాలి.

4. దాన్ని నాలుగైదు ఉండల్లా చుట్టుకుని పైన కాస్త పిండి జల్లి ఒక ప్లేట్లో పెట్టాలి. పైన తడి గుడ్డను మూత పెట్టాలి.

5. ఒక పది నిమిషాలు అలా వదిలేయాలి. తర్వాత మైదా పిండిని చపాతీ పీటపై చల్లి ఈ మైదాపిండి ముద్దను పెట్టి చేతితోనే ఒత్తుకోవాలి.

6. దీన్ని ఒత్తడానికి రోలింగ్ పిన్ అవసరం లేదు.

7. కేవలం చేతితోనే కావాల్సిన సైజులో ఒత్తుకోవాలి.

8. కొంచెం నీళ్లను చేత్తో తడి చేసుకొని ఈ నాన్ పై రాయాలి.

9. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అది వేడెక్కాక ఈ నాన్ పైన వేసి కాల్చాలి. ఎలాంటి నూనె పెనంపై వేయాల్సిన అవసరం లేదు.

10. రెండు వైపులా కాల్చుకున్నాక తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు వెన్నను ఈ నాన్ పై బాగా పూయాలి.

11. అంతే టేస్టీ బటర్ నాన్ రెడీ అయినట్టే. దీన్ని మీరు పనీర్ బటర్ మసాలా కూరతో లేదా చికెన్ గ్రేవీతో తింటే రుచిగా ఉంటుంది.

12.ఒక్కసారి చేసుకుంటే తినాలనిపించేలా ఉంటుంది. కానీ మైదాపిండి ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఎక్కువసార్లు తినడం మంచి పద్ధతి కాదు.

బటర్ నాన్ మైదా పిండితోనే చేస్తారు. లేకపోతే అవి గోధుమపిండితో చేస్తే చపాతీ, రోటీల్లా అనిపిస్తాయి. కాబట్టి మీరు బటర్ నాన్ తినాలి. అనుకుంటే తప్పకుండా మైదాపిండినే వాడాలి. మైదాపిండి వల్ల అనారోగ్య సమస్యల అధికంగా వస్తాయి. కాబట్టి నెలకి ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే బటర్ నాన్ ప్రయత్నించండి. ఇక మధుమేహం ఉన్నవారు పూర్తిగా వాటిని తినకపోవడం మంచిది. సమస్యలు మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది.

సంబంధిత కథనం