Ulli karam dosa: నోరూరించే ఉల్లికారం దోశ రెసిపీ
Ulli karam dosa: స్పైసీ, టేస్టి ఉల్లికారం దోశ రుచి చూడాలనుందా? చూడగానే నోరూరించే ఈ రెసిపీ విధానం చూసేయండి. ఉల్లి కారం తయారీతో పాటూ, దోశల తయారీ కూడా పక్కా కొలతలతో చూడండి.
ఉల్లికారం దోశ
ఉల్లికారం దోశ గురించి చాలా సార్లు వినే ఉంటారు. కానీ చాలా మందికి దీని పర్ఫెక్ట్ రెసిపీ తెలీదు. చూడగానే నోరూరించే ఈ దోశ రెసిపీ చాలా సింపుల్. ఉల్లిపాయలతో సింపుల్ చట్నీ చేసుకుని దోశ వేశాక అంతటా రాసి సర్వ్ చేయాలి. ఈ దోశ తిన్నారంటే ఈ మసాలాకు, రుచికి ఫ్యాన్ అయిపోతారు. దోశల రుచి మార్చేసే ఈ రెసిపీ చూసేయండి. అలాగే దోశ సరిగ్గా రాకపోతే దానికోసం కూడా కొలతలు ఇచ్చాం. వాటిని ఫాలో అయితే బెస్ట్ దోశలు వేయొచ్చు.
ఉల్లికారం దోశ కోసం కావాల్సిన పదార్థాలు:
దోశ కోసం:
2 కప్పుల బియ్యం
1 కప్పు మినప్పప్పు
1 టీస్పూన్ మెంతులు
2 చెంచాల శనగపప్పు
4 చెంచాల పోహా
ఉప్పు
ఉల్లి కారం కోసం:
3 పెద్ద ఉల్లిపాయలు
3 ఎండుమిర్చి
4 వెల్లుల్లి రెబ్బలు
1 చెంచా నూనె
1 చెంచా జీలకర్ర
1 రెమ్మ చింతపండు
ఉప్పు
ఉల్లికారం తయారీ విధానం:
- ఒక ప్యాన్ పెట్టుకుని చెంచాడు నూనె వేసుకోండి. వేడెక్కాక జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించండి.
- వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, ఉప్పు వేసి రెండు నిమిషాలు మగ్గించి స్టవ్ కట్టేయండి.
- చల్లారాక అన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోండి. అంతే. ఉల్లికారం రెడీ.
దోశల తయారీ విధానం:
- బియ్యం, మినప్పప్పు బాగా కడుక్కుని నీళ్లు పోసుకుని ఒక పూటంతా నానబెట్టుకోవాలి.
- అందులోనే మెంతులు, శనగపప్పు వేయడం మర్చిపోకండి.
- పిండి మిక్సీ పట్టుకునే పావుగంట ముందు అటుకుల్ని నానబెట్టుకోవాలి.
- నానిన బియ్యం, పప్పుల నుంచి నీళ్లు వంపేసి అటుకులు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఒక పూట పిండి పులిస్తే దోశ పిండి రెడీ అయినట్లే.
- ఇప్పుడు దోశలు వేసుకోడానికి పెనం పెట్టుకుని దోశ వేసుకోవాలి. దోశ మీద నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కాస్త రంగు మారేదాకా ఆగాలి.
- ఇప్పుడు ఉల్లిపాయ చట్నీ ఒక చెంచాడు తీసుకుని దోశ అంతటా రాయాలి.
- మీద ఇష్టం ఉంటే కాస్త కొత్తిమీర చల్లుకుని ఒకసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి.
- అంతే.. తీసి తినేయడమే. చట్నీతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది.