Saturday Motivation: ఉన్నదాని గురించి సంతోషపడకుండా... లేని దాని కోసం ఏడవకండి, ఉన్నదాంతో సంతృప్తి పొందండి
Saturday Motivation: ఎక్కువ ఆశించకండి... ఉన్నదాంతోనే సర్దుకుపోవడం నేర్చుకోండి. ఎంతగా సంతృప్తిగా జీవిస్తే మీరు అంత సంతోషంగా జీవిస్తారు.
Saturday Motivation: వేలు సంపాదిస్తున్న వారికి లక్షలు కావాలి. లక్షల సంపాదిస్తున్న వారికి కోట్లు కూడబెట్టాలి. ఆశకు హద్దు ఉండదు. సంతృప్తి అనేదే రాదు. ఉన్నదానితో సంతృప్తి పడాలని ఎంతమంది చెబుతున్నా వినే వారి సంఖ్య చాలా తక్కువే. వేలను, లక్షలుగా, కోట్లుగా... ఆ కోట్లతో బిలియనీర్లుగా మారాలన్న కాంక్ష పెరిగిపోతోంది. కానీ ఒక్కరిలో కూడా సంతృప్తిగా బతకాలన్న ఆశ పుట్టడం లేదు. డబ్బులు సంపాదించినంత సులువు కాదు... పోయిన కాలాన్ని తిరిగి తెచ్చుకోవడం, డబ్బులు సంపాదనలో పడి నేటి రోజును ఆనందించడం... ఎంతోమంది మరిచిపోయారు.
సంతోషం కోసం కాలాన్ని చక్కగా వినియోగించుకోవడం అవసరం. ఇంకా బాగా సంపాదించాలన్న కాంక్ష ఎప్పటికీ పోదు. దాని వెనకే పరుగెడితే జీవితమంతా మంచులా కరిగిపోవడమే. డబ్బులపై ఆశ ఉండొచ్చు... కానీ అత్యాశ ఉండకూడదు. డబ్బు మాత్రమే కాదు... ఏదైనా కూడా మన అవసరానికి ఎంత కావాలో అంతే అట్టి పెట్టుకోవడం మంచిది. అతిగా ఆర్జించడం మొదలుపెడితే అది అత్యాశగా మారిపోతుంది.
కొంతమందికి వేసుకున్న చెప్పులు నచ్చవు. వేల రూపాయలు పెట్టి కొని రెండు రోజుల్లోనే విసిరి పడేస్తారు. తిరిగి కొత్తవి కొనడానికి రెడీ అయిపోతారు. ఆ చెప్పుల విలువ ఎర్రటి ఎండలో పాదాలను మాడ్చుకుంటున్నా నిరుపేదలకు తెలుస్తుంది. ఏదైనా తమకు పైనున్న వారితో కాదు, తమకన్నా నీచ స్థితిలో ఉన్న వారిని ఒక్కసారి పోల్చుకుని చూడండి.... అప్పుడు తెలుస్తుంది మీరెంత ఉన్నత స్థితిలో ఉన్నారో. సంతృప్తి అనేది మన ఆలోచనను బట్టి ఉంటుంది. మీరు మీ పైనున్న వారిని చూసుకుంటే ఎప్పటికీ సంతృప్తిని పొందలేరు. అదే మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది... మీరున్న స్థితి మంచిగా ఉందని.
సంతృప్తి అనేది మనుషుల వ్యక్తిత్వం పై ఆధారపడి ఉంటుంది. ఒకరికి సంతృప్తి ఇచ్చేది మరొకరికి ఇవ్వకపోవచ్చు. ఒకరికి సంతోషాన్ని ఇచ్చేది మరొకరికి ఇవ్వకపోవచ్చు. ఒకరికి నవ్వు తెప్పించేది ఇంకొకరికి నవ్వు తెప్పించకపోవచ్చు. కాబట్టి వ్యక్తి తన అవసరాలకు తగ్గట్టు ఆలోచనలకు తగ్గట్టు సంతృప్తి పొందడం మంచిది.
ప్రపంచంలో ఈ మధ్య ఆకలి ఎక్కువైపోయింది. అలాంటి ఆకలి మూడు రకాలు. పొట్టకి వేసే ఆకలి ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి కలుగుతుంది. ఇక డబ్బు ఆకలి, పేరు ఆకలి... అనేవి కొందరిలోనే ఉంటుంది. డబ్బు ఆకలి ప్రతిరోజూ పెరుగుతూనే వస్తుంది. రోజురోజుకు సంపాదించాలన్న కోరిక పెరుగుతుంది. ఇలాంటి వారికి సంతృప్తి కనపడదు. ఇక పేరు ఆకలి... అంటే డబ్బు పోయినా పర్వాలేదు కానీ మంచి పేరును పెంచుకోవాలనుకుంటారు. అలాంటి వాటిలో కూడా సంతృప్తి తక్కువగానే ఉంటుంది. మనం చేసే మంచి పనులే మనకు పేరుని తెచ్చిపెడతాయి. పేరు కోసం ప్రత్యేకంగా అతను పడాల్సిన అవసరం లేదు.
ఇక డబ్బు ఆకలిని నియంత్రణలో ఉంచుకోపోతే జీవితంలో సంతృప్తి అనే పదానికి చోటు లేదు. ఎప్పుడూ డబ్బు సంపాదనలోనే ఉంటే సంతోషం అనేది దొరకదు. ముఖ్యంగా ఇంట్లో వారితో గడిపే సమయం తగ్గిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు, మీ డబ్బు మాత్రమే కనిపిస్తాయి. చెప్పుకోవడానికి సుఖంగా, సంతోషంగా గడిపిన క్షణాలు తక్కువైపోతాయి. కాబట్టి సంతృప్తిగా బతకడం నేర్చుకుంటే మీరు జీవితంలో ఎప్పుడు సంతోషంగానే ఉంటారు.