Budget Festive attire: దసరా, బతుకమ్మలకు.. ఇవిగో బడ్జెట్ ఫ్యాషన్స్
Budget Festive attire: ఈ పండగకి కొత్త దుస్తుల్లో తక్కువ ధరతో మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే కొన్ని ఫ్యాషన్ టిప్స్ ఫాలో అయిపోండి.
బతుకమ్మ.. దసరా.. ఇప్పుడు ఉన్నదంతా పండగల హడావిడే. చీరలు, లెహంగాలు, చక్కని చుడిదార్లలో యువతులంతా ముస్తాబవుతారు. అబ్బాయిలేమో పైజమాలు ధరించి పండగను జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందుకోసమే షాపింగ్‌లకు సిద్ధమైపోతూ ఉన్నారు. మీరూ అదే ఆలోచనలో ఉన్నారా? తక్కువ బడ్జెట్‌లో మంచి దుస్తులను ఎంచుకోవాలనుకుంటున్నారా? అయితే ముందు ఇదొక్కసారి చదివేయండి. బడ్జెట్ దుస్తుల్లో మీరు మెరిసిపోయే ఐడియాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి.
పాత దాన్ని కొత్తగా :
మీరు గనుక బడ్జెట్ షాపర్లయితే దుకాణాలకు వెళ్లే ముందు ఓసారి మీ బీరువాల్లో వాడకుండా పెట్టేసిన దుస్తులు ఏమేం ఉన్నాయో ఓసారి సరి చూసుకోండి. పాత లెహంగాలకు ఇప్పటి ట్రెండ్‌కి తగినట్లుగా దుపట్టాలను మార్చుకోవచ్చు. లేదంటే బ్లౌజ్‌ని మార్చి ఆ జతకు కొత్త లుక్ తేవచ్చు. ఇంకా ఇప్పుడు నడుముకు ఎంబ్రాయిడరీ బెల్టులు కూడా ట్రెండ్‌లో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో బోలెడు రకాలు అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి వాటిని మీ పాత దుస్తులకు చేర్చి చూడండి. ట్రెండింగ్ లుక్ వచ్చేస్తుంది. ఇలా తక్కువ బడ్జెట్‌తోనే పాతదాన్ని మరో కొత్త రకంగా మార్చేసుకోవచ్చు. క్రియేటివిటీతో ప్రయత్నించండి. అంతా వహ్ వా అనకపోతే చూడండి.
పార్టీ వేర్‌కి బదులు :
అమ్మాయిలు పార్టీ వేర్ డ్రస్సులు కొనుక్కోవాలంటే బోలెడు ఖరీదు. ఎక్కువ సార్లు వేసుకోలేరు కూడా. బదులుగా ప్లెయిన్‌గా ఉండే అనార్కలీలను ఎంచుకోండి. అవి తక్కువ రేట్లలోనే దొరికేస్తాయి. వాటి మీదకి మంచి వర్క్ వచ్చిన కాంట్రాస్ట్ దుప్పట్టాగాని, లేదంటే పట్టు చున్నీలను గాని పెయిర్ చేసుకోండి. లేదంటే మరో డ్రస్‌కు వచ్చిన గ్రాండ్‌గా ఉన్న దుప్పట్టాలు ఏమైనా దీని మీదకు సరిపోతాయేమో చూసుకోండి. అప్పుడు తక్కువ బడ్జెట్‌లో మంచి జత వచ్చేస్తుంది. రిచ్ లుక్‌నీ ఇస్తుంది. అబ్బాయిలు ఎక్కవ రేట్లు పెట్టి పైజమాలను కొనుక్కున్నా ఒకసారో రెండు సార్లో వేసుకుంటారు. ఎక్కువ హడావిడి లేకుండా సాదాగా ఉండేవి అయితే జీన్స్ ప్యాంట్ల మీదా చక్కగా వేసేసుకోవచ్చు. ఇలా అయితే వాటిని కాస్త ఎక్కువసార్లు వేసుకోవడానికీ ఇష్టపడతారు. అందుకనే కొనుక్కునేప్పుడే ఎక్కువ హడావిడి లేకుండా లేత రంగుల్లో ఉండే వాటిని ఎంచుకోండి.
చేనేత దుస్తులు :
చేనేత దుస్తులు ఎంతో హుందాగా, అందంగా ఉంటాయి. దుకాణాల్లో చేనేత వస్త్రాలను కొనకుండా నేరుగా నేత కార్మికుల దగ్గరకు వెళ్లండి. అక్కడ దుకాణాల కంటే చాలా తక్కువ ధరలకే మీకు మంచి ఖాదీ, పట్టు వస్త్రాలు దొరుకుతాయి. అలా కొనుక్కోవడం వల్ల మీకూ లాభసాటిగా ఉంటుంది. నేత కార్మికులకూ చేయూత ఇచ్చినట్లు ఉంటుంది. వాటికి జతగా మంచి హెవీ ఎంబ్రాయిడరీ బ్లవుజు జత చేసుకుంటే లుక్ పూర్తిగా మారిపోతుంది.