ఇంట్లో ఎప్పుడూ బంగాళదుంపలతో ఎన్నో రకాల జుట్టు సమస్యలను నయం చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును ఆలూతో కేవలం మీకిష్టమైన కర్రీలు, బజ్జీలు, చిప్స్ వంటివి మాత్రమే కాదు హెయిర్ మాస్క్‌లు కూడా తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపల రసంతో చాలా రకాల జుట్టు సమస్యలకు చెక్ పెట్టచ్చు. దీని వల్ల వెంట్రుకలకు కలిగే లాభాలేంటి? ఆలూ రసంతో ఎలాంటి హెయిర్ మాస్క్‌లు తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం రండి..
ఆలూలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని రసాన్ని చర్మం, జుట్టుకు అప్లై చేసుకుంటే అది అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా ఆలూ రసంతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల వెంట్రుకల ఆరోగ్యం మెరుగువుతుంది. వాటిని మెరిసేలా, బలంగా చేస్తుంది. బంగాళాదుంపల్లో అధికంగా లభించే పోషకాలు జుట్టుకు తేమను అందిస్తాయి. పోషణను పెంచుతాయి. అలాగే కురులకు చక్కటి కండిషనర్ గా పని చేసి జుట్టు పొరబారడాన్ని, రాలడాన్ని తగ్గిస్తుంది.
బంగాళాదుంప రసం వేసుకోవడం వల్ల కలిగే మార్పులు మీ జుట్టులో కనిపించడానికి కొంత సమయం పడుతుంది. బంగాళాదుంప రసం జుట్టు వేర్లలో ఆమ్ల స్థాయిని సరిగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది. జుట్టులోని వ్యర్థాలను తొలగించి, సంరక్షిస్తుంది. కానీ దీని ప్రభావం వెంటనే ఉండదని తెలుసుకోండి. జుట్టు వేర్ల నుంచి మార్పు తీసుకురావడం మొదలు పెడుతుంది. వారానికి కనీసం రెండు సార్లైనా ఈ మాస్క్‌లను ఉపయోగించడం వల్ల దాదాపు రెండు నుంచి మూడు వారాల్లో మీ వెంట్రుకల విషయంలో ఆరోగ్యకరమైన మార్పు కనిపిస్తుంది. మృదువైన, మెరిసే కురులను సొంతం చేసుకోవచ్చు.
మీకు పొడి జుట్టు ఉంటే ఒక బౌల్ తీసుకుని దాంట్లో రెండు లేదా 3 బంగాళాదుంపల రసాన్ని వేయండి. దీంట్లోనే ఒక గుడ్డు తెల్లసొన, ఒక టేబుల్ స్పూన్ తేనెను వేసి కలిగి తలకు అప్లై చేయండి. ఈ హెయిర్ ప్యాక్ తలలోని మట్టి, మురికికి వ్యతిరేకంగా పనిచేస్తుది. చక్కటి కండిషనర్‌లా పనిచేసి వెంట్రుకలను మృదువుగా మెరిసేలా తయారు చేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ జుట్టు పెరుగుదలను కూడా ప్రేరేపిస్తుంది. జుట్టుకు అందమైన, మృదువైన రూపాన్ని ఇస్తుంది.
2 బంగాళాదుంపలు రసం, ఒక పెద్ద ఉల్లిపాయను రసం తీసుకుని రెండింటినీ బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ిన తలంతా బాగా పట్టించి పావు గంట నుంచి అరగంట వరకూ ఉంచి ఆ తర్వాత తలస్నానం చేయండి. ఇది మీ జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. తలను, వెంట్రుకలను వేర్లతో సహా శుభ్రం చేసి అందంగా మెరిసేలా తయారు చేస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు మెండుగా లభించే కలబందతో బంగాళాదుంప రసాన్ని కలిపారంటే వెంట్రుకల విషయంలో మీరు అద్భుతాలను చూడచ్చు. ఇందుకోసం ఒక చిన్న గిన్నెలో బంగాళాదుంప రసం, 2 స్పూన్ల కలబంద రసం కలిపి తలకు వేసుకోవాలి. 15 నుంచి 20నిమిషాల తర్వాత తలను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ మాస్క్ తలలో వాపు, చుండ్రు, దద్దర్లు, దురద వంటి సమస్యలను తగ్గిస్తుంది. దీని శాంతింపజేసే లక్షణాలు మీ జుట్టు వేర్లను హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి రక్షిస్తాయి. వెంట్రుకల పోషణను పెంచుతాయి.
జుట్టు వేర్లను శుభ్రం చేయడానికి, బలమైన జుట్టు పెరుగుదలకు ఈ మాస్క్ చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం 3 స్పూన్ల బంగాళాదుంప రసం, ఒక స్పూన్ మందార పువ్వు రసం, ఒక స్పూన్ బాదం నూనె తీసుకొంది. అన్నింటినీ బాగా కలిపి తలకు అప్లై చేయండి. కాసేపటి తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేశారంటే బలమైన. మెరిసే జుట్టును సులభంగా పొందచ్చు.
మీరు మొదటిసారి బంగాళాదుంప రసాన్ని తలకు వేసుకుంటున్నట్లయితే, మీరు మంచి తాజా, మొలకెత్తని బంగాళాదుంపలను ఎంచుకోవాలి. మొదట కొద్దిగా ఉపయోగించి మీకు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ధారించుకోవాలి. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం