Besan Dosa: అప్పటికప్పుడు శెనగపిండి దోశ ఇలా వేసేయండి, రుచిగా ఉంటుంది
Besan Dosa: ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఒకసారి శనగపిండితో ఇలా దోశ వేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఫేమస్ టిఫిన్.
అప్పటికప్పుడు రెడీ అయ్యే బ్రేక్ ఫాస్ట్ కోసం వెతుకుతున్నారా? మీకోసమే మేము ఇక్కడ శెనగపిండి దోశల రెసిపీ ఇచ్చాము. దీన్ని బేసన్ చీలా అంటారు. దీనిలో ప్రోటీన్లు నిండి ఉంటాయి. పిల్లలకి ఇది బాగా నచ్చుతుంది. దీనికి కేవలం పది నిమిషాల్లో వండేయచ్చు. బేసిన్ చీలా రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
శెనగపిండి దోశ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
శెనగపిండి - ఒక కప్పు
నూనె - సరిపడినంత
నీళ్లు - తగినన్ని
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
అల్లం తరుగు - ఒక స్పూను
టమోటోలు తరుగు - రెండు స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు
ఉల్లిపాయలు తరుగు - మూడు స్పూన్లు
పసుపు - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - ఒక స్పూను
శెనగపిండి దోశ రెసిపీ
1. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటోలను చాలా సన్నగా తరగాలి.
2. అలాగే అల్లం ముక్కను కూడా దంచి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండిని వేసి అర స్పూను జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
4. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటోలు, పచ్చిమిర్చి, అల్లం వేసి బాగా కలపాలి.
5. కొత్తిమీర తరుగును కూడా వేసి బాగా కలుపుకొని నీళ్లు పోసుకోవాలి.
6. దోశ వేయడానికి ఎంత మందంగా కావాలో అంత మందంగా పిండిని కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
7. ఇలా పది నిమిషాలు పక్కన పెట్టడం వల్ల నీటిని అందులోని పదార్థాలన్నీ పీల్చుకుంటాయి.
8. దాని తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి.
9. శెనగపిండి రుబ్బుతో ఒక గరిటె మిశ్రమం తీసి పెనం మీద దోశల వేసుకోవాలి.
10. రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది.
11. కొబ్బరి చట్నీతో లేదా టమోటో చట్నీతో దీని రుచి అదిరిపోతుంది.
12. టేస్ట్ పరంగా శెనగపిండి దోశ, కొబ్బరి చట్నీ కాంబినేషన్ అదుర్స్.
13. ఇది ఎలా చేయాలో తెలుసుకున్నారు కాబట్టి ఒకసారి చేసి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.
శనగపిండిని అప్పుడప్పుడు తినడం వల్ల ఆరోగ్యానికి మేలే జరుగుతుంది. ఎందుకంటే దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. మొటిమలు తగ్గించడంలో, చర్మసంరక్షణలో ఇది ముందుంటుంది. అలాగే పొడిబారిన చర్మాన్ని మృదువుగా మార్చడంలోనూ సహాయపడుతుంది. శనగపిండితో వండిన వంటకాలు ఎక్కువగా తింటే పొట్ట ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది. కానీ అప్పుడప్పుడు ఇలా దోశలను తినడం వల్ల ఎలాంటి సమస్య రాదు. శనగపిండిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. శరీర జీర్ణశక్తికి అవసరమైన డైరీ ఫైబర్‌లను కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని అప్పుడప్పుడు ఆహారంలో భాగం చేసుకోండి.