Borugula Upma: బొరుగుల ఉప్మా ఇలా తయారు చేసుకున్నారంటే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది-borugula upma recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Borugula Upma: బొరుగుల ఉప్మా ఇలా తయారు చేసుకున్నారంటే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది

Borugula Upma: బొరుగుల ఉప్మా ఇలా తయారు చేసుకున్నారంటే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది

Haritha Chappa HT Telugu
Jun 08, 2024 06:00 AM IST

Borugula Upma: ఎప్పుడు ఒకేలాంటి టిఫిన్‌లు తినేకన్నా... అప్పుడప్పుడు కొత్తగా అల్పాహారాలను ప్రయత్నించండి. ఇక్కడ బొరుగులు ఉప్మా రెసిపీ ఇచ్చాము. ఒకసారి తిని చూడండి.

బొరుగుల ఉప్మా రెసిపీ
బొరుగుల ఉప్మా రెసిపీ

Borugula Upma: ఉదయం పూట పది నిమిషాల్లో రెడీ అయిపోయే అల్పాహారాల కోసం వెతుకుతున్నారా? ఇక్కడ మేము బొరుగుల ఉప్మా రెసిపీ ఇచ్చాము. ఇది కేవలం పావుగంటలో రెడీ అయిపోతుంది. అప్పటికప్పుడు చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఇది. దీన్ని చేయడం చాలా సులువు. దీన్ని బొరుగుల ఉప్మా లేదా మరమరాల ఉప్మా అని అంటారు. కర్నూలు వంటి ప్రాంతాల్లో ఉగ్గాని అని పిలుచుకుంటారు. దీని రుచి అదిరిపోతుంది. వేడివేడిగా ఉన్నప్పుడే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వండుకొని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.

బొరుగుల ఉప్మా రెసిపీకి కావలసిన పదార్థాలు

బొరుగులు - రెండు కప్పులు

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - రెండు

టమాట - ఒకటి

పుట్నాల పప్పు - రెండు స్పూన్లు

కొబ్బరి తురుము - ఒక స్పూను

నిమ్మరసం - ఒక స్పూన్

పసుపు - పావు స్పూను

పల్లీలు - గుప్పెడు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ఆవాలు - పావు స్పూను

జీలకర్ర - పావు స్పూను

మినపప్పు - ఒక స్పూను

కరివేపాకులు - గుప్పెడు

ఉప్పు - రుచికి సరిపడా

బొరుగుల ఉప్మా రెసిపీ

1. బొరుగులను నీటిలో వేసి ఐదు నిమిషాలు నానబెట్టాలి.

2. తర్వాత చేత్తోనే పిండి తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేయాలి.

4. ఆయిల్ లో ఆవాలు, మినప్పప్పు, పల్లీలు, పుట్నాల పప్పు వేసి వేయించుకోవాలి.

5. ఆ తర్వాత కరివేపాకులు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.

6. ఆ తర్వాత నిలువుగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి.

7. పసుపును కూడా వేసి వేయించాలి.

8. అందులోనే ఉప్పు, టమాట తరుగు వేసి వేయించాలి. టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఉంచాలి.

9. తర్వాత ముందుగా పిండి పెట్టుకున్నా బొరుగులను వేసి కలుపుకోవాలి.

10. పైన కొత్తిమీర తురుమును చల్లుకొని నిమ్మరసాన్ని వేసుకుంటే బొరుగుల ఉప్మా రెడీ అయిపోతుంది.

11. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే రుచి అదిరిపోతుంది. పైన పచ్చి ఉల్లిపాయలు జల్లుకొని తింటే ఇంకా బాగుంటుంది.

బొరుగులు ఆరోగ్యానికి మేలే చేస్తాయి. పిల్లలు ఇష్టంగా తినే వాటిలో బొరుగులు ఒకటి. వీటిని కొన్ని ప్రాంతాల్లో మరమరాలు అని పిలుస్తారు. ఈ బొరుగులు ఉప్మాను రాయలసీమ వంటి ప్రాంతాల్లో ఉగ్గాని అనిపించుకుంటారు. దీన్ని చేసిన వెంటనే వేడిగా తింటే రుచి అదిరిపోతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇది మీకు నచ్చడం ఖాయం.

Whats_app_banner