పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితంలో ఒక మధురమైన కల. ఆ ప్రత్యేకమైన రోజున తాను ప్రపంచంలోనే అత్యంత అందంగా కనిపించాలని, అందరి దృష్టి తనపైనే ఉండాలని ప్రతి వధువు ఆశిస్తుంది. అయితే ఫ్యాషన్ ప్రపంచం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కొత్త ట్రెండ్‌లను చూసి చాలా మంది అమ్మాయిలు తొందరపడి తమ శరీర ఆకృతికి ఏ మాత్రం సరిపోని లెహంగాలు, బ్లౌజ్‌లను ఎంచుకుంటారు. ఇవి పైకి చూడటానికి ఆకర్షణీయంగా అనిపించినా, సరైన ఫిట్ లేకపోవడం వల్ల పెళ్లి రోజున అసౌకర్యానికి గురవుతారు. జీవితాంతం గుర్తుండిపోయే ఆ సంతోషకరమైన క్షణాలు కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
అందుకే, లెహంగాతో పాటు దాని బ్లౌజ్‌ను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం సోషల్ మీడియాలో కనిపించే మెరిసే డిజైన్‌లను గుడ్డిగా నమ్మకుండా, కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మీ శరీరాకృతి తగ్గట్లుగా, మీ వ్యక్తిత్వాన్ని చాటిచెప్పేలా, మిమ్మల్ని మరింత అందంగా చూపించేలా పెళ్లి బ్లౌజ్‌ను ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లి బ్లౌజ్‌ను కుట్టించే ముందు ప్రస్తుత ఫ్యాషన్ ట్రెండ్‌లతో పాటు మీ శరీర ఆకృతి కూడా దృష్టిలో ఉంచుకోవడం చాలా అవసరం. మీ బాడీకి బాగా షేప్ కు తగ్గట్టుగా ఉండే డిజైన్‌ను ఎంచుకున్నప్పుడే మీరు నిజంగా అద్భుతంగా కనిపిస్తారు. సరైన ఫిట్టింగ్ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది, మీ అందాన్ని మరింతగా పెంచుతుంది.
మీరు పొట్టిగా ఉంటే డీప్ నెక్ డిజైన్‌లు మిమ్మల్ని పొడవుగా చూపించడంలో సహాయపడతాయి. అయితే మీరు ఎంచుకునే డీప్ నెక్ మీకు సౌకర్యంగా ఉండాలి, అతిగా, అన్ కంఫర్టబుల్‌గా అనిపించకూడదు. V నెక్, ప్రిన్సెస్ కట్, స్వీట్‌హార్ట్ నెక్‌లైన్‌లు వంటివి పొట్టి అమ్మాయిలకు చాలా చక్కగా ఉంటాయి. ఇవి మెడను పొడవుగా చూపిస్తాయి, ఒక సొగసైన రూపాన్ని అందిస్తాయి.
ఎత్తుగా ఉన్న అమ్మాయిలు నెక్ లైన్‌లను కాస్త డీప్ గా కుట్టించుకుంటే మంచిది. జీరో నెక్, బోట్ నెక్ వంటి డిజైన్‌లు వారికి చాలా బాగా సరిపోతాయి. ఒక ప్రత్యేకమైన, క్లాసిక్ లుక్ అందిస్తాయి. కాలర్ నెక్ డిజైన్‌లు కూడా పొడవుగా ఉండే వారికి ఒక స్టైలిష్ ఎంపిక కావచ్చు.
మీ చేతులు కాస్త బలిష్టంగా ఉండే మీరు నిలువు ఎంబ్రాయిడరీ, జరీ వర్క్ ఉన్న బ్లౌజ్‌లను ఎంచుకోవడం తెలివైన పని. నిలువు డిజైన్‌లు కంటికి ఒక భ్రాంతిని కలిగిస్తాయి. చేతులు సన్నగా, పొడవుగా కనిపించేలా చేస్తాయి. ఇలాంటి వారు మరీ పొట్టిగా ఉండే స్లీవ్స్‌ను (షార్ట్ స్లీవ్స్ కుట్టించుకోకపోవడమే మంచిది. మోచేతుల వరకు లేదా అంతకంటే పొడవుగా ఉండే స్లీవ్స్ మీ చేతులకు అందంగా ఉంటాయి. మీ రూపాన్ని మరింత మెరుగుపరుస్తాయి. చేతులు కాస్త సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి డిజైన్లలోనైనా గ్రాండ్ గానే కనిపిస్తారు.
మీరు చాలా సన్నగా ఉండి మీ ఛాతీ పరిమాణం తక్కువగా ఉంటే మీ లెహంగా లేదా చీరకు భిన్నమైన, కాంట్రాస్ట్ రంగులో ఉండే బ్లౌజ్‌ను ఎంచుకోవడం ఒక అద్భుతమైన టెక్నిక్. ఇలా చేయడం వల్ల మీ శరీర పైభాగం మరింత నిండుగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా, పఫ్ స్లీవ్స్ లేదా రఫుల్డ్ స్లీవ్స్ వంటి డిజైన్‌లు మీ భుజాలకు, ఛాతీకి అదనపు వాల్యూమ్‌ను జోడిస్తాయి. మీరు మరింత నిండుగా కనిపించేలా చేస్తాయి.
మీరు బొద్దుగా ఉండి, ప్లస్ సైజ్‌లో ఉంటే ఒకే రంగు లేదా ఒకే రంగు కుటుంబానికి చెందిన వివిధ షేడ్స్‌లో ఉండే లెహంగా లేదా చీరను ఎంచుకోవడం ఉత్తమం. దానికి సరిపోయేలా చక్కగా ఫిట్ అయ్యే బ్లౌజ్‌ను కుట్టించుకోండి. ఇలా చేయడం వల్ల మీ శరీరం సన్నగా కనిపిస్తుంది. డీప్ నెక్ డిజైన్‌లు, 3\4 చేతులు కూడా బొద్దుగా ఉన్నవారికి చాలా బాగా సూట్ అవుతాయి. ఇవి మీ చేతులను సన్నగా చూపించి మీ లుక్‌ని బ్యాలెన్స్ చేస్తాయి.
బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు అది చాలా బిగుతుగా లేదా చాలా వదులుగా ఉండకూడదు. కాబట్టి కుట్టించుకునేటప్పుడు దాని ఫిట్టింగ్‌పై అత్యంత ఎక్కువ శ్రద్ధ వహించండి. సరైన ఫిట్ మీ శరీర ఆకృతిని మరింత మెరుగుపరుస్తుంది, సౌకర్యవంతంగా అనిపిస్తుంది. అలాగేమంచి క్వాలిటీ కలిగిన ప్యాడ్‌లను బ్లౌజ్‌లో తప్పనిసరిగా ఉంచండి. దీనివల్ల మీరు మీ బ్రా స్ట్రాప్‌ల గురించి నిరంతరం చింతించాల్సిన అవసరం ఉండదు. బాడీ షేప్ మెరుగ్గా కనిపిస్తుంది. పెళ్లి ఫోటోలు మరింత అందంగా వస్తాయి.