Bendakaya Recipe: ఈ బెండకాయ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే వదల్లేరు, రెసిపీ తెలుసుకోండి
Bendakaya Recipe: బెండకాయతో వేపుళ్లు, పులుసులు చేసుకొని ఉంటారు. ఇక్కడ మేము బెండకాయ పచ్చడి రెసిపీ ఇచ్చాము. ఇది అద్భుతంగా ఉంటుంది.

బెండకాయ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలలో ఒకటి. దీంతో ఎప్పుడూ బెండకాయ పులుసు లేదా సాంబార్లో బెండకాయ ముక్కలు వేయడం, బెండకాయ ఫ్రై వంటివే చేస్తారు. ఒక్కసారి మేము చెప్పిన పద్ధతిలో బెండకాయ పచ్చడి చేసుకొని చూడండి... ఎంత అద్భుతంగా ఉంటుందో. బెండకాయ జిగటగా ఉంటుంది కదా అనుకోవచ్చు. పచ్చడి మాత్రం అద్భుతంగా వస్తుంది. అన్నంలో కలుపుకుంటే రుచిగా ఉంటుంది. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
బెండకాయ పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
బెండకాయలు - పావు కిలో
టమోటోలు - రెండు
నూనె - రెండు స్పూన్లు
మెంతులు - పావు స్పూను
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
ధనియాలు - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు - అయిదు
ఎండుమిర్చి - పది
కొత్తిమీర - గుప్పెడు
కరివేపాకులు - గుప్పెడు
చింతపండు - ఉసిరికాయ సైజులో
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - చిటికెడు
పచ్చి శెనగపప్పు - అర స్పూను
మినప్పప్పు - అర స్పూను
ఇంగువ - చిటికెడు
బెండకాయ పచ్చడి రెసిపీ
1. బెండకాయ పావు కిలో తీసుకొని సన్నగా చక్రాల్లాగా కోసుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.
3. అందులో పావు స్పూను మెంతులు, ఒక స్పూను జీలకర్ర, అర స్పూను ఆవాలు, రెండు స్పూన్ల ధనియాలు, ఐదు వెల్లుల్లి రెబ్బలు, పది ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకులు, గుప్పెడు కొత్తిమీర తరుగు వేసి వేయించాలి.
4. ఆ మొత్తం మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయిని పెట్టి అందులో నూనె వేయాలి.
6. ఆ నూనెలో బెండకాయ ముక్కలను దోరగా వేయించుకోవాలి.
7. అందులోని టమోటో ముక్కలు, చింతపండు కూడా వేసి వేయించాలి.
8. ఉప్పు, పసుపు కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి.
9. ఇది పచ్చివాసన పోయేదాకా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి.
10. ఇప్పుడు మిక్సీలో ఈ బెండకాయ ముక్కలు, ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
11. ఇప్పుడు ఆ మొత్తం మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేయాలి.
12. దీనికి తాళింపు పెట్టేందుకు స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి.
13. అందులో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి, కొన్ని కరివేపాకులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
14. అలాగే చిటికెడు ఇంగువ కూడా వేయాలి.
15. ఈ మొత్తం మిశ్రమాన్ని బెండకాయ పచ్చడిపై వేసుకోవాలి. అంతే రుచికరమైన బెండకాయ టేస్టీ పచ్చడి రెడీ అయినట్టే.
బెండకాయ తిన్నారంటే ఎవరికైనా నోరూరిపోతుంది. ఇది మీకు ఎంతో నచ్చడం ఖాయం. మేము చెప్పిన పద్ధతిలో వండి చూడండి... ఎంత బాగుంటుందో వేడివేడి అన్నంలో ఈ బెండకాయ పచ్చడి వేసుకొని తింటే ఆ రుచే వేరు.
బెండకాయలో పీచు అధికంగా ఉంటుంది. కాబట్టి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. దీనిలో మ్యూకస్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి గ్యాస్టిక్ సమస్యలు వంటివి రాకుండా ఉంటాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నయం చేయడంలో కూడా బెండకాయ ముందుంటుంది. బెండకాయలో వారంలో నాలుగు ఐదు సార్లు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలకు బెండకాయ తినిపించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
సంబంధిత కథనం