Best Diet: ఈ ఐదు రోజుల డైట్ ఫార్ములాను ఫాలో అవ్వండి, మీ చర్మం తిరిగి యవ్వనంలోకి వెళ్ళిపోతుంది
Best Diet: వయసును తగ్గించుకోలేకపోవచ్చు, కానీ వయసుతో పాటు వచ్చే సమస్యలను తగ్గించుకోవచ్చు. అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారపరంగా ప్రత్యేక శ్రద్ధ అవసరం.
Best Diet: వయసు పెరుగుతున్న కొద్దీ ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ముఖం ముదిరిపోయినట్టు కనిపిస్తుంది. ముఖంపై చర్మం పొడి బారిపోయి, గీతలు. ముడతలు పడతాయి. అలా కాకుండా మీ చర్మం యవ్వనంగా మారుతుంది. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా వారు అధ్యయనం చేసి ఈ కొత్త డైట్ కనుగొన్నారు. ఇది జీవ సంబంధమైన వయస్సును తగ్గించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఇందులో తినే ఆహారాలు ప్రత్యేకంగా ఉంటాయి.
ఈ కొత్త డైట్‌లో అసంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. కేలరీలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఐదు రోజులపాటు ఈ డైట్‌ను ఫాలో అవ్వడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతో పాటు క్యాలరీలు చాలా తక్కువగా అందుతాయి. కాబట్టి ఉపవాసం చేసిన ఫీలింగ్ వస్తుంది. ఈ డైట్ ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకోవడం కోసం రెండు సార్లు క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించారు.
ఏమిటీ డైట్?
క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 18 నుంచి 70 ఏళ్ల వయసు మధ్య గల పురుషులు, స్త్రీలను తీసుకున్నారు. వారికి ఈ డైట్లో భాగంగా కొన్ని రకాల సూప్‌లు, ఎనర్జీ బార్లు, ఎనర్జీ డ్రింక్స్, స్నాక్స్, టీ... వంటివి ఐదు రోజులు పాటు అందించారు. అలాగే ఖనిజాలు, విటమిన్లు, కొవ్వు ఆమ్లాలను అందించే సప్లిమెంట్లను కూడా ఇచ్చారు. కొన్ని నెలల పాటు వారిపై ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. వీటిని తినడం వల్ల పొట్ట పూర్తిగా నిండదు. ఖాళీగా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ శరీరానికి మాత్రం శక్తి అందుతుంది. ఇదే ఈ డైట్ స్పెషాలిటీ.
క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఈ డైట్లో పాల్గొన్నవారు తమ వయసును దాదాపు రెండున్నర సంవత్సరాలకు తగ్గించుకున్నట్టు ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. వారి చర్మం చాలా యవ్వనంగా మారిందని వివరించాయి. వృద్ధాప్యానికి సంబంధించిన మార్పులు రావడంలో ప్రధాన కారకాలను ఈ ఆహార పద్ధతి ద్వారా తగ్గించినట్టు ఈ అధ్యయనకర్తలు చెబుతున్నారు. ఈ డైట్ తీసుకుంటే అంతకన్నా తక్కువ వయసు ఉన్నట్టు కనిపించడం సులువు. ఈ డైట్ ప్రస్తుతం పరిశోధన దశలోనే ఉంది. ప్రపంచానికి పరిచయం కావడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం రెండు సార్లు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేశారు. అన్ని రకాల అనుమతులు తీసుకున్నాక ప్రజలకు పరిచయం చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు.
చాలామంది బరువు తగ్గించుకునేందుకు ఎక్కువ రోజులు ఉపవాసం ఉండేందుకు ఇష్టపడతారు. ఇప్పుడు ఈ కొత్తగా పరిచయమయ్యే డైట్ ను ఫాలో అయితే ప్రత్యేకంగా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. శరీరానికి శక్తి అందుతూనే, కొవ్వు పేరుకుపోకుండా... శరీరంలో ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. దీనిలో భాగంగా రోజులో చేసే చివరి భోజనానికి, మరుసటి రోజు చేసే తొలి భోజనానికి మధ్య కనీసం 16 గంటల పాటు గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. అలా ఉండడం ద్వారా కొవ్వును కరిగించుకుంటామన్నది వారి ఉద్దేశం. కొంతమందిలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చక్కగానే పనిచేస్తుంది. ఇది బరువు తగ్గడానికి మాత్రమే సహకరిస్తుంది, చర్మాన్ని కాంతివంతం చేయడానికి, జీవ సంబంధమైన వయసును ప్రభావితం చేయడానికి ఇది ఏమాత్రం పనిచేయలేదు. అందుకే పరిశోధనకర్తలు వయసును తగ్గించే డైట్ కోసం పరిశోధనలు చేస్తున్నారు. ఇది దాదాపు విజయవంతమైనట్టే.