Balenciaga Shoes | పారిస్ స్నీకర్స్ షూస్.. లేటెస్ట్ ఫ్యాషన్, ధర తెలిస్తే షాక్!
ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ Balenciaga సరికొత్త డిజైన్ షూలను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ డిజైన్ చూసినా, వాటి ధరలు చూసినా కళ్లు తిరిగిపడిపోవడం ఖాయం.
ఫ్రాన్స్‌లోని పారిస్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ Balenciaga ఇటీవల సరికొత్త షూలను డిజైన్ చేసింది. 'పారిస్ స్నీకర్' అనే లేబుల్ మీద డిజైన్ చేసిన ఈ స్నీకర్ బూట్లు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే అంత గొప్పగా డిజైన్ చేశారా? అని అనుకుంటే మీరు ఆ షూలో కాలేసినట్లే. వాస్తవానికి ఆ స్నీకర్స్ డిజైన్ చూస్తే పరమ చెత్తగా ఉన్నాయి. ఎంతలా అంటే తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన బూట్ల లాగా. తాతల నుంచి తండ్రులు, తండ్రుల నుంచి వారి కొడుకులు అవే బూట్లను అరిగిపోయేలా తొడిగితే అప్పుడు ఆ బూట్లు ఎంత దారుణమైన స్థితిలో ఉంటాయో ఊహించుకోండి.. అచ్ఛం అదే రకంగా ఉంది ఆ బూట్ల డిజైన్.
ట్రెండింగ్ వార్తలు
ఈ బూట్ల అమ్మకానికి Balenciaga కంపెనీ 'అత్యంత తొడిగిన, అత్యంత చిరిగిన, అత్యంత మురికైన' క్లాసిక్ డిజైన్ పారిస్ స్నీకర్లు అంటూ భారీ స్థాయిలో ప్రకటనలు ఇచ్చింది. అంతేకాదు 'త్వరపడండి.. ఇవి లిమిటెడ్ ఎడిషన్ బూట్లు కేవలం 100 జతలు మాత్రమే డిజైన్ చేశాం' అంటూ ప్రచారం చేస్తుంది. ఈ ప్రచారం అంతా ఒక ఎత్తైతే వీటి ధరలు చూస్తే మీరు కళ్లు తిరిగి పడిపోవడం ఖాయం.
ఈ 'అత్యంత చెత్త' బూట్ల ధర ఒక జతకు $625 నుంచి $1,850 వరకు ఉన్నాయి. మన భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 43,304 నుంచి మొదలు కొని రూ. 1 లక్ష 43 వేల వరకు ఉన్నాయి.
ఈ అత్యంత మురికి షూలలో మీరు ఇంకా మోడల్స్ చూడాలనుకుంటే ఇక్కడ చూడవచ్చు.
మధ్య-శతాబ్దపు కాలం నాటి అథ్లెటిసిజం కాన్వాస్ షూస్ స్ఫూర్తితో రీటూల్ చేసిన క్లాసిక్ డిజైన్ అని ఫ్యాషన్ బ్రాండ్ నిర్వాహకులు చెబుతున్నారు. మీకు ఈ షూస్ కొనాలని ఆసక్తి ఉంటే 'బెలిన్సియాగా' బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి ఆర్డర్ ఇవ్వవచ్చు. ప్రపంచంలో ఎక్కడికైనా డెలివరీ సర్వీస్ ఉంది.
కానీ ఒక్కసారి ఊహించుకోండి టీక్ టాక్ తయారై ఎంతో ఖరీదైన ఇలాంటి షూస్ ధరించి ఏదైనా ఫంక్షన్ వెళ్తే మాత్రం మన దేశంలో గేట్ నుంచే తరిమికొడతారు. ఎక్కడో చెత్తలో పారేసిన చెత్త బూట్లను ఏరుకొచ్చి వేసుకున్నట్లే ఉంటుంది. కానీ పారిస్‌లో ఇప్పుడిదే లేటెస్ట్ ఫ్యాషన్.
సంబంధిత కథనం