Healthy Laddu: రోజుకో సజ్జల లడ్డు తినండి చాలు, నీరసమే రాదు రెసిపీ ఇదిగోండి
Healthy Laddu: సజ్జలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సజ్జలతో చేసిన ఆహారాలు తినే వారి సంఖ్య తక్కువే. వీటితో వండిన పదార్థాలు టేస్టీగా ఉండవేమో అనుకుంటారు, మేము ఇక్కడ సజ్జల లడ్డు రెసిపీ ఇచ్చాము. ఇది రుచిగా ఉంటుంది.
చిరుధాన్యాల్లో సజ్జలు ఒకటి. సజ్జలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వీటిని ఇంకా ఆహారంలో భాగం చేసుకోవడానికి ఆలోచిస్తున్న వారి సంఖ్య ఎక్కువే. కారణం వీటితో చేసిన ఆహారాలు ఏవీ రుచిగా ఉండవు అనుకుంటారు. వీటిని వండడం కష్టమని కూడా అనుకుంటారు. కానీ ఇక్కడ మేము సజ్జల లడ్డు రెసిపీ ఇచ్చాము. దీన్ని వండడం చాలా సులువు. ఒక్కసారి చేసుకుంటే రెండు వారాలు పాటు తాజాగా ఉంటాయి. రోజుకో లడ్డు తింటే చాలు. ఇవి శరీరానికి శక్తిని అందించడంతో పాటు ఎన్నో రకాల పోషకాలను ఇస్తాయి. సజ్జల లడ్డు రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
సజ్జల లడ్డు రెసిపీకి కావలసిన పదార్థాలు
సజ్జలు - ఒక కప్పు
బెల్లం - అర కప్పు
నెయ్యి - పావు కప్పు
సజ్జల లడ్డు రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి సజ్జలను కాసేపు వేయించుకోవాలి.
2. ఆ తర్వాత వాటిని తీసి మిక్సీలో వేసి పొడి లాగా చేసుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి చిన్న మంట పెట్టాలి.
4. ఆ మంట మీద నెయ్యిని వేయాలి.
5. నెయ్యి కరిగిన తర్వాత అందులో బెల్లం తురుమును వేసి గరిటతోనే బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.
6. ఈ నెయ్యి, బెల్లం మిశ్రమంలో ముందుగా చేసి పెట్టుకున్న సజ్జల పొడిని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
7. ఆ మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే టేస్టీ సజ్జల లడ్డు రెడీ అయినట్టే.
8. మీకు కావాలనుకుంటే వీటిలో డ్రై ఫ్రూట్స్ తురుమును కూడా చల్లుకోవచ్చు.
సజ్జల వల్ల ఉపయోగాలు
ప్రతిరోజూ ఒక్క సజ్జల లడ్డు తినండి చాలు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా రక్తహీనత సమస్య రాదు. ఇందులో మనం బెల్లాన్ని వేసాము, పంచదారని వాడలేదు. కాబట్టి ఈ లడ్డు తినడం వల్ల రక్తం ఉత్పత్తి అవుతుంది. సజ్జలు జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు కచ్చితంగా సజ్జలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రతిరోజు సజ్జల లడ్డు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి ముందుంటాయి. ఊబకాయం బారిన పడుతున్న వారు ప్రతిరోజు సజ్జలను తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది.
సజ్జలు ఎక్కువసేపు మీకు శక్తిని అందించడంతోపాటు పొట్ట నిండిన ఫీలింగ్ ను అందిస్తాయి. కాబట్టి మీరు ఇతర ఆహారాలు తినరు. దీని వల్ల మీలో కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుంది. ఊబకాయం బారిన పడకుండా ఉంటారు. సజ్జల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. శరీరాన్ని దృఢంగా చేస్తుంది. కీళ్ల నొప్పులు, బోలు ఎముకల వ్యాధి వంటివి రాకుండా ఇది అడ్డుకుంటుంది.