వేసవికాలం వచ్చేసింది. కాబట్టి ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తినే ఆహారం, పానీయాల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఈ కాలంలో తేలికగా ఉన్న పోషకాహారాన్ని మాత్రమే తినాలి. వేసవికాలంలో ఎక్కువగా వచ్చే కూరగాయలు బెండకాయ, దోసకాయ, టమోటోలు వంటివి. వీటినే అధికంగా తింటూ ఉంటారు. అయితే వీటిని తినే ముందు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిపై ఎక్కువగా పురుగుల మందులను చల్లుతారు. వీటిని సరిగా శుభ్రం చేసుకొని తినకపోతే పురుగుల మందులు శరీరంలో చేరే అవకాశం ఉంది.
బెండకాయ, దోసకాయ, టమోటోలను వండడానికి లేదా తినడానికి ముందు పరిశుభ్రంగా కడగాలి. టమోటోలను, దోసకాయను కొంతమంది పచ్చిగా తింటూ ఉంటారు. అలా తినేటప్పుడు దాన్ని పరిశుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. ఎందుకంటే వీటిపై మైనపు పొరను పూస్తారు. ఇవి మెరుస్తూ కనిపించడం వల్ల తాజాగా ఉంటాయి. అలా ఆ మైనపు పొర రావడానికి కొన్ని రకాల రసాయనాలను చల్లుతారు. ఇవి మీ ఆరోగ్యానికి చాలా హానికరం. అలాగే ఈ కూరగాయలు వండడానికి ముందు గోరువెచ్చని నీటిలో కాసేపు ఉంచండి. ఆ తర్వాత తీసి చేత్తోనే బాగా కడగండి. తర్వాత చల్లని నీటిలో వేసి మరోసారి కడగండి. ఇలా చేయడం వల్ల కూరగాయలపై ఉన్న పురుగుల మందులు తొలగిపోయే అవకాశం ఉంది.
కీరదోసను ఎంతోమంది ఇష్టంగా తింటారు. నిజానికి దాన్ని తొక్కతో తింటేనే ఆరోగ్యం. కానీ వాటిపై రసాయనాలు చల్లే ప్రమాదం ఉంది. కాబట్టి తొక్క తీసి తింటే ఆరోగ్యకరం. ఈ పురుగుల మందులు శరీరంలో చేరితే వేసవిలో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
బెండకాయని కూడా వండే ముందు పరిశుభ్రంగా కడగండి. దాన్ని ముక్కలుగా కోసి ఒక అరగంట పాటు గాలికి ఆరబెట్టండి. ఇలా చేయడం వల్ల వాటిలో ఉండే జిగట తగ్గిపోతుంది. కాబట్టి కూరలో ముక్కలు కూడా విడివిడిగా వస్తాయి.
టమోటోలలో విత్తనాలు అధికంగా ఉంటాయి. వేసవిలో విత్తనాలు లేని టమోటో తినడం ముఖ్యం. కాబట్టి మధ్యలో ఉన్న విత్తనాల భాగాన్ని తీసేసి ఆ తర్వాతే టమోటాను వాడితే మంచిది. ఈ విత్తనాలు కొందరిలో పొట్ట సమస్యలకు కారణం అవుతాయి. టమోటోలలో ఆక్సలైట్ అనే మూలకం ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యకు కారణం అవుతుంది. కాబట్టి టమోటాలను పరిశుభ్రంగా కడిగి విత్తనాలను తీసాకే తినేందుకు ప్రయత్నించండి.
వేసవిలో మనం తినే ఏ ఆహారాన్ని అయినా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం వేసవిలో అధికంగానే ఉంటుంది. అలాగే పరిశుభ్రంగా కడిగిన తర్వాతే కూరగాయలను కోసి వంట చేయాలి. పండ్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)
సంబంధిత కథనం