semiya Lemon Pulihora : సేమియా నిమ్మకాయ పులిహోర.. అల్పాహారంలోకి ట్రై చేయండి-breakfast recipes how to make semiya lemon pulihora ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Breakfast Recipes How To Make Semiya Lemon Pulihora

semiya Lemon Pulihora : సేమియా నిమ్మకాయ పులిహోర.. అల్పాహారంలోకి ట్రై చేయండి

HT Telugu Desk HT Telugu
Mar 12, 2023 06:30 AM IST

semiya Lemon Pulihora : రోజూ ఒకేలా ఏం తింటారు. అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయండి. హెల్తీగా కూడా ఉండే ఆహారం ఉదయం పూట తినండి. అందుకోసం.. సేమియా నిమ్మకాయ పులిహోర తయారు చేయండి.

సేమియా నిమ్మకాయ పులిహోర
సేమియా నిమ్మకాయ పులిహోర

హడావుడిగా ఏది పడితే.. అది చేసుకుని తినే బదులు కొత్తగా ట్రై చేయండి. అల్పాహారంలోకి సేమియా నిమ్మకాయ పులిహోరను ట్రై చేయండి. బాగుంటుంది. పిల్లలు కూడా రోజూ ఒకేలా పెడితే.. తినేందుకు ఇంట్రస్ట్ చూపించరు. డైలీ అదేనా అంటూ అడుగుతారు. ఇడ్లీ, దోశ బోర్ కొట్టేసి కొత్త రుచులు కావాలని అడుగుతారు. అందుకే పిల్లల కోసం కొత్తగా సేమియా పులిహోర ప్రయత్నించండి. టేస్టీగా కూడా ఉంటుంది. పులుపుగా కమ్మగా అనిపిస్తుంది. మీ ఇంట్లో వాళ్లకు తప్పకుండా నచ్చుతుంది. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

సేమియా పులిహోరకు కావలసిన పదార్థాలు

కప్పు సేమియా, పసుపు, సాల్ట్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2, తాలింపు దినుసులు, కరివేపాకు, పల్లీలు, జీడిపప్పు, ఒక నిమ్మచెక్క.

ఎలా చేయాలంటే..

ముందుగా స్టవ్ వెలిగించి.. గిన్నె పెట్టుకోవాలి. అందులో అరలీటర్ నీటిని వేయాలి. బాగా మరిగించాలి. అందులో పావు టీస్పూన్ పసుపు వేసుకోవాలి. పావు టీస్పూన్ ఉప్పు వేయాలి. ఆ తర్వాత కప్పు సేమియా కూడా అందులో వేసుకోవాల్సి ఉంటుంది. సేమియాను కలుపుకోవాలి. ఉడికేప్పుడు పసుపు వేయడంతో మంచి రంగు వచ్చి పులిహోర చూసేందుకు బాగుంటుంది.

ఇలా కాసేపు సేమియా ఉడికే వరకూ చూసుకోవాలి. సగం ఉడికితే చాలు. మరీ మెత్తగా చేసుకోవద్దు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. సేమియాను వడకట్టుకోవాలి. ఆ తర్వాత చల్లని నీళ్లను పోయండి. సేమియా అంటుకోకుండా పొడిపొడిగా వస్తుంది. నీళ్లు మెుత్తం పోయాక ఒక ప్లేట్ లోనికి తీసుకుని సేమియాను ఆరబెట్టుకోవాలి.

సేమియా చల్లారే వరకూ.. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని.. తాలింపును తయారు చేసుకోవాలి. గిన్నెలో రెండు చెంచాల నూనె వేసుకుని.. అందులో ఒక టీ స్పూన్ శెనిగపప్పు, ఒక టీస్పూన్ ఆవాలు, ఒక టీస్పూన్ మినపప్పు, పావు టీస్పూన్ జీలకర్ర, పల్లీలు వేసుకుని మీడియం మంటలో వేయించుకోవాలి. ఇందులో జీడిపప్పు, నిలువునా.. కోసిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేయాలి. సేమియాకు సరిపడా.. ఉప్పుని కూడా వేసుకోవాలి. తాలింపు వేగాక.. ఉడికించి చల్లార్చిన సేమియాను వేసుకుని.. తాలింపు సేమియాకు పట్టేలాగా కలుపుకోవాలి. తాలింపు కలిశాక స్టౌవ్ ఆఫ్ చేయండి. అందులో ఒక నిమ్మచెక్క పిండుకుని మెుత్తం కలుపుకోవాలి. పైన కాస్త కొత్తిమీర తురుము చల్లుకుంటే.. రుచికరమైన సేమియా పులిహోర తయారైనట్టే. ఉదయం అల్పాహారంగా తీసుకోండి. టేస్టీగా ఉంటుంది.

WhatsApp channel

టాపిక్