Suma Hairstyles: యాంకర్ సుమ లాంటి బెస్ట్ హెయిర్ స్టైల్స్.. పండగ రోజు మీరూ ట్రై చేయొచ్చు
Suma Hairstyles: యాంకర్ సుమ ప్రతి వేడుకలోనూ ప్రత్యేకంగా కనిపిస్తుంది. కొత్త లుక్స్‌కి కారణం విభిన్న హెయిర్ స్టైల్స్ కూడా. ఈ వినాయక చవితి రోజు ప్రత్యేకంగా కనిపించాలంటే సుమ లాంటి సింపుల్ హెయిర్ స్టైల్స్ మీరూ ప్రయత్నించొచ్చు.
యాంకర్ సుమ రోజుకో టీవీ షోలో, ఆడియో లాంచ్‌లలో, సినిమా రిలీజ్ ఫంక్షన్లలో కనిపిస్తూనే ఉంటారు. అయినా ప్రతి షోకు విభిన్నంగా కనిపిస్తారామె. జుట్టు నుంచి ఆహార్యం వరకు సందర్భాన్ని బట్టి రకరకాల మార్పులు చేస్తూ కొత్తగా కనిపిస్తారు. ఈ వినాయక చవితికి మీరూ కొన్ని సుమ లాంటి హెయిర్ స్టైల్స్ ప్రయత్నించండి. చూడ్డానికి కొత్తగా, వేసుకుంటే సింపుల్‌గా ఉంటాయివి. ఒకసారి వాటిమీద లుక్కేయండి
మెస్సీ బ్రెయిడ్ లుక్:
మెస్సీ బ్రెయిడ్ అంటే కాస్త చిందర వందరగా ఉండే జడ అనుకోండి. ఒక్క వెంట్రుక కూడా అటూ ఇటూ పోకుండా జడ వేసుకోకండి. అది పాత స్టైల్. వేసిన జడకు రబ్బర్ పెట్టేసి, ప్రతి పాయను కాస్త లాగినట్లు చేయాలి. దీంతో మెస్సీ లుక్ క్రియేట్ అవుతుంది. అలాగే పాపిట కూడా మీరెప్పుడూ తీసేలా కాకుండా సైడ్ క్రాఫ్ ట్రై చేయండి. కొత్తగా కనిపిస్తారు.
స్టెప్ బ్రెయిడ్:
జడను అల్లకుండా ముందు పోనీ టెయిల్ వేసుకుని జుట్టంతా కలిపి రబ్బర్ పెట్టేయండి. తర్వాత కొద్ది కొద్దిగా ఎడం ఇస్తూ అల్లుకోకుండా రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటూ రండి. సింపుల్ గా మంచి లుక్ క్రియేట్ అవుతుంది. మీ డ్రెస్‌కు తగ్గట్లు రంగుల రబ్బర్ బ్యాండ్స్ వాడండి. లేదా కాస్త ట్రెండీగా ఉండే ఫ్లోరల్ పిన్నులు పెట్టుకోవచ్చు. స్టోన్స్ ఉండే రబ్బర్ బ్యాండ్లు, చిన్న క్లచెస్ పెట్టుకున్నా కూడా అందంగా కనిపిస్తుంది. ఈ స్టైల్ పిల్లలకు కూడా బాగుంటుంది.
బోహో స్టైల్ లుక్:
ఈ హెయిర్ స్టైల్ కోసం ముందు కాస్త జుట్టు వదిలిపెట్టి వెనక వైపు జుట్టు కొద్దిగా తీసుకుని పైన రబ్బర్ బ్యాండ్ లేదా హెయిర్ నాట్ వేసేయాలి. ముందు వైపు వదిలేసిన హెయిర్ కర్లీగా చేసుకున్నా, స్ట్రెయిటెన్ చేసుకున్నా మంచి హెయిర్ లుక్ వస్తుంది. అటు సాంప్రదాయంగా, ఇటు ట్రెండీగానూ ఉంటుందీ లుక్. చీర మీదకీ, చుడీదార్ల మీదకీ.. అటు క్యాజువల్ లుక్ మీదకీ ఈ హెయిర్ స్టైల్ బాగుంటుంది.
పోనీటెయిల్:
పోనీటెయిల్ వేసుకోవడం సాధారణమే. కానీ పండగరోజు ప్రత్యేకంగా కనిపించాలంటే ఇలా ప్రయత్నించండి. మధ్యలో పాపిట తీసి ముందు వైపు జుట్టు జడలాగా కొద్దికొద్దిగా జుట్టు తీసుకుంటూ వెనక దాకా అల్లేయండి. వెనకాల చిన్న క్లచ్ పెట్టుకోండి. తర్వాత పోనీటెయిల్ వేసుకోండి. లేదంటే సైడ్ పాపిట తీసి ఒక వైపు ఇలా అల్లుకుని మరో వైపు అలా వదిలేసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నా మంచి లుక్ వస్తుంది. ఒకసారి ప్రయత్నించండి. మీకు మీరే కొత్తగా కనిపిస్తారు.