Biyyam Ravva Pulihora: అన్నం పులిహోర బోర్ కొడితే బియ్యం రవ్వతో ఇలా పులిహోర చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఇదిగో రెసిప
Biyyam Ravva Pulihora: పులిహోర అనగానే అందరూ అన్నంతో చేసిందని అనుకుంటారు. బియ్యం రవ్వతో కూడా టేస్టీగా పులిహోర చేసుకోవచ్చు. ఇది దీన్ని చేయడం చాలా సులువు. ఇక్కడ రెసిపీ ఇస్తున్నాం.
Biyyam Ravva Pulihora: వారానికి ఒక్కసారైనా ప్రతి ఇంట్లో పులిహోర ఉంటుంది. పండగలు వస్తే చింతపండు పులిహోర, బ్రేక్ ఫాస్ట్ సమయంలో నిమ్మకాయ పులిహారను తరచూ చేసుకుంటూ ఉంటారు. వీటిని చేయడం చాలా సులువు. కాబట్టి ఎక్కువగా వాటినే చేస్తుంటారు. అన్నంతో చేసిన పులిహోర బోర్‌గా అనిపించినప్పుడు ఒకసారి బియ్యం రవ్వతో పులిహోర చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. దీన్ని చేయడం చాలా సులువు. అలాగే ఇది పిల్లలకు మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా అవుతుంది. దీన్ని చేయడం చాలా సింపుల్. రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.
బియ్యం రవ్వ పులిహోర రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం రవ్వ - వంద గ్రాములు
నీళ్లు - తగినన్ని
మినప్పప్పు - ఒక స్పూను
శెనగపప్పు - ఒక స్పూను
ఆవాలు - అర స్పూను
ఎండుమిర్చి - రెండు
పచ్చిమిర్చి - రెండు
కరివేపాకులు - గుప్పెడు
జీడిపప్పు - ఐదు
నిమ్మరసం - ఒకటిన్నర స్పూను
పసుపు - చిటికెడు
ఉప్పు- రుచికి సరిపడా
నూనె - రెండు స్పూన్లు
బియ్యం రవ్వ పులిహోర రెసిపీ
1. బియ్యం రవ్వను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయాలి. అది ఉడకడానికి సరిపడా నీటిని వేసి పైన మూత పెట్టాలి.
2. ఒక విజిల్ వచ్చేదాకా ఉంచి స్టవ్ కట్టేయాలి. తర్వాత కుక్కర్ మూత తీసి ఉడికిన రవ్వను ఒక ప్లేట్లో పొడిపొడిగా వచ్చేలా పరచాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. నూనె వేడెక్కాక జీడిపప్పులను వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
5. ఆ నూనెలో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి చిటపటలాడించాలి.
6. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకులు వేసి వేయించుకోవాలి.
7. అందులోనే జీడిపప్పులు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి.
8. ఇప్పుడు ఉడికిన రవ్వను అందులో వేసి పొడిపొడిగా వచ్చేలా కలుపుకోవాలి.
9. పైన నిమ్మ రసాన్ని చల్లుకోవాలి. అంతే రవ్వ పులిహోర రెడీ అయినట్టే. ఇది టేస్టీగా ఉండాలంటే ఒక గంట పాటు అలా వదిలేయండి. తర్వాత అది పొడిపొడిగా అవుతుంది. అప్పుడు తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిలోకి కూర, పచ్చడి వంటివి అవసరం లేదు. లేదా పల్లీల చట్నీ వేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.
ఇది కేవలం బ్రేక్ ఫాస్ట్ రెసిపీగానే కాదు మంచి లంచ్ బాక్స్ రెసిపీగా ఉపయోగపడుతుంది. ఇది నమలడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా లంచ్‌లో వేగంగా దాన్ని తినగలరు. ఒక్కసారి మీ పిల్లలకు పెట్టి చూడండి, వారు కచ్చితంగా దీన్ని ఇష్టపడతారు. బియ్యం రవ్వ వల్ల శరీరానికి శక్తి అందుతుంది. కాబట్టి నీరసపడతారని భయపడక్కర్లేదు. ఈ బియ్యం రవ్వ పులిహోరను చాలా తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి.