Bisi bele bath: బిసిబెలాబాత్... ఈ కన్నడ వంటకం తింటే ఇంకా తినాలనిపిస్తుంది, రెసిపీ ఇదిగో-bisi bele bath recipe in telugu know how to make this rice recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bisi Bele Bath: బిసిబెలాబాత్... ఈ కన్నడ వంటకం తింటే ఇంకా తినాలనిపిస్తుంది, రెసిపీ ఇదిగో

Bisi bele bath: బిసిబెలాబాత్... ఈ కన్నడ వంటకం తింటే ఇంకా తినాలనిపిస్తుంది, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu
May 22, 2024 05:00 PM IST

Bisi bele bath: బిసిబెలాబాత్... ఇది కన్నడిగులు బాగా ఇష్టపడే వంటకం. దీన్ని చేసే పద్ధతిలో చేస్తే రుచిగా ఉంటుంది. లేకపోతే సాంబార్ అన్నంలా ఉంటుంది. దీని రెసిపీ ఇక్కడ మేము ఇచ్చాము. దాన్ని ఫాలో అయిపొయింది.

బిసిబెలా బాత్ రెసిపీ
బిసిబెలా బాత్ రెసిపీ

Bisi bele bath: కర్ణాటక స్టైల్‌లో బిసిబెలాబాత్ చేస్తేనే రుచిగా ఉంటుంది. చాలామంది సాంబార్‌లాగా దీన్ని తయారు చేస్తారు. కన్నడిగులు చేసే విధంగా వండితే ఆ రుచే వేరు. ఒక్కసారి తిన్నారంటే వదలడం చాలా కష్టం. దీని ముందు సాంబార్ దిగదుడుపే. ఇది ఎలా ఉండాలో తెలుసుకోండి

బిసిబెలాబాత్ రెసిపీకి కావలసిన పదార్థాలు

వండిన అన్నం - రెండు కప్పులు

క్యారెట్ - ఒకటి

ఎండుమిర్చి - రెండు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

మిరియాలు - నాలుగు

ధనియాలు - ఒక స్పూను

కందిపప్పు - ఒక కప్పు

శనగపప్పు - రెండు స్పూన్లు

ఆవాలు - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

జీడిపప్పు - గుప్పెడు

కరివేపాకులు - గుప్పెడు

కొబ్బరి తురుము - ఒక స్పూను

చింతపండు - చిన్న ఉసిరికాయ సైజులో

బెల్లం - చిన్న ఉసిరికాయ సైజులో

ఆనపకాయ ముక్కలు - ఏడు

ఉల్లిపాయ - ఒకటి

ములక్కాడ - ఒకటి

మెంతులు - అర స్పూను

ఇంగువ - చిటికెడు

నీరు - సరిపడినంత

ఉప్పు - రుచికి సరిపడా

బిసిబెలాబాత్ రెసిపీ

1. కుక్కర్లో కందిపప్పును శుభ్రంగా కడిగి వేయాలి. అవి ఉడకడానికి సరిపడా నీటిని వేయాలి.

2. అలాగే క్యారెట్, ములక్కాడ, ఆనపకాయ ముక్కలు వేసి ఉడికించాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి, ధనియాలు, సెనగపప్పు వేయించాలి.

4. వాటిని మిక్సీ జార్లో వేయాలి. అలాగే కొబ్బరి తురుమును కూడా వేసి ఒకసారి పొడిలా చేసుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి కుక్కర్లో ఉడికించుకున్న పప్పును అందులో వేసుకోవాలి.

6. అందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నా పొడిని వేసి బాగా కలపాలి.

7. అలాగే రుచికి సరిపడా ఉప్పు, చింతపండు రసం, బెల్లం తురుము వేసి మరిగించుకోవాలి.

8. ఇది సాంబార్ లాగా మరుగుతుంది. ఆ సమయంలో ముందుగానే వండుకున్న అన్నాన్ని ఇందులో వేసి బాగా కలపాలి.

9. ఇప్పుడు స్టవ్ మీద వేరే కళాయి పెట్టి నెయ్యి వేయాలి.

10. ఆ నెయ్యిలో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.

11. తర్వాత జీడిపప్పులు, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, కరివేపాకులు, కొత్తిమీర వేసి వేయించి వాటిని అన్నం మీద వేసుకోవాలి.

12. అంతే టేస్టీ బిసిబెలాబాత్ రెడీ అయినట్టే.

13. ఇది తినే కొద్ది తినాలనిపిస్తుంది. అన్నం మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా అలా గొంతు జారిపోతుంది. పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు.

బిసిబెలాబాత్‌లో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఉన్న పదార్థాలనే వేసాము. కాబట్టి ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఒకసారి దీన్ని వండుకొని చూడండి. మీరే ఇష్టంగా తింటారు. సాంబార్ రైస్ కన్నా ఈ బిసిబెలాబాత్ చాలా రుచిగా ఉంటుంది.

WhatsApp channel

టాపిక్