Bellam Kommulu: గోధుమ పిండితో బెల్లం కొమ్ములు ఇలా చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు-bellam kommulu recipe in telugu know how to make sweet recipes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bellam Kommulu: గోధుమ పిండితో బెల్లం కొమ్ములు ఇలా చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు

Bellam Kommulu: గోధుమ పిండితో బెల్లం కొమ్ములు ఇలా చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు

Haritha Chappa HT Telugu

Bellam Kommulu: బెల్లం కొమ్ములు గ్రామాల్లో అధికంగా తింటారు. ఈ ఆరోగ్యానికి కూడా మంచిదే. గోధుమ పిండితో బెల్లం కొమ్ములు ఎలా చేయాలో తెలుసుకోండి.

బెల్లం కొమ్ములు రెసిపీ

సాయంత్రం అయితే ఏం తినాhలా అని ఆలోచిస్తున్నారా? బెల్లం కొమ్ములు ఒకసారి చేసి పెట్టుకుంటే రెండు మూడు వారాలు పాటు తాజాగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు ఇవి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎందుకంటే దీంట్లో మనం బెల్లాన్ని ఉపయోగిస్తాము. కాబట్టి రక్తహీనత సమస్య నుంచి వారు బయటపడతారు. గోధుమ పిండితో బెల్లంతో తయారు చేసే ఈ బెల్లం కొమ్ములు చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. మైదా పిండితో చేసే ఆహారాల కన్నా ఇలా గోధుమపిండి చేసే ఆహారాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక బెల్లం కొమ్ములు రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

బెల్లం కొమ్ములు రెసిపీకి కావలసిన పదార్థాలు

గోధుమపిండి - రెండు కప్పులు

ఉప్పు - అర స్పూను

బటర్ - యాభై గ్రాములు

నీళ్లు - తగినన్ని

బెల్లం తురుము - రెండున్నర కప్పులు

యాలకులు పొడి - అర స్పూను

బెల్లం కొమ్ములు రెసిపీ

1. బెల్లం కొమ్ములు తయారు చేసేందుకు ముందుగా గోధుమ పిండిని ఒక గిన్నెలో వేయండి.

2. అందులోనే అర స్పూను ఉప్పు కూడా వేసి ఒకసారి కలపండి.

3. ఇప్పుడు బటర్‌ను మరిగించి ఇందులో వేసి ఒకసారి కలపండి.

4. తగినంత నీళ్లను చేర్చి చపాతీ పిండిని కలుపుకున్నట్టు ఈ పిండిని కలుపుకోండి.

5. పైన మూత పెట్టి పది నిమిషాలు పక్కన వదిలేయండి.

6. తర్వాత చిన్న ముద్దను తీసి మందంగా చపాతీల్లా ఒత్తుకోండి.

7. వాటిని చాకుతో కొమ్ముల కోయండి.

8. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయండి.

9. అందులో ఈ కొమ్ములను వేసి రంగు మారే వరకు వేయించండి.

10. మరోపక్క గిన్నెలో బెల్లం, యాలకుల పొడి, తగినంత నీరు వేసి పాకం వచ్చేలా రెడీ చేయండి.

11. నూనెలో వేగిన కొమ్ములను ఆ బెల్లం పాకంలో వేసి బాగా కలపండి.

12. అవి చల్లబడే వరకు అలా వదిలేయండి.

13. తర్వాత వాటిని విడివిడిగా చేత్తోనే విడదీసి ఒక కంటైనర్ లో భద్రపరచుకోండి.

14. ఇవి రెండు నుండి నాలుగు వారాలు పాటు తాజాగా ఉంటాయి.

మనం వాడినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. గోధుమపిండి నుంచి యాలకుల పొడి వరకు అన్ని మంచివే. కాబట్టి బయట దొరికే స్నాక్స్ కన్నా ఇది ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇలా బెల్లం కొమ్ములు తయారు చేసేందుకు ప్రయత్నించండి.